నటుడు నవదీప్‌ను విచారించిన నార్కోటిక్‌ అధికారులు.. ఆరు గంటల విచారణ

నటుడు నవదీప్‌ను విచారించిన నార్కోటిక్‌ అధికారులు.. ఆరు గంటల విచారణ

విధాత : డ్రగ్స్‌ కేసులో తెలుగు సినీ నటుడు నవదీప్‌ను నార్కోటిక్‌ అధికారులు శనివారం ఆరుగంటల పాటు విచారించారు. బషీర్‌బాగ్‌ టీఎస్‌ నార్కోటిక్‌ అధికారుల బృందం నవదీప్‌ను విచారించింది.

విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్‌ కేసులో నోటీస్‌లు ఇచ్చినందునా విచారణకు హాజరయ్యానని, రామచందర్‌ అనే వ్యక్తితో తనకు పదేళ్ల క్రితం పరిచయం ఉందన్నారు. తాను అతని వద్ధ ఎలాంటి డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని, ఎప్పుడు, ఎక్కడా తాను డ్రగ్స్‌ తీసుకోలేదన్నారు.

గతంలో ఓ పబ్‌ను నిర్వహించినందునా తనను విచారించారన్నారు. గతంలో సిట్‌, ఈడీ విచారిస్తే ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్స్‌ అధికారులు విచారించారని, వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు.

అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారని చెప్పారన్నారు. అలాగే తన ఏడేళ్ల పాత ఫోన్‌ రికార్డులను పరిశీలించి దర్యాప్తు చేశారని, బీపీఎం క్లబ్‌తో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు వేశారన్నారు. డ్రగ్స్‌ కేసు విచారణ అధికారుల బృందం బాగా పనిచేస్తుందంటూ నవదీప్‌ కితాబునిచ్చాడు.