నానాటికీ తగ్గిపోతున్న అసెంబ్లీ సమావేశాలు..

అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన శాసనసభ్యుడి పని. విధి. కానీ.. దేశంలోని అనేక అసెంబ్లీల్లో సమావేశాలు క్రమేపీ తగ్గిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో 40 నుంచి 45 రోజులపాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించేవారు. దాదాపు ప్రతిసభ్యుడికీ మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ.. ఇప్పుడు కొద్ది రోజులు నిర్వహించి మమ అనిపించేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • By: TAAZ |    national |    Published on : May 16, 2026 10:00 AM IST
నానాటికీ తగ్గిపోతున్న అసెంబ్లీ సమావేశాలు..
  • తెలంగాణలో 30 రోజులకు మించి అసెంబ్లీ జరిగితే ఒట్టు
  • దేశంలోని అనేక అసెంబ్లీల పరిస్థితి ఇదే..
  • జనం ఓట్లేసి గెలిపిస్తే సభలు జరగడం లేదు
  • బీఆర్ఎస్ హయాంలో చట్ట సవరణ
  • రేవంత్ రెడ్డి పాలనలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీ

విధాత, హైదరాబాద్:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క బడ్జెట్ సమావేశాలే 40 నుంచి 45 రోజుల పాటు జరుగుతుండేవి. ఇందులో 15 రోజుల సెలవులు మినహాయిస్తే, 30 వర్కింగ్ డేస్ ఉండేవి. ఈ ముప్పై రోజులలో సభలు అర్థవంతంగా సాగేవి. ప్రతి సభ్యుడికీ మాట్లాడే అవకాశం లభించేది. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు మార్చి నెలలో నిర్వహించారు. వారం రోజులు మాత్రమే సాగాయి. దేశంలో ఏ ఒక్క అసెంబ్లీ కూడా ముప్పై రోజులకు మించి సమావేశం కావడం లేదు. ప్రజలకు సంబంధించిన అంశాలను చట్టసభలలో చర్చించేందుకు కూడా సభ్యులు ఆసక్తి చూపించడం లేదనేది స్పష్టమవుతున్నది. తెలంగాణలోనూ కూడా చట్ట సభల సమావేశాలు పూర్తిగా కుదిస్తూ చట్ట సవరణ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కావడంతో సమస్యలు అంతగా ఉండవని, ఉమ్మడి రాష్ట్రం మాదిరి రోజుల తరబడి సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో వర్కింగ్ డేస్ తగ్గించారు. దీంతో తెలంగాణలో సమావేశాలు నిర్వహించే రోజులు తగ్గాయంటున్నారు.

నానాటికి తగ్గిపోతున్న సమావేశాలు

ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చట్ట సభలలో ప్రజా సమస్యలు లేవనెత్తి, పరిష్కారాలు సాధించడం ప్రధాన విధి. బడ్జెట్ సమావేశాల్లో శాఖల వారీగా కేటాయింపులపై చర్చించడం, ఖర్చు చేయని నిధులను ఎలా పెంచాలి? నిధుల లోటు ఉంటే వాటిని లేవనెత్తడం చేస్తుంటారు. ఇందుకోసమే బడ్జెట్ సమావేశాలను 40 నుంచి 45 రోజుల వరకు సుదీర్ఘంగా నిర్వహిస్తారు. 2017లో సగటున దేశంలో అసెంబ్లీ సమావేశాలు 28 రోజులు మాత్రమే జరిగాయి. ఆ తరువాత తగ్గుతూ వచ్చాయి. 2024 వచ్చేసరికి 8 రోజులు తగ్గి 20 రోజులకే పరిమితం అయ్యింది. అది కూడా రోజులో 5 గంటలకు మించి సభలు జరగలేదు. గోవా, రాజస్థాన్‌లలో సగటున ఏడు గంటలు కాగా బీహార్, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలలో 3 గంటలు మాత్రమే సమావేశాలు జరుగుతున్నాయి. అత్యంత వెనకబడిన రాష్ట్రంగా ఉన్న ఒడిశాలో అసెంబ్లీ సమావేశాలు విడతల వారీగా 42 రోజులు నిర్వహించారు. విద్యావంతుల రాష్ట్రంగా పేరొందిన కేరళలో కూడా 38 రోజులు సమావేశాలు నిర్విఘ్నంగా నిర్వహించడం విశేషం. పెద్ద రాష్ట్రాలు పేరొందిన ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో 16 రోజులు మాత్రమే నిర్వహించారు. ఇందులో బడ్జెట్ సమావేశం కోసం 7 రోజులు కేటాయించారు. మిగతా సమయాల్లో మొక్కుబడిగా మూడు నాలుగు రోజుల చొప్పున సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది కేరళ సగటున 44 రోజులు, ఒడిశా 40 రోజులు, కర్నాటక, పశ్చిమ బెంగాల్ లు 34 రోజుల పాటు సమావేశాలు దిగ్విజయంగా నిర్వహించి ప్రజాభిప్రాయానికి గౌరవం ఇస్తున్నాయి.

