Narcotics Global Supply Hyderabad | ఉడ్తా హైదరాబాద్! మాదకద్రవ్యాల కేంద్రంగా నగరం?
ముంబైలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న బంగ్లాదేశ్ మహిళ (Bangladeshi woman)ను అరెస్టు చేయగా, ఆమె ఇచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ చర్లపల్లిలో మాదక ద్రవ్యాలు (narcotics)తయారవుతున్నట్లు వివరాలు వెల్లడి అయ్యాయి. మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లోని చర్లపల్లి (Charlapalli) ఐదో ఫేజ్ పారిశ్రామికవాడకు వచ్చి మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి తీసుకుపోయే వరకు ఎవరికీ తెలియలేదంటే ఆశ్చర్యమే.

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విధాత):
Narcotics Global Supply Hyderabad | దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద ఘటనలు జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లో బయటపడటం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. పలు ఘటనల్లో స్థానిక పోలీసులకు సమాచారం లేకుండానే ఇతర రాష్ట్రాల పోలీసులు వచ్చి హైదరాబాద్ నుంచి ఉగ్రదాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని వెళ్ళిన సందరభాలూ ఉన్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు మాదకద్రవ్యాలు అంటే అంతా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితులు తలెత్తాయా? తాజాగా గుబులు రేపిన ఘటనలు గమనిస్తే అవునేమో అనిపించకమానదు. హైదరాబాద్ నగరం మత్తు మందు వ్యాపారానికి కేంద్రంగా మారుతున్నదనే అనుమానాలు గత కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో కలుగుతున్నాయి. ఇటీవలే ఒక ప్రైవేటు యూనివర్సిటీలో విద్యార్థులు కొరియర్ ద్వారా మత్తు మందు తెప్పించుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అది కూడా ప్రముఖ యూనివర్సిటీ కావడం గమనార్హం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నార్కొటిక్ దందాపై విచారణ జరిపినట్టు హడావుడి చేసింది. కానీ.. తర్వాత ఆ కేసు అటకెక్కింది. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో గత దశాబ్ధకాలంగా నార్కొటిక్స్ వ్యాపారం గుట్టుగా సాగుతోందని అంటున్నారు. పట్టుబడిన సందర్భంలో ఆ విషయం వెలుగు చూడ్డం తప్పితే, చాలా వరకు బయటకు రావడంలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత పలు ప్రభుత్వ విభాగాలు చురుకుగా పనిచేయడం లేదు. తమ బాధ్యతలు ఏంటి? ఏం చేస్తున్నాం? అనే విషయాన్ని పూర్తిగా విస్మరించాయి. ప్రభుత్వ అధికారులు ఎంత సేపూ అనుమతులు, రెన్యూవల్స్, నామమాత్ర తనిఖీల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారన్న విమర్శలు చాలా కాలం నుంచీ ఉన్నాయి.
కొంప ముంచుతున్న సంస్కరణలు
గత కొన్ని సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తల ఒత్తిడులు, వారిచ్చే విరాళాలకు తలొగ్గిన పాలకులు అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాల తనిఖీల నుంచి పరిశ్రమల యజమానులు తప్పించుకునేలా ఇవి ఉంటున్నాయి. గతంలో ఏ పరిశ్రమలో ఏం జరుగుతున్నది? ఎవరి ఆధీనంలో ఉన్నది? వాళ్లు ఏం చేస్తున్నారు? అనే విషయాలు సంబంధిత అధికారులు, పారిశ్రామికవాడలోని సిబ్బందికి తెలిసేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. పరిశ్రమలను వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్ పేరుతో నాలుగు రకాలుగా విభజించారు. వైట్, గ్రీన్ పరిశ్రమలపై అంతగా తనిఖీలు అవసరం లేదని, ఆరెంజ్, రెడ్ కింద వచ్చే పరిశ్రమలపై నామమాత్రంగా తనిఖీలు చేస్తే చాలని, వేధింపులు వద్దని ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపించి పరిశ్రమల యజమానులు అధికారులను అంతో ఇంతో ముట్టచెప్పి తమ దందాలు కానిచ్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది. అటు పాలకులు, ఇటు పరిశ్రమల యజమానులు, ప్రభుత్వ అధికారులు బాగుంటున్నా సమాజం నాశనమై పోతున్నది. నిరంతర తనిఖీలు లేకపోవడం మూలంగా చర్లపల్లి లాంటి ఘటనలు మున్ముందు ఇంకా అనేకం బట్టబయలు అవుతాయని కాలుష్య నియంత్రణ మండలిలో పనిచేసిన ఒక అధికారి వ్యాఖ్యానించారు.
