Google hikes Sundar Pichai pay package to about ₹63,000 crore over three years
విధాత ప్రపంచం డెస్క్ | హైదరాబాద్:
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు సంస్థ భారీ వేతన పెంపు ప్రకటించింది. గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ కంపెనీ వచ్చే మూడు సంవత్సరాల కాలానికి ఆయన మొత్తం పారితోషికాన్ని సుమారు రూ.63 వేల కోట్ల వరకు పెంచినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు వెల్లడించాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందే కార్పొరేట్ సీఈఓలలో పిచాయ్ ఒకరిగా నిలిచారు.
ఈ భారీ ప్యాకేజీలో ప్రధాన భాగం పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ (PSUs) రూపంలో ఉంటుంది. వీటి లక్ష్య విలువ సుమారు రూ.1,050 కోట్లకు పైగా ఉంటుంది. కంపెనీ పనితీరు అంచనాలను మించి ఉంటే ఈ మొత్తం రూ.2,100 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. అల్ఫాబెట్ కంపెనీ షేర్‌హోల్డర్ల రాబడిని S&P 100 సూచికలోని ఇతర కంపెనీలతో పోల్చి ఈ స్టాక్ బోనస్‌ను నిర్ణయిస్తుంది. లక్ష్యాలు చేరుకోకపోతే ఈ బోనస్ పూర్తిగా రాకపోవచ్చు.
ఇదికాకుండా పిచాయ్‌కు వచ్చే మూడు సంవత్సరాల్లో సుమారు రూ.700 కోట్ల విలువైన రిస్ట్రిక్టెడ్ స్టాక్ ఇవ్వనున్నారు. ఇవి ఆయన కంపెనీలో కొనసాగుతున్నంతకాలం నెలనెలా విడుదలవుతాయి. అదనంగా ఆయనకు ప్రతి ఏడాది సుమారు రూ.16 కోట్ల జీతం కూడా ఉంటుంది.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
Waymo, Wing ప్రాజెక్టులపై ప్రత్యేక స్టాక్ ప్రోత్సాహకాలు
స్వయం నియంత్రిత సాంకేతిక (Autonomous Projects) రంగాల్లో గూగుల్ పెట్టుబడులను వేగవంతం చేయడానికి అల్ఫాబెట్ సంస్థ ప్రత్యేక స్టాక్ ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా పిచాయ్‌కు
హైలైట్స్:
- సుమారు రూ.1,080 కోట్ల విలువైన Waymo షేర్లు
- సుమారు రూ.370 కోట్ల విలువైన Wing Aviation షేర్లు ఇవ్వనున్నారు. కంపెనీ పనితీరు బాగా ఉంటే ఈ షేర్ల విలువ రెండు రెట్లు వరకు పెరిగే అవకాశం ఉంది.

డ్రైవర్ లేకుండా నడిచే వేమో రోబోటాక్సీ.. అల్ఫాబెట్ సంస్థ అభివృద్ధి చేసిన స్వయం నియంత్రిత వాహన సాంకేతికత

డ్రోన్ ద్వారా పార్సిల్ డెలివరీ.. అల్ఫాబెట్‌కు చెందిన Wing సర్వీస్
2015 ఆగస్టులో సీఈఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పిచాయ్ నాయకత్వంలో గూగుల్ మార్కెట్ విలువ భారీగా పెరిగింది. ఆ సమయంలో సుమారు రూ.44 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్, ప్రస్తుతం రూ.300 లక్షల కోట్లకు పైగాపెరిగింది. ఈ ఏడాది జనవరిలో కొద్ది రోజుల పాటు అది రూ.330 లక్షల కోట్ల మార్క్‌ను కూడా తాకింది.
భారతీయుడైన 53 ఏళ్ల పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరి క్రోమ్ బ్రౌజర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. తరువాత ఆండ్రాయిడ్ విభాగాన్ని నడిపి సంస్థలో అగ్రస్థానానికి చేరుకున్నారు. ప్రారంభంలో గూగుల్ AI అభివృద్ధిలో ఆలస్యం చేసిందని విమర్శలు వచ్చినా, తరువాత పిచాయ్ నాయకత్వంలో కంపెనీ అత్యాధునిక AI మోడళ్లను విడుదల చేసి సెర్చ్ సేవల్లో వాటిని విజయవంతంగా ఉపయోగిస్తోంది.
ఇటీవల పిచాయ్ సుమారు రూ.80 కోట్ల విలువైన గూగుల్ షేర్లను విక్రయించారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన దాదాపు రూ.5,000 కోట్లకు పైగా విలువైన షేర్లు విక్రయించినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదికలు చెబుతున్నాయి. పిచాయ్ దంపతులు ప్రస్తుతం సుమారు రూ.4,000 కోట్ల విలువైన గూగుల్ షేర్లు కలిగి ఉన్నారు.
ఇదే సమయంలో ఇతర టెక్ దిగ్గజాల సీఈఓల పారితోషికం కూడా గణనీయంగానే ఉంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.800 కోట్లకు పైగా సంపాదించగా, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్కు అదే కాలంలో సుమారు రూ.620 కోట్ల పారితోషికం లభించింది.