చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీపై సమగ్ర నివేదిక సమర్పించండి: మంత్రి జూపల్లి
చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

- ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది?
- మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై మరింత గట్టి నిఘా పెట్టాలి
- ఎక్సైజ్, పోలీసులు సమన్వయంతో పని చేయాలి
హైదరాబాద్, సెప్టెంబర్8(విధాత): చర్లపల్లి డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. సచివాలయంలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్వర్క్ మూలాలు హైదరాబాద్‌లో బయటపడ్డ నేపథ్యంలో కేసు పూర్వాపరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. చర్లపల్లి పారిశ్రామిక వాడలో ఓ ప్యాక్టరీలో డ్రగ్స్ తయారీ ముడి పదార్థాలను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఇంత జరుగుతున్న మన ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, మాదకద్రవ్యాల నియంత్రణకు కార్యచరణను రూపొందించాలని దిశానిర్ధేశం చేశారు.
మాదకద్రవ్యాల, నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, వినియోగం, రవాణాపై మరింత గట్టి నిఘా పెట్టాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల సాగు, తయరీ, రవాణా, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల నుంచి విక్రయదారుల వరకు సరఫరా లింకులపై డేగ కన్ను వేసి ఉంచాలన్నారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, విద్యార్థులు, యువకులను కొందరు గంజాయి స్మగ్లర్లు ఆసరాగా చేసుకున్నారని అన్నారు. అందుకని ఆయా అడ్డాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషీ, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథం, ఇతర అధికారులు వాగ్దేవి ల్యాబోరేటరీస్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. రేపటిలోగా అధికారులు దీనిపై నివేదికను అందజేయనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్, అదనపు కమిషనర్ ఖురేషీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.