Alcohol Consumption | దక్షిణాది రాష్ట్రాలలో మద్యం తాగడంలో తెలంగాణే నంబర్ వన్

దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వినియోగంలో తెలంగాణ ప్రజలు ముందంజలో ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 4.4 లీటర్ల మద్యం వినియోగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో కూడా తెలంగాణ టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది.

Alcohol Consumption | దక్షిణాది రాష్ట్రాలలో మద్యం తాగడంలో తెలంగాణే నంబర్ వన్
  • తెలంగాణలో సగటున ఒక వ్యక్తి మద్యం సగటు వినియోగం 4.44 లీటర్లు
  • కర్ణాటక రెండు, ఏపీ నాలుగవ స్థానంలో

హైదరాబాద్, విధాత:
Alcohol Consumption |  మ‌ద్యం తాగ‌డంలో ద‌క్షిణాది రాష్ట్రాల‌లో తెలంగాణ ప్రజలు మొద‌టి స్థానంలో ఉన్నారు. ఒక్కో వ్య‌క్తి స‌గ‌టున ఏడాదికి 4.4 లీట‌ర్ల మ‌ద్యాన్ని తాగుతున్నార‌ని నివేదికలు తెలుపుతున్నాయి. అలాగే ఒక వ్య‌క్తి ఏడాదికి మ‌ద్యం స‌గ‌టు వినియోగం క‌ర్ణాట‌క 4.2, త‌మిళ‌నాడు 3.38 కాగా ఏపీ 2.7తో నాలుగ‌వ స్థానంలో ఉంది. కేర‌ళ 2.5 లీట‌ర్ల‌తో 5వ స్థానంలో ఉందని @IndianTechGuide హ్యాండిల్‌ పేర్కొంది.

దేశవ్యాప్తంగా మ‌ద్యం వినియోగంలో మూడ‌వ స్థానంలో తెలంగాణ‌

దేశవ్యాప్తంగా మ‌ద్యం వినియోగంలో ద‌క్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. మొద‌టి నాలుగు స్థానాల‌లో క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ఏపీలే ఉండ‌టం గ‌మ‌నార్హం. క‌ర్ణాట‌కలో మ‌ద్యం వినియోగం అత్య‌ధికంగా 6.88 కోట్ల కేసులు వినియోగించి టాప్‌లో ఉండ‌గా, త‌మిళ‌నాడు 6.47 కోట్ల కేసులు వినియోగించి రెండ‌వ స్థానంలో తెలంగాణ 3.71 కోట్ల కేసులు వినియోగించి మూడ‌వ స్థానంలో, ఏపీ 3.55 కోట్లు వినియోగించి నాలుగవ స్థానంలో నిలిచింది.

తెలంగాణ‌లో మ‌ద్యం పై భారీ ఖ‌ర్చు

తెలంగాణ ప్ర‌జ‌లు మ‌ద్యంపై ఖ‌ర్చు కూడా ఎక్కువ‌గానే పెడ‌తారు. మ‌ద్యంపై ఒక్కో వ్య‌క్తి ఏడాదికి స‌గ‌టున రూ.11,351 ఖ‌ర్చు చేస్తారు. తెలంగాణ‌లో 43.3 శాతం మంది పురుషులు మ‌ద్యం సేవిస్తారు. ఇది దేశ స‌గ‌టు మ‌ద్యం తాగే పురుషులు 18.8 శాతం కంటే చాలా ఎక్కువ అని నేష‌న‌ల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వే-5 తెలుపుతోంది. ఒక్క 2024 ఏడాదిలో లిక్క‌ర్ అమ్మ‌కాలు రూ. 37,485 కోట్లకు పైగా జ‌రిగాయంటే మ‌ద్యం వినియోగం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చున‌ని నిపుణులు చెపుతున్నారు. ఒక్క‌ 2025 డిసెంబ‌ర్ నెల‌లోనే మ‌ద్యం అమ్మ‌కాలు రూ. 5,102 కోట్లు జ‌రిగాయంటే మ‌న వాళ్లు ఎంత తాగుతున్నారో అర్థం అవుతున్న‌ది.

2015-16 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ద్యం అమ్మ‌కాలు ప్ర‌తి ఏటా పెరుగుతూనే ఉన్నాయి, 2015-16లో రూ. 12,706 కోట్లు ఉన్న మ‌ద్యం అమ్మ‌కాలు 2024-25 నాటికి రూ. 34,600 కోట్ల‌కు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2600 లిక్క‌ర్ షాపులు ఉన్నాయి. పండుగ‌లు, న్యూఇయ‌ర్ వేడుక‌లు, ఎన్నిక‌ల లాంటి స‌మ‌యాల‌లో ఒక్క రోజులోనే రూ. 300ల నుంచి 400 కోట్ల రూపాయ‌ల మ‌ద్యం వినియోగం జ‌రుగుతుంది. న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే రూ.1000 కోట్ల‌కు పైగా మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగిన‌ట్లు ఒక అంచ‌నా… కాగా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లిలో ఉన్న ఒక వైన్‌షాప్‌లో రోజుకు కోటి రూపాయ‌ల వ‌ర‌కు అమ్మ‌కాలు జ‌రుగుతాయ‌న్న‌ ప్ర‌చారం ఉంది. మ‌ద్యం విక్ర‌యాల‌లో తెలంగాణ దేశంలో 5వ స్థానంలో ఉంది. వార్షిక సేల్స్ ఉత్త‌ర ప్ర‌దేశ్ రూ.45 వేల నుంచి 50 వేల కోట్లు కాగా, క‌ర్ణాక‌ట రూ. 40 వేల నుంచి రూ.45 వేల కోట్లు, మ‌హారాష్ట్ర రూ. 40 వేల కోట్లు, త‌మిళ‌నాడు రూ. 38 వేల నుంచి 40 వేల కోట్లు, తెలంగాణ రూ. 34 వేల నుంచి 38 వేల కోట్లుగా న‌మోదైంది.

