Double Bedroom Scheme | ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాలో నిర్మించి, లబ్ధిదారులకు కేటాయించకుండా వదిలేసిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని హౌసింగ్ కార్పొరేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • By: TAAZ |    telangana |    Published on : Jan 30, 2026 9:32 PM IST
Double Bedroom Scheme | ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Double Bedroom Scheme | డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్టులు హౌసింగ్ కార్పొరేషన్ కు బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని 100 శాతం సబ్సిడీతో ప్రారంభించింది. అయితే.. ఇళ్లు పూర్తి చేసినా పంపిణీ చేయడంలో విఫలమైంది. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్లు, జిల్లాల్లో 1 లక్షా 72 వేల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 1 లక్షా 98 వేల ఇళ్లు పూర్తయినా, కేవలం 1 లక్షా 48 వేల ఇళ్లు మాత్రమే కేటాయించారు. 59 వేల ఇళ్లు ఖాళీగా ఉండిపోయాయి. వేలాది ఇళ్లు రెండు, మూడేళ్లుగా ఖాళీగా ఉండటంతో కిటికీలు, తలుపులు పాడైపోయి, కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ ఇళ్లకు రిపేర్లు చేయించి, పంపిణీకి చర్యలు చేపట్టింది.

తెలంగాణ రాష్ట్రంలో లబ్ధిదారులకు కేటాయించకుండా ఖాళీగా ఉన్న 59,400 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి హౌసింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు కేటాయించకుండా ఉన్న ఇళ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 59,400 ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్న పేదలకు ఈ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం దరఖాస్తులను మూడు కేటగిరీలుగా విభజించారు.