నిద్రమత్తులో డ్రగ్ కంట్రోల్ అధికారులు
ఫార్మా లేదా బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకున్న తరువాత ఆ కంపెనీలకు వెళ్లి నిరంతరం తనిఖీలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ డ్రగ్ కంట్రోల్ విభాగంపై ఉంది. అయితే వాళ్లు ఎంత సేపు మెడికల్ షాపులు, ఫిర్యాదు వస్తే ఫౌల్ట్రీ ఫామ్ లు, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించడం తప్పితే పారిశ్రామిక వాడలకు వెళ్లి సోదాలు జరిపిన సందర్భాలు పెద్దగా లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు పెద్ద ఎత్తున ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో ఫార్మా, బల్క్ డ్రగ్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి? నియంత్రణ కు తీసుకోవాల్సిన చర్యలేంటి? నిరంతర తనిఖీలపై ఏం చేయలి? అనేదానిపై ప్రభుత్వానికి కూడా ఒక కార్యాచరణ లేదనే అభిప్రాయాలను సచివాలయ ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఘటనలు జరుగుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణలో మత్తు పదార్థాల కట్టడికి యాంటి నార్కొటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసినప్పటికీ, పారిశ్రామిక వాడల్లో ఏం జరుగుతుందనేది ఈ విభాగానికి తెలియడం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్, నార్కొటిక్ బ్యూరో లను అనుసంధానం చేసి మరిన్ని అధికారాలను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ కు బానిస అయిన వారు ప్రభుత్వ లెక్కల ప్రకారం 40వేల వరకు ఉన్నారు. ఇంకా అనధికారికంగా ఎంత మంది ఉన్నారనేది లెక్క చెప్పడం కష్టం. బానిస అయిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలే ఉన్నారని అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. కొరియర్ ద్వారా తమకు అవసరమైన పదార్థాన్ని తెప్పించుకుని ఎంజాయ్ చేసే స్థాయికి విద్యార్థులు వెళ్లారంటే ఊహించుకోవచ్చు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు గాలికి!
రాష్ట్రంలో 2017 సంవత్సరంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా, నటులు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్, పూరి జగన్నాథ్, నవదీప్, సుబ్బరాజు, కొందరు వ్యాపారవేత్తలు, నాయకుల కుమారులను విచారించి మొత్తం 12 కేసులు నమోదు చేశారు. ఇందులో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ రంగ ప్రవేశం చేసింది కూడా. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ కు జుట్టు, గోళ్ళు నమూనాలు పంపించే ప్రక్రియ సరిగా చేయలేదంటూ, సాక్ష్యాలు లేవంటూ ఆరు కేసులను ప్రత్యేక కోర్టు ఈ కేసును కొట్టివేసింది. వారిపై బలమైన కేసును నిర్మించడంలో ఎక్సైజ్ శాఖ విఫలమైందని కోర్టు వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం.
ఇదీ చర్లపల్లి ఫ్యాక్టరీ నేపథ్యం
శుక్రవారం నగరంలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఐదో ఫేజ్ నవోదయ కాలనీలో మెఫిడ్రిన్ మత్తు పదార్థం తయారు చేస్తున్న ఇద్దరిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కంపెనీ నుంచి రూ.11.58 కోట్ల విలువైన మెఫిడ్రిన్, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి సరకును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాసులు షాక్ కు లోనయ్యారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్ ఫ్యాక్టరీ గుట్టు బయటపడింది. గత నెల ముంబయిలో బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ ను అరెస్టు చేశారు. ఆమె ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ చర్లపల్లి నుంచి డ్రగ్స్ తయారై వస్తున్నట్లు వెల్లడైంది. మహారాష్ట్ర పోలీసులు చర్లపల్లిలోని వాగ్ధేవీ ల్యాబోరేటరీస్ పై ఆకస్మిక దాడి నిర్వహించి యజమాని వోలేటీ శ్రీనివాస్ విజయ్, సహాయకుడు పండరీనాథ్ పట్వారీ లను అదుపులోకి తీసుకుని కోర్టు ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వారిద్దరిని తమ వెంట ముంబైకి తీసుకుపోయారు. వాస్తవానికి ఈ కంపెనీ స్థలాన్ని జలంధర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి నాలుగేళ్ల క్రితం లీజుకు తీసుకున్నారు. ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తున్నానని నమ్మంచి గుట్టుగా మెఫిడ్రిన్ తయారీ చేస్తున్నాడు.