లిక్క‌ర్ కు పెద్ద మార్కెట్ తెలంగాణ‌

ఇత‌ర రాష్ట్రాల‌తో చూస్తే తెలంగాణ జ‌నాభా త‌క్కువ‌గా ఉన్ప‌ప్ప‌టికీ లిక్క‌ర్‌కు పెద్ద మార్కెట్ ఉంద‌ని విశ్లేష‌కులు చెపుతున్నారు. అందుకే జ‌నాభా త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ లిక్క‌ర్ సేల్స్‌లో పెద్ద రాష్ట్రాల‌కు దీటుగా ఉందంటున్నారు. మ‌ద్యం విక్ర‌యాల‌లో ప్ర‌ధానంగా హైద‌రాబాద్ మెట్రో ప్రాంతం నుంచే ఎక్కువ‌గా ఉందంటున్నారు. ఇక్క‌డ జ‌నాభా అధికంగా ఉండ‌డం, ఐటి ఉద్యోగులు, వ్యాపార వేత్త‌లు ఉన్నారు. దీనికి తోడు తెలంగాణ‌లో పటాన్‌చెరువు, రామ‌గుండం, కొత్త‌గూడెం లాంటి పారిశ్రామిక ప్రాంతాల‌లో కూడా మ‌ద్యం విక్ర‌యాలు ఎక్కువ‌గా జ‌రుగుతాయ‌ని నివేదిక‌లు తెలుపుతున్నాయి. అలాగు జాతీయ ర‌హ‌దారుల వ‌ద్ద ఉన్న జిల్లాల్లో లిక్క‌ర్ షాప్‌లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, వీటిల్లో కూడా మ‌ద్యం విక్ర‌యాలు బాగా జ‌రుగుతాయి. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తి ఏటా మ‌ద్యం ద్వారా 12 నుంచి 15 శాతం వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది. ప్ర‌భుత్వానికి ఈ ఎక్సైజ్ ఆదాయ‌మే కీల‌కంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు స‌గ‌టున రూ.90 నుంచి రూ.110 కోట్ల వ‌ర‌కు మ‌ద్యం విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి.

తెలంగాణ లిక్క‌ర్ అమ్మ‌కాలు(Beer + IMFL క‌లిపి) ఇలా… సంత్స‌రాల వారీగా .. (రూ. కోట్ల‌లో)
2015-16 – రూ. 12,706
2016-17 – రూ.14,184
2017-18 – రూ.17,594
2018-19 – రూ.20,859
2019-20 – రూ.35,145
2020-21 – రూ.27,288
2021-22 – రూ.30,783
2022-23 – రూ.35,145
2023-24 – రూ.34,800
2024-25 – రూ.34,600

దేశంలో లిక్క‌ర్ అత్య‌ధికంగా వినియోగించే టాప్ 10 రాష్ట్రాలు
రాష్ట్రం కోట్ల కేసులు
క‌ర్ణాట‌క – 6.88
త‌మిళ‌నాడు – 6.47
తెలంగాణ – 3.71
ఆంధ్ర ప్ర‌దేశ్ – 3.55
మ‌హారాష్ట్ర – 2.71
ఉత్త‌ర ప్ర‌దేశ్ – 2.50
కేర‌ళ – 2.29
ప‌శ్చిమ బెంగాల్ – 1.49
రాజ‌స్థాన్ – 1.37
ఢిల్లీ – 1.18

తెలంగాణ‌లో లిక్క‌ర్ అమ్మ‌కాలు ఎక్కువ‌గా జ‌రిగే జిల్లాలు
హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిరిగి, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, మ‌హాబూబ్‌న‌గ‌ర్, సంగారెడ్డి.

ద‌క్షిణాది రాష్ట్రాల‌లో ఒక్కో వ్య‌క్తి లిక్క‌ర్ వార్షిక వినియోగం
రాష్ట్రం లీట‌ర్లు
తెలంగాణ – 4.4
క‌ర్ణాట‌క – 4.2
త‌మిళ‌నాడు – 3.38
ఆంధ్ర ప్ర‌దేశ్ – 2.7
కేర‌ళ – 2.5

Read Also |

India bullet train | 2027 ఆగస్ట్‌ నుంచి భారత్‌లో బుల్లెట్ రైలు పరుగులు
అతి తక్కువ ఆయుష్షు ఉన్న జీవులు ఇవే..! కొన్ని గంటల్లోనే చనిపోతాయి.
Harish Rana Passive Euthanasia : 13ఏళ్లుగా కోమాలో..కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి!