KG Basin Gas | గ్యాస్‌ బండ మోత వెనుక.. ఎంపీలు ఆ విషయంలో చూపిన నిర్లక్ష్యమే కారణమా?

ఏపీ, తెలంగాణ భూముల అండర్ గ్రౌండ్ నుంచి సీఎన్జీ ని మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ చౌక ధరకు సీఎన్జీ వినియోగించుకుంటూ ఆర్థికంగా లాభపడుతున్నారు. వాహనదారులకు సీఎన్జీ, ఇళ్లకు పీఎన్జీ నిరంతరం సరఫరా చేస్తున్నారు. ప్రజలు తమ వంట గదుల్లో సీఎన్జీని చౌక ధరకు వినియోగించుకుంటుండగా, తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఎల్పీజీనే వినియోగిస్తున్నారు.

Reported by: Jagan Mohan Talluri | విధాత ప్రత్యేకం | Apr 04, 2026, 1:33 pm IST
Read Time: 10 mins
KG Basin Gas | గ్యాస్‌ బండ మోత వెనుక.. ఎంపీలు ఆ విషయంలో చూపిన నిర్లక్ష్యమే కారణమా?

హైలైట్స్:

  • 12 ఏళ్లుగా సీఎన్జీపై నోరు మెదపని పార్లమెంటు సభ్యులు
  • కేజీ బేసిన్ వాటాపై పోరాడేందుకు ధైర్యం లేదా?

(జగన్మోహన్ తాళ్లూరి)
KG Basin Gas | కంప్రెస్డ్‌ నేచురుల్ గ్యాస్ (సీఎన్జీ) న్యాయబద్ద కేటాయింపులపై తెలంగాణ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో గళమెత్తకపోవడం, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయకపోవడం ఇక్కడి ప్రజలకు శాపంగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి 12 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్క రోజు కూడా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, ప్రధాని నరేంద్ర మోదీలను ఎండగట్టిన పాపాన పోలేదు. ఎంతసేపు తమ స్వప్రయోజనాలు, పార్టీకి లబ్ధి చేకూరే పనుల కోసం ప్రశ్నలు వేశారు తప్పితే అత్యంత కీలకమైన సీఎన్జీపై ప్రశ్నించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఎంపీలు గళమెత్తకపోవడం మూలంగానే తాజాగా ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులపై భారం పెగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా గోదావ‌రి బేసిన్ కేజీ-డీ6 బ్లాక్ (బంగాళాఖాతంలో ఆంధ్ర తీరం)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చమురు నిక్షేపాలను 2002-03లో కనుగొన్నది. ఈ ఆవిష్కరణ ప్రపంచంలోనే అతి పెద్ద సహజ వాయువు నిల్వగా నిలిచింది. దీని తరువాత 2003 సంవత్సరంలో కూడా మరికొన్ని నిక్షేపాలు కనుగొన్నారు. ఇది దేశంలో మొదటి డీప్ వాటర్ చమురు క్షేత్రమే కాకుండా అత్యంత లోతైన ఆఫ్ షోర్ క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. 2008, సెప్టెంబర్ నెలలో ఈ క్షేత్రం నుంచి వాణిజ్య ఉత్పత్తిని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించింది.

సహజ వాయువు, చమురు నిక్షేపాలు ఉమ్మడి ఏపీ ప్రజల ముంగిట్లో ఉన్నా ఆ వనరులను ఇప్పటి వరకు ఏపీతో పాటు తెలంగాణ ఉపయోగించుకోలేని దుస్థితిలో ఉంది. దీనికి ప్రధాన కారణం… రాజకీయ సంకల్పం లేకపోవడం, పట్టుదల కలిగిన రాజకీయ పార్టీ ఉద్యమించకపోవడమేనన్న వాదనలు విన్పిస్తున్నాయి. సహజ న్యాయసూత్రాల ప్రకారం కేజీ బేసిన్‌లో లభ్యమయ్యే సహజ వాయువు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలను తీరిన తరువాతే సరిహద్దులు దాటించాలి. సహజ వనరుల యాజమాన్యం, నియంత్రణ ఈ ప్రాంతాల ప్రజలందరి ప్రయోజనాలను న్యాయమైన రీతిలో కాపాడేటట్టుగా రాజ్యవ్యవస్థ వ్యవహరించాలని రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు కూడా చెబుతున్నాయి. బేసిన్‌లో లభ్యమవుతున్న సహజవాయువు ఇందుకు పూర్తి విరుద్దంగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు దాటి 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలకు తరలిపోతున్నది. 45 శాతం సీఎన్జీ గుజరాత్ కు, 24 శాతం మహారాష్ట్రలోని పరిశ్రమలకు, మిగిలిన దాన్ని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. ఉమ్మడి ఏపీ అవసరాలకు కేవలం 1.2 శాతం కేటాయించారు. ఈ కేటాయింపులు కూడా సక్రమంగా అమలు చేయకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్యాయం చేస్తున్నా ఏపీ, తెలంగాణ ఎంపీలు నోరు మెదపడం లేదు.

