తెలంగాణలో గడ్డిమందుపై నిషేధం.. అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై ఆంక్షలు

గడ్డి మందు దుర్వినియగం అవుతున్న నేపథ్యంలో దానిని రాష్ట్రంలో నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • By: TAAZ |    news |    Published on : Apr 01, 2026 10:49 PM IST
తెలంగాణలో గడ్డిమందుపై నిషేధం.. అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై ఆంక్షలు

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలపై 60 రోజుల పాటు నిషేధం విధించింది. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని, నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. పారాక్వాట్ అనే గడ్డిమందు అత్యంత విషపూరితమైనది, ఇది ఆత్మ’4హత్యలకు ప్రధాన సాధనంగా మారింది. ఈ మందును చిన్నపాటి మనస్పర్థలు లేదా క్షణికావేశంలో సేవించిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. ఈ విషయాన్ని డాక్టర్లు కూడా ప్రకటించి, అమ్మకాల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కూడా ఈ మందును నిషేధించాలని ఇప్పటికే డిమాండ్ చేసింది.

ఇటీవల రాష్ట్రంలో ఈ మందు వినియోగం, అమ్మకాల అంశం పై తీవ్ర చర్చసాగుతోంది. ప్రాణాలు తీయడమే కాకుండా పర్యావరణానికి కూడా హనికలిగిస్తున్నట్లు నిపుణులు ప్రకటిస్తున్నారు. ఈ అంశాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సైతం లేవనెత్తారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసింది. ఇదిలా ఉండగా పారాక్వాట్ గడ్డిమందు నిషేధం విషయంలో ఇప్పటికే కేరళ, ఒడిశా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నాయి. తాజాగా ఈ వరుసలో తెలంగాణ రాష్ట్రం చేరింది.