Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు కేబుల్స్ తొలగింపు కారణంగా నిలిచిపోయాయి; అధికారులు పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ సచివాలయంలో గురువారం నాడు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. విద్యుత్ స్థంబాలకు ఇంటర్నెట్ కేబుల్స్ తొలగింపు ప్రక్రియను వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత టీజీసీపీడీసీఎల్ చేపట్టింది. ఈ క్రమంలోనే సచివాలయానికి ఇంటర్నెట్ సరఫరా చేసే కేబుల్స్ కూడా కట్ అయ్యాయి. దీంతో ఇంటర్నెట్ రావడం లేదు. అనుమతి లేని కేబుల్స్ ను తొలగించాలని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. అయితే విద్యుత్ స్థంబాలకు ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేసే విషయమై పోలీస్ శాఖ విద్యుత్ శాఖకు ఓ సూచన చేసింది. గణేష్ నిమజ్జనం వరకు బందోబస్తు అవసరాల రీత్యా కెమెరాలు 24 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో కేబుల్స్ తొలగింపును నిమజ్జనం వరకు నిలిపివేయాలని పోలీస్ శాఖ విద్యుత్ శాఖను కోరింది. దీంతో నిమజ్జనం వరకు ఈ తొలగింపును తాత్కాలికంగా విద్యుత్ శాఖ నిలిపివేసింది. నిమజ్జనం పూర్తైన తర్వాత తిరిగి ఈ కేబుల్స్ తొలగింపును ప్రారంభించింది. అయితే ఇవాళ సచివాలయానికి ఇంటర్నెట్ సరఫరా చేసే కేబుల్స్ కట్ చేశారు. ఇంటర్నెట్ కట్ కావడంతో సచివాలయంలో పనులు పెండింగ్ లో పడే అవకాశం ఉంది. ఇంటర్నెట్ సేవలను పునరుద్దించాలని అధికారులు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. సచివాలయానికి ఇంటర్నెట్ సరఫరా చేసే సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ పునరుద్దరణకు చర్యలు తీసుకుంటున్నారు.