గుండెపోటు మృతుల్లో యువతరమే అధికం..కోవిడ్ టీకా ఎఫెక్టేనా?

దేశంలో గుండెపోటు మరణాలు, ముఖ్యంగా యువతలో పెరుగుతున్నాయి. కోవిడ్ టీకా ప్రభావమా అన్న చర్చ మధ్య సుప్రీంకోర్టు బాధితులకు పరిహారంపై కీలక ఆదేశాలు ఇచ్చింది.

గుండెపోటు మృతుల్లో యువతరమే అధికం..కోవిడ్ టీకా ఎఫెక్టేనా?

విధాత : దేశంలో కరోనా తీవ్రత అనంతరం గుండెపోటు మరణాల నమోదు అనూహ్యంగా పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తుంది. ముఖ్యంగా గుండెపోటు మరణాల్లో యుక్త వయస్కులే అధికంగా ఉండటం మరింత కలవర పెడుతుంది. హర్యానా రాష్ట్రం తాజాగా గుండెపోటు మరణాల గణంకాలపై చేదు వాస్తవాలను వెల్లడించింది.

ఆరేళ్లలో 18 వేల మందికి గుండెపోటు

హర్యానాలో ఆరు సంవత్సరాల వ్యవధిలో గుండెపోటు, గుండె సంబంధిత సమస్యతో 18,000 మంది మరణించినట్లుగా వెల్లడించింది. మృతుతలో 18 నుంచి 45 ఏళ్ల లోపువారే అధికంగా ఉన్నారని కూడా తెలిపింది. 2020 జనవరి నుంచి 2026 జనవరి మధ్యలో ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వెల్లడించడటం గమనార్హం.

మరోసారి తెరపైకి కరోనా వ్యాక్సిన్

కరోనా వైరస్ కాలం నుంచే గుండెపోటు మరణాలు అధికంగా కొనసాగుతున్నాయన్న చర్చ జనాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా కరోనా నివారణ వ్యాక్సిన్ పంపిణీ అనంతరం ఈ తరహా మరణాల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇందుకు శాస్త్రీయమైన లెక్కలు, నివేదికలు లేకపోయినప్పటికి ప్రజలలో మాత్రం కరోనా వైరస్, లేదా కోవిడ్ వ్యాక్సిన్ టీకా పంపిణీ అనంతరమే గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయన్న చర్చ మాత్రం కొనసాగుతుంది. కోవిడ్ నుంచి విముక్తి కోసం భారత్ లో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ల ప్రభావంతో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత కుటుంబాలు కోర్టులను ఆశ్రయించాయి. కోవిడ్ టీకా వేయించుకున్న తర్వాత కొందరు మరణించడం లేదా తీవ్ర అనారోగ్యానికి గురికావడంపై సుప్రీంకోర్టు స్పందించింది.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కోవిడ్ టీకా దుష్ప్రభావాల వల్ల ప్రాణాలు కోల్పోయిన అనారోగ్యం పాలైన వారిని ఆదుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రచన గంగు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వం బాధితులను వెంటనే ఆదుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ గణాంకాలే ఈ మరణాలను ధృవీకరిస్తున్నాయని, ఇది ఎంతో విచారకరమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సామాన్య ప్రజలు దేశం కోసం, తమ రక్షణ కోసం టీకా వేయించుకున్నప్పుడు, ఒకవేళ దాని వల్ల ఏదైనా అపశ్రుతి జరిగితే ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.

బాధితులు తమ తప్పు లేకపోయినా నష్టపోయారని కోర్టు అభిప్రాయపడింది. వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేసింది. దీనివల్ల ఆర్థికంగా కుంగిపోయిన ఎన్నో కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. టీకా వేయించుకోవడం అనేది సామాజిక బాధ్యతగా ప్రభుత్వం ప్రచారం చేసింది. అలాంటప్పుడు దాని వల్ల నష్టపోయిన వారిని వదిలేయడం సమంజసం కాదు అని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ డేటాలోనే లోపాలు వెల్లడైనప్పుడు, బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం చేయకూడదని పేర్కొంది.

కొత్త పరిహార పాలసీ అమలుకు ఆదేశాలు

కోవిడ్ టీకా బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకున్న సుప్రీంకోర్టు, వారిని ఆదుకోవడానికి తక్షణమే ఒక సమగ్రమైన పరిహార విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు
తప్పు ఎవరిదో నిరూపించాల్సిన అవసరం లేకుండానే పరిహారం అందించే ‘నో ఫాల్ట్ కాంపెన్సేషన్’ పాలసీని రూపొందించాలని ఈ సందర్బంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ప్రాణ నష్టం సంభవించినప్పుడు, అది ఎవరి తప్పు వల్ల జరిగిందో నిరూపించాల్సి ఉంటుంది. కానీ, సుప్రీంకోర్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక కొత్త విధానాన్ని సూచించింది. అదే నో ఫాల్ట్ కాంపెన్సేషన్ పాలసీ.

నో ఫాల్ట్ కాంపెన్సేషన్ పాలసీ అంటే ఏమిటి?

నో ఫాల్ట్ కాంపెన్సేషన్ పాలసీ అంటే..టీకా వల్ల నష్టం జరిగిందని నిరూపించడానికి బాధితులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రమాదం ఎవరి వల్ల జరిగింది? ఫార్మా కంపెనీ తప్పా? లేదా వైద్యుల తప్పా? అనే అంశాలతో సంబంధం లేకుండానే ప్రభుత్వం బాధితులకు పరిహారం చెల్లించాలి. టీకా తీసుకున్న తర్వాత అనారోగ్యం పాలైనట్లు లేదా మరణించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉంటే సరిపోతుంది. దీనివల్ల బాధితులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే త్వరితగతిన సహాయం అందుతుంది. సామాన్యుల ఆరోగ్యం, ప్రాణ రక్షణ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు సూచించింది. పిటిషన్‌ను విచారిస్తూ, బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, న్యాయమూర్తి సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం టీకా దుష్ప్రభావాలను పర్యవేక్షించడానికి ఇప్పటికే ఉన్న వ్యవస్థ అమలులో ఉండాలని ఆదేశించడం విశేషం.

ఇవి కూడా చదవండి :

Revanth Reddy : రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది తీపి కబురు!
Fake Paneer: హైదరాబాద్‌లో పన్నీరు కొంటున్నారా.. అయితే జాగ్రత్త