సింగరేణి సంస్థను సిరుల సింగరేణి…బొగ్గును నల్ల బంగారంగా పిలుస్తారు. అంతటి ప్రాధాన్యత ఉన్న సింగరేణి సంస్థలో ఇటీవల బొగ్గు టెండర్ల స్కామ్ లు, కార్మికుల వాటల్లో కోత వంటి ఆరోపణలు చెలరేగం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బొగ్గు గనులలో రూ.1,600 కోట్ల విలువైన 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందంటూ బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. బొగ్గు ఉందా లేదా అన్నదానిపై క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లిన హరీశ్ రావును అడ్డుకోవడంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.
మూడు పార్టీలకు బొగ్గు మసి..
సింగరేణి బొగ్గు గనుల నుంచి 40లక్షల టన్నుల బొగ్గును కాంగ్రెస్ సర్కార్ మాయం చేసిందని హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. బొగ్గు స్కామ్ ను మేం బయటపెట్టగానే మట్టికుప్పలపై బొగ్గు పేరుస్తున్నారని, వీడియోలతో సాక్ష్యాలతో బయటపెట్టినా కేంద్రం, రాష్ట్రం అక్రమాలపై స్పందించడం లేదని తప్పుబట్టారు. సింగరేణిలో కేంద్రానికి 48శాతం వాటా ఉందని, అందులో అవినీతి జరిగింది, విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి నేను లేఖ రాస్తే.. పైగా దొంగకు తాళం చెవి ఇచ్చినట్లుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ చేయమని లేఖ రాయడం ఏమిటని నిలదీశారు. హరీశ్ రావు బొగ్గు స్కామ్ లో కాంగ్రెస్, బీజేపీలను టార్గెట్ చేశారు. రెండు పార్టీలు ఒక్కటి కాకపోతే సింగరేణి స్కామ్ లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడం ఆసక్తి రేపింది. బొగ్గు మాయం నిజం కాకపోతే సింగరేణి బొగ్గుబావులకు వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నన్ను అడ్డుకుంటుందంటూ ప్రశ్నించారు. 40లక్షల టన్నుల బొగ్గు ఉందని ఆధారాలతో నిరూపించకపోతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఇదే సమయంలో సింగరేణి బొగ్గు గనుల్లో వాడే జిలెటిన్ స్టిక్స్ విషయంలోనూ స్కామ్ జరిగిందంటూ హరీశ్ రావు మరో కీలక ఆరోపణ చేశారు.
భట్టి కౌంటర్ లో నిజమెంతో..?
సింగరేణిలో 40లక్షల టన్నుల బొగ్గు మాయమైందని హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖండించారు. సింగరేణిలో కిలో బొగ్గు కూడా బయటకు వెళ్లే ప్రసక్తి లేదని, పదేళ్లు అధికారంలో ఉండి సింగరేణిని బీఆర్ఎస్ పాలకులు దోచుకున్నారంటూ ఎదురుదాడి చేశారు. పనిలో పనిగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కారణంగానే సింగరేణికి రెండు బొగ్గు బ్లాకులు రాకుండా అడ్డుకున్నారని, దీంతో సింగరేణికి రూ.2,624కోట్ల లాభం రాకుండా పోయిందంటూ..భట్టి బీఆర్ఎస్, బీజేపీలపై ఎదురుదాడి చేశారు.
కిషన్ రెడ్డి లేఖతో ముదిరిన వివాదం
సింగరేణిలో 40లక్షల టన్నుల బొగ్గు మాయమైన ఘటనపై తక్షణమే విచారణ జరుపాలంటూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో ఈ వ్యవహారం ముదిరినట్లయ్యింది. బొగ్గు స్కామ్ పై హరీశ్ రావు ఆరోపణలు కాస్తా కిషన్ రెడ్డి లేఖతో చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51,500కోట్లకు పైగా బకాయిలతో ఆర్థిక ఒత్తిడిన ఎదుర్కొంటున్న వేళ..బొగ్గు స్కామ్ వార్తలు సింగరేణి ఆర్థిక అస్థిత్వాన్ని దెబ్బతీసేదిగా ఉందంటూ కిషన్ రెడ్డి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. నిజనిజాలు నిగ్గు తేల్చండని కోరారు. అసలు సింగరేణిలో ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్, సేఫ్ గార్డ్స్ మెకానిజం, టెక్నాలాజి బెస్ట్ మానిటరింగ్ టూల్స్ వినియోగాలపై ప్రశ్నలు లేవనెత్తి సమీక్ష చేయాలని సూచించారు.
నిజం తేల్చేది ఎవరో..?
సింగరేణిలో రూ.1600కోట్ల విలువైన 40లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మాయమైందన్నట్లుగా చెలరేగిన ఆరోపణలపై మూడు పార్టీలు సాగిస్తున్న పరస్పర ఆరోపణల నేపథ్యంలో నిజానిజాలు నిగ్గు తెల్చేదెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బొగ్గు మాయం చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఆరోపణలు చేసినందునా రేవంత్ సర్కార్ విచారణ చేయకపోవచ్చు. హరీశ్ రావు డిమాండ్ చేసినట్లుగా సీబీఐ విచారణ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా సాధ్యం కాదు. ఇక సింగరేణిలో 48శాతం వాటా ఉన్న కేంద్రం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో కేంద్రం విచారణకు సిద్దంగా లేనట్లేనని అవగతమవుతుంది.
ఈ నేపథ్యంలో అసలు రూ.1600కోట్ల విలువైన సింగరేణి నల్ల బంగారం ఏమైపోయింది? నిజంగా ఆ బొగ్గు నిల్వలు ఉన్నాయా మాయమైపోయాయా? అన్నది బ్రహ్మపదార్ధంగా మారిపోయింది. దీంతో సింగరేణి బొగ్గు నిల్వల రక్షణ వ్యవహారంపై జనాల్లో నెలకొంటున్న సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనంటున్నారు విశ్లేషకులు.