Petrol Price | భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

Petrol Price | మధ్యప్రాచ్యంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Reported by: Chandram | జాతీయం | Mar 07, 2026, 8:34 pm IST
Read Time: 4 mins
Petrol Price | భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయా.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

Petrol Price | మధ్యప్రాచ్యంలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పుడే మీ బైక్, కారులో ట్యాంక్ ఇప్పుడే ఫుల్ చేసుకోండి అంటూ కూడా సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలో మార్పులు ఉన్నప్పటికీ.. రవాణా ఇంధన వనరుల ధరలు పెరుగబోవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

భారత్‌కు జరిగే క్రూడాయిల్ దిగుమతుల్లో సగానికిపైగా హర్ముజ్ జలసంధి నుంచే వస్తుంది. అయితే ఇజ్రాయెల్ – అమెరికా దాడులతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ కారణంగా పెట్రోల్ కొరత వస్తుందని.. దీంతో ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది.. అయితే భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని గ్రహించిన భారత ప్రభుత్వం దిగుమతి విధానంలో తన వ్యూహాన్ని మార్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హర్ముజ్ జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించి, ఇతర సురక్షిత మార్గాల ద్వారా దిగుమతులను 60 నుంచి 70 శాతానికి పెంచింది. పైగా హర్ముజ్ జలసంధి మార్గంలో కూడా రవాణా పునరుద్ధరణ జరగడంతో ఇంధన సరఫరా గాడిలో పడింది.. ఫలితంగా దేశంలో కావాల్సినంతగా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని స్పష్టం చేసింది.

ఇటీవల ధరల పెంపు విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపైనా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఎల్పీజీ ధరల పెంపు విషయాన్ని పెట్రోల్, డీజిల్ ధరలతో కలిపి వ్యాఖ్యానించడం అనేది తప్పుగా అర్థం చేసుకోవడమేనని తెలిపాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ధరల ఉపశమనం కేవలం పెట్రోల్, డీజిల్‌కు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.