Pawan Kalyan | ఆరోగ్యంపై తొలిసారి స్పందించిన పవన్ కళ్యాణ్ .. విజయ్‌తో పోలికలు, వైసీపీ విమర్శలపై ఘాటు స్పందన

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ కళ్యాణ్‌ తన ఆరోగ్య పరిస్థితి, పార్టీ భవిష్యత్తు, రాజకీయ విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

  • By: Sandeep |    movies |    Published on : May 16, 2026 8:30 AM IST
Pawan Kalyan | ఆరోగ్యంపై తొలిసారి స్పందించిన పవన్ కళ్యాణ్ .. విజయ్‌తో పోలికలు, వైసీపీ విమర్శలపై ఘాటు స్పందన

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్ కళ్యాణ్‌ తన ఆరోగ్య పరిస్థితి, పార్టీ భవిష్యత్తు, రాజకీయ విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్, కరోనా అనంతరం వచ్చిన లంగ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గలేదని వెల్లడించారు. తరచూ ప్రజల్లో తిరగడం, పర్యటనలు నిర్వహించడం వల్ల దుమ్ము, ధూళి ప్రభావంతో సైనస్ సమస్యలు మరింత తీవ్రం అయ్యాయని చెప్పారు. దీనివల్ల శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

కరోనా తర్వాత ఆరోగ్య సమస్యలపై స్పందన

అభిమానుల ప్రేమ కూడా కొన్నిసార్లు శారీరక ఇబ్బందులకు కారణమైందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అభిమానులు కలిసిన సమయంలో చేతులు బలంగా పట్టుకుని లాగడం వల్ల భుజాల మధ్య గ్యాప్ ఏర్పడిందని నవ్వుతూ చెప్పారు. వెన్నెముక సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయని, అయితే క్రీడా శిక్షణ వల్ల నొప్పిని భరించే సామర్థ్యం తనకు పెరిగిందని వివరించారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని, ప్రజాసేవలో మరింత చురుకుగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.

విజయ్‌తో పోలికలపై అసహనం

ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎదుగుదల నేపథ్యంలో కొందరు తన రాజకీయ ప్రయాణాన్ని దానితో పోల్చడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రానికి రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, ఒక రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మరో రాష్ట్రంలో కూడా అలాగే జరుగుతాయని భావించడం సరైనది కాదని చెప్పారు.

తన రాజకీయ ప్రయాణం ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు, కష్టాలతో కూడుకున్నదని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. పార్టీ నుంచి పలువురు నాయకులు వెళ్లిపోయినా, తాను పార్టీని నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేశానన్నారు.

జనసేన విస్తరణపై కీలక ప్రకటన

జనసేన పార్టీ కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కూడా పార్టీ సిద్ధాంతాలకు మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. పార్టీని మరింత విస్తరించాలనే అభిప్రాయాలు వస్తున్నాయని చెప్పారు.

గత కొన్నేళ్లుగా పార్టీ నిర్మాణంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయామని, ఇకపై బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

వైసీపీపై ఘాటు విమర్శలు

వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజకీయాల్లో ఓటములు, అవమానాలు, ఒత్తిళ్లు సహజమని, వాటిని ఎదుర్కొంటూ ముందుకు రావాల్సి ఉంటుందని అన్నారు. సోషల్ మీడియా ప్రచారాలకంటే ప్రజల కోసం పనిచేయడం ముఖ్యమని పేర్కొన్నారు.

“ప్రజల కోసం రాజకీయాలు చేయాలి గానీ, వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేనను తక్కువ అంచనా వేయవద్దని, పార్టీ భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.