ఆలస్యంగానైనా మేల్కొన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఏపీకి న్యాయమైన వాటా దక్కాలని తన స్థాయిలో పోరాటం చేశారు. అప్పటీ యూపీఏ ప్రభుత్వానికి 24 లేఖలు రాశారు. వైఎస్ఆర్ సూచనలు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఏ ప్రాంతంలో దొరికే సహజ వనరులను ఆ ప్రాంతానికి వినియోగ ప్రాధాన్యత ఇవ్వాలని 12వ ఆర్థిక సంఘం సూచించింది. 2013లో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సహజ వనరులు ఉత్పత్తి అవుతున్న రాష్ట్రానికి కనీసం 50 శాతం వాటా ఇవ్వాలని, రాయల్టీ కూడా ఇవ్వాలని సూచించింది. ఈ సిఫారసులపై ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఒక్కనాడు లేవనెత్తిన పాపాన పోలేదు. ఆర్థిక సంఘం సిఫారసులు, స్టాండింగ్ కమిటీ నిర్ణయాల ప్రకారం తమ వాటా తమకు ఇవ్వాలని అడిగే ధైర్యం చేయకపోవడం శోచనీయం. అగ్రిమెంట్ ప్రకారం న్యాయమైన వాటా కూడా ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు సీఎన్జీని రిలయన్స్ ఇండస్ట్రీస్ తరలిస్తున్నా నిలదీసే సాహసం చేయడం లేదు. విచిత్రం ఏమంటే ఏపీ, తెలంగాణ భూముల అండర్ గ్రౌండ్ నుంచి సీఎన్జీ ని మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ చౌక ధరకు సీఎన్జీ వినియోగించుకుంటూ ఆర్థికంగా లాభపడుతున్నారు. వాహనదారులకు సీఎన్జీ, ఇళ్లకు పీఎన్జీ నిరంతరం సరఫరా చేస్తున్నారు. ప్రజలు తమ వంట గదుల్లో సీఎన్జీని చౌక ధరకు వినియోగించుకుంటుండగా, తెలంగాణ ప్రజలు ఇప్పటికీ ఎల్పీజీనే వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం ఇరాన్ పై యుద్ధం జరుగుతుండగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని అరబ్ దేశాలు ముడి చమురు ఉత్పత్తి, సరఫరా నిలిపివేయడంతో భారత్ పై మోయలేని విధంగా భారం పడుతోంది. ఫలితంగా రెండు రోజుల క్రితం ఒక్కో ఎల్పీజీ సిలిండర్ పై రూ.60 చొప్పున భారం మోపింది. న్యాయబద్దంగా తమకు రావాల్సిన సీఎన్జీ కోటాపై తెలంగాణ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో పోరాడి ఉంటే ఈ భారం తప్పేది. హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాలలో ఇంటింటికి పీఎన్జీ సరఫరా అయ్యేది. హైదరాబాద్ నగరంలో కాలుష్య నివారణకు సీఎన్జీ బస్సులు వినియోగించే అవకాశం ఉండేది. 12 సంవత్సరాల సమయంలో ఏ ఒక్క ఎంపీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై ప్రశ్నించడం కాని నిలదీయడం కాని ఎప్పుడు చేయకపోవడం శోచనీయమని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఆ కంపెనీ కి ఎంపీలు అంతగా భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. న్యాయబద్దమైన సీఎన్జీ కేటాయింపులు లభిస్తే, ఎల్పీజీ సిలిండర్ భారం తెలంగాణ ప్రజలకు తప్పేదని, సురక్షితమైన గ్యాస్ ఇంటింటికి లభించేదని అభిప్రాయపడుతున్నారు.

Read Also |

Snakes Unique Trick | కప్పల విషాన్ని తుడిచి మరీ తింటున్న పాములు! శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం.. వీడియో
Uttam Kumar Reddy| ప్రాజెక్టుల భూ సేకరణకు రూ.5 వేల కోట్లు : మంత్రి ఉత్తమ్
Teertham | దేవాలయ తీర్థం రాగి పాత్రలో తులసి ఆకులు, పచ్చ కర్పూరం ఎందుకు?
Zodiac Signs | ఉగాది నుంచి ఈ మూడు రాశుల వారికి ద‌రిద్ర‌మే..! బీ కేర్ ఫుల్..!!

Jagan Mohan Talluri
jaganmohan.talluri@gmail.com