లోక్‌సభలో రెండు టెర్ములుగా డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీ

లోక్‌సభలో 2019 సంవత్సరం నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. చిట్ట చివరి డిప్యూటీ స్పీకర్‌గా ఎం తంబిదురై 2014 నుంచి 2019 మే నెల వరకు పని చేశారు. ఆ తరువాతి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. తంబిదురై ఏఐఏడిఎంకే నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆర్టికల్ 93 ప్రకారం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను ఎన్నుకుంటున్నారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ కూర్చుని సమావేశాలు సజావుగా నిర్వహిస్తారు. సంప్రదాయంగా ఈ పోస్టును ప్రతిపక్షాలకు ఇస్తూ వస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు ఉన్న 17వ లోకసభలో కూడా ఈ పదవిని భర్తీ చేయకుండా ఖాళీగా పెట్టారు. 2024లో ఎన్నికలు జరిగిన తరువాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఈ 18వ లోక సభలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ కొలువు తీరారు. అయినప్పటికీ డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోలేదు. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి వస్తుందనే వరుసగా రెండు టెర్మ్ లు డిప్యూటీ స్పీకర్ పదవిని ఖాళీగా పెట్టారనే విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ ఎదుర్కొంటున్నారు.

8 రాష్ట్రాల్లో ఖాళీగా డిప్యూటీ స్పీకర్ పదవులు

దేశంలోని 8 రాష్ట్రాల అసెంబ్లీలలో డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఛత్తీస్‌గఢ్‌, జమ్ముకశ్మీర్‌, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌తోపాటు తెలంగాణలో డిప్యూటీ స్పీకర్‌ను ఎంపిక చేయలేదు. ఫలితంగా అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో స్పీకర్‌పై పని ఒత్తిడి పెరుగుతోంది. జార్ఖండ్ రాష్ట్రంలో రెండు దశాబ్దాల నుంచి డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవడం లేదంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పదవికి ఎంత గౌరవ ఇస్తున్నారనేది అర్థమవుతోంది. 2005 మార్చి 6వ తేదీ వరకు సబా అహ్మద్ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. రాజస్థాన్‌లో ఏడు సంవత్సరాలు, మధ్య ప్రదేశ్‌లో ఆరు సంవత్సరాలు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో నాలుగు సంవత్సరాల నుంచి ఈ పదవిని భర్తీ చేయడం లేదు. స్పీకర్ అకాల మరణం చెందినా, రాజీనామా చేసినా, మంచానికి పరిమితం అయిన సందర్భాల్లో డిప్యూటీ స్పీకర్… స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన సమయంలో డిప్యూటీ స్పీకర్, స్పీకర్ స్థానంలో కూర్చుని బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు.

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీయే

తెలంగాణ లో డిప్యూటీ స్పీకర్ పదవికి డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచందర్ నాయక్ పేరును జూన్ 2025 లో ప్రకటించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి ఈ పదవి భర్తీకి నోచుకోకుండా ఖాళీగా ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో డిప్యూటీ స్పీకర్ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారని ప్రచారం జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆయన మంత్రి పదవిని ఆశిస్తుండడంతో ఎంపిక వాయిదా పడిందని గాంధీ భవన్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ పదవిని తీసుకుంటే మంత్రి పదవికి దూరం అవుతామనే ఉద్దేశంత వెనకడుగు వేశారంటున్నారు. అసెంబ్లీ ఆవరణలో ఇద్దరు మంత్రుల ఛాంబర్ ను కలిపి డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ మారుస్తారని వార్తలొచ్చాయి. డిప్యూటీ స్పీకర్ పదవి నియామకం జరగకపోవడం ప్రధాన ఉల్లంఘన అని విపక్షాలు విమర్శిస్తుననాయి. రూల్ 8 ప్రకారం డిప్యూటీ స్పీకర్ ను తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి ఉంటుందని అంటున్నాయి. సభలో సభ్యుల హక్కులను పరిరక్షించే సభా హక్కుల కమిటీకి డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తుంటారు. ఈ పదవి ఖాళీగా ఉండడం మూలంగా కమిటీ నిర్వీర్యం అయి, సభ్యుల హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదులు కూడా పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉంటున్నాయనేది విపక్షాల ప్రధాన ఆరోపణ.

Read Also |

నీట్ పరీక్షలపై మరో కీలక అప్‌డేట్‌.. ఇకపై మారనున్న పరీక్షా విధానం.. లీకేజీలు తగ్గేనా?
ఏటీఎంలు ఖాళీ? బ్యాంకుల‌ను వేధిస్తున్న‌న‌గ‌దు కొర‌త‌
మోదీ షాక్…పెట్రోల్..డీజిల్, సీఎన్జీ ధరల పెంపు