IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
IRCTC Andaman Package | ఈ వేసవి కాలంలో అండమాన్ వెళ్లాలని అనుకునే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పర్యటన తర్వాత ఏప్రిల్ 4న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
IRCTC Andaman Package | ఈ వేసవికాలంలో అండమాన్ దీవులకు వెళ్లాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ట్యూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. అండమాన్‌లోని పోర్ట్‌బ్లెయిర్, హేవ్‌లాక్ దీవి, నీల్ దీవి వంటి ప్రాంతాల పర్యటన కోసం ఈ ప్యాకేజిని రూపొందించింది. ఈ నెల 30వ తేదీన ఈ టూర్ ప్రారంభం కానుంది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పర్యటన అనంతరం ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
ప్రకృతి అందాలు, నీలిరంగు సముద్రం పక్కన తెల్లటి ఇసుక తీరాలతో అండమాన్ దీవులు ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ పర్యటించేందుకు ప్రతి ఏటా వేలాదిమంది టూరిస్టులు వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే భారతీయుల కోసం ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ పర్యటనలో భాగంగా మార్చి 30వ తేదీన హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రారంభమై.. తిరిగి ఏప్రిల్ 4న తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ప్యాకేజిలో భాగంగా సెల్యులర్ జైలు మ్యూజియం, కార్బిన్స్ కోవ్ బీచ్, రాధానగర్ బీచ్, ఎలిఫెంట్ బీచ్, కలాపథర్ బీచ్, లక్ష్మణ్‌పూర్ బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు.
ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ పెద్దల నుంచి ఒక్కొక్కరికీ రూ.65,850(సింగిల్ ఆక్యుపెన్సీ) వసూలు చేస్తుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే ఒక్కొక్కరికీ రూ. 48,700, ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.46,950 చార్జీ చేస్తుంది. ఇక ఐదు నుంచి 11 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక ధరలు వర్తిస్తాయి. ఇక ఈ టూర్‌కు పరిమితంగా 29 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు. ఆసక్తిగల వారు సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

షెడ్యూల్ ఇదీ..
మొదటి రోజు: హైదరాబాద్ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున బయల్దేరి శ్రీ విజయపురం ( పోర్ట్‌బ్లెయిర్ )కు చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత సెక్యులర్ జైలు మ్యూజియం, కార్బిన్ కోవ్ బీచ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శిస్తారు. సాయంత్రం సెల్యులర్ జైలులో జరిగే లైట్ అండ్ సౌండ్ షో వీక్షిస్తారు. అనంతరం పోర్ట్‌బ్లెయిర్‌లోని హోటల్‌లో డిన్నర్ పూర్తి చేసుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
రెండో రోజు: హోటల్‌లో చెక్‌అవుట్ చేసి క్రూయిజ్ ద్వారా హేవ్‌లాక్‌కు వెళ్తారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేసిన తర్వాత రాధానగర్ బీచ్‌ను సందర్శిస్తారు. హేవ్‌లాక్‌లోనే హోటల్‌లోనే డిన్నర్ చేసి, రాత్రి బస చేస్తారు.
మూడో రోజు: హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసి, ఎలిఫెంట్ బీచ్‌కు తీసుకెళ్తారు. అక్కడ స్నో రైలింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమాలు ఉంటాయి. ఇది పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది. దీని తర్వాత హేవ్‌లాక్ దీవిలోని హోటల్‌లో రాత్రి భోజనం తిని, అక్కడే బస చేస్తారు.
నాలుగో రోజు: హేవ్‌లాక్ దీవిలోని హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అక్కడి నుంచి కాలా పథర్ బీచ్‌కు వెళ్తారు. అనంతరం క్రూయిజ్‌లో నీల్ దీవికి వెళ్తారు. అక్కడ చెక్ ఇన్ అయిన తర్వాత సాయంత్రం సీతాపూర్ బీచ్, లక్ష్మణ్‌పూర్ బీచ్‌లను సందర్శించి, అక్కడ సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. నీల్ దీవిలోని హోటల్‌లోనే రాత్రి భోజనం చేసి, అక్కడే బస చేస్తారు.
ఐదో రోజు : నీల్ దీవిలోని హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అనంతరం చెక్‌అవుట్ చేసి భరత్ నగర్ బీచ్‌కు వెళ్తారు. అక్కడి నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు క్రూయిజ్‌లో వెళ్తారు. అక్కడే హోటల్‌లో బస, రాత్రి భోజనం ఉంటుంది.
ఆరో రోజు: పోర్ట్‌బ్లెయిర్‌లోని హోటల్‌లోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అనంతరం చెక్‌అవుట్ చేసి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ చేరుకుంటారు.
ప్యాకేజీలో ఉండే సదుపాయాలు
- ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి పోర్ట్‌బ్లెయిర్ వరకు రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు,
- ఐదు రాత్రుల హోటల్ వసతి, ఐదు రోజులకు సంబంధించి బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్
- పర్యటన సందర్భంగా ఏసీ బస్సులో ట్రాన్స్‌పోర్టేషన్
- హేవ్ లాక్, నీల్ ఐలాండ్‌కు ప్రయాణ సదుపాయం
- ఐఆర్‌సీటీసీ నుంచి టూర్ ఎస్కార్ట్
ప్యాకేజిలో లేని సదుపాయాలు
- మధ్యాహ్న భోజనం, విమానాల్లో భోజనం
- టూర్ సమయంలోని వ్యక్తిగత ఖర్చులు
- హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టు పికప్ అండ్ డ్రాప్
- టూర్ గైడ్ చార్జీలు, టిప్స్
ఐఆర్‌సీటీసీ కీలక సూచనలు
ప్రయాణానికి కనీసం రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలని ఐఆర్‌సీటీసీ అధికారులు సూచించారు. ప్రయాణ సమయంలో ఒరిజినల్ ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు. హోటల్ గదుల కేటాయింపు అందుబాటులో ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. విమాన సమయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram