Watermelon Death | మళ్లీ అదే టెన్షన్.. పుచ్చకాయ తిన్న కాసేపటికే తండ్రి మృతి.. కొడుకు పరిస్థితి విషమం

Watermelon Death | మధ్యప్రదేశ్‌ షియోపూర్ జిల్లాలో కూడా పుచ్చకాయ తిన్న కాసేటికే తండ్రీకొడుకులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో తండ్రి మృతిచెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.

Reported by: Chandram | జాతీయం | May 16, 2026, 9:14 am IST
Read Time: 4 mins
Watermelon Death | మళ్లీ అదే టెన్షన్.. పుచ్చకాయ తిన్న కాసేపటికే తండ్రి మృతి.. కొడుకు పరిస్థితి విషమం

Watermelon Death | ముంబైలో పుచ్చకాయ తిన్న కాసేటికే ఓ ఫ్యామిలీ అస్వస్థతకు గురై మరణించడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తినడంతోనే వారు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని మొదట వార్తలు వచ్చినా.. తర్వాత అది నిజం కాదని తెలిసింది. అయినప్పటికీ చాలామందిలో పుచ్చకాయ భయం పోలేదు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌ షియోపూర్ జిల్లాలో కూడా పుచ్చకాయ తిన్న కాసేటికే తండ్రీకొడుకులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో తండ్రి మృతిచెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.

బాధితుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. షాజాపూర్ జిల్లాకు చెందిన ఇంద్రకుమార్ (43) షియోపూర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో సహా అక్కడే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇంద్రకుమార్, అతని కొడుకు వినోద్ (21) గురువారం అనారోగ్యానికి గురయ్యారు. అయితే శుక్రవారం ఉదయం వారిద్దరూ పుచ్చకాయ తిన్నారు. ఆ వెంటనే వారి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే వారిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కోటా ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఇంద్రకుమార్ మరణించాడు. వినోద్ పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటనపై షియోపూర్ జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్‌బీ గోయల్ స్పందించారు. తీవ్ర అస్వస్థతతో ఇద్దరూ తమ ఆస్పత్రిలో చేరారని తెలిపారు. అయితే పుచ్చకాయ తినడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని పేర్కొన్నారు. కడుపు ఇన్‌ఫెక్షన్ లేదా ఇతరత్రా అనారోగ్య సమస్యల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుందని తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Read More:

పుచ్చకాయ కూడా మనుషులను చంపగలదా? ముంబై మరణాల తర్వాత డాక్టర్లు చెప్పిన షాకింగ్​ నిజాలు