విధాత: భారతీయ సమాజంలో ఆడపిల్లను లక్ష్మీదేవి స్వరూపంగా, ఇంటికి వెలుగు తెచ్చే మహాలక్ష్మిగా భావిస్తారు. ఆడబిడ్డ అదృష్టాన్ని మోసుకొచ్చే మహాలక్ష్మిగా భావిస్తూ..చాల మంది తమ ఇంట్లో ఆడబిడ్డ పుట్టాలని కోరుకుంటుంటారు. నేటి సమాజంలో మాత్రం కొందరు ఆడపిల్ల పుడితే భారంగా భావిస్తున్న రోజులివి. కానీ అదే ఆడబిడ్డ తమ ఇంట్లో అడుగుపెడితే చూడాలని అర్ధ శతాబ్దానికి పైగా ఓ కుటుంబం నిరీక్షించింది.
ఏకంగా 52 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తమ వంశంలోకి ఒక ఆడపిల్ల జన్మించడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆస్పత్రి ప్రాంగణం అంతా కుటుంబ సభ్యుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ముస్కాన్ అగర్వాల్ కుటుంబంలో 52 ఏళ్ల తర్వాత ఆడపిల్ల జన్మించింది. గత ఐదు దశాబ్దాలుగా ఆ వంశంలో కేవలం వరుసగా మగపిల్లలు మాత్రమే పుట్టారు. ఇంతకాలానికి ఇంట్లో ఆడబిడ్డ జన్మించడంతో ఆ పసిపాప కేరింతలు వింటూ ఆ కుటుంబ సభ్యులు ఆనందబాష్పాలు రాల్చారు. ఆపరేషన్ థియేటర్ నుంచి పాపను బయటకు తేగానే వారంతా ఉద్వేగానికి గురయ్యారు.
ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్ బుజ్జి పాపాయిని చేతుల్లోకి తీసుకుని ప్రసూతి గది తలుపులు తెరిచి బయటకు వచ్చి “మీ ఇంట్లోకి ఆడపిల్ల పుట్టింది” అని చెప్పడమే ఆలస్యం.. అక్కడ ఉన్న కుటుంబ సభ్యుల ఆనందం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఆ మాట వినగానే అక్కడున్న వారంతా సంతోషంతో ఎగిరి గంతేస్తూ, కేరింతలు కొడుతూ, ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఆనందబాష్పాలు రాల్చారు.
ఈ అరుదైన క్షణాలను డాక్టర్ బేలా షా జైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. “ఇది జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన అపూర్వమైన రోజు, కొన్నిసార్లు అద్భుతాలు జరగడానికి ఒక్కోసారి దశాబ్దాల సమయం పడుతుంది” అంటూ ఆ వీడియోకు ఆమె హృద్యమైన క్యాప్షన్ జోడించారు.
నవజాత శిశువు తల్లి ముస్కాన్ అగర్వాల్ మాట్లాడుతూ, ఈ అద్భుతమైన ప్రయాణంలో తనకు అండగా నిలిచిన డాక్టర్ బేలా షా జైన్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నెటిజన్లు ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
After 52 years, a baby girl is finally born into their family. 🥹❤️
Look at the joy outside that room! Every daughter deserves a welcome like this. ✨#BabyGirl #Daughters #Family pic.twitter.com/hH4lqXJ95g
— Beti Aur Amma (@Betiauramma) August 1, 2026