TELANGANA LOCAL BODY ELECTIONS | తెలంగాణ స్థానిక ఎన్నికలపై బిగ్ అప్ డేట్!
తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇదొక కీలక అప్ డేట్. అన్నీ అనుకున్నట్టు సాగితే దసరా తర్వాత ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్టు సచివాలయ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విధాత):
TELANGANA LOCAL BODY ELECTIONS | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు దసరా తర్వాతే జరుగనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇంకా తేలలేదు. ఈ నెల 30 లోపుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు గతంలో పెట్టిన గడువు సమీపిస్తోంది. అయితే ఈ నెల 8న రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ప్రత్యేక జీవో జారీ?
పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలను సవరిస్తూ తెచ్చిన బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఇటీవలనే ఆమోదించింది. అవి గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులను ఆమోదించాలని గవర్నర్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరారు. కానీ.. గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ బిల్లులపై ఈ నెల 8వ తేదీ వరకు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ప్రచారం సాగుతోంది. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్లి, న్యాయపరమైన చిక్కులు వస్తే ఎన్నికల నిర్వహణకు మరింత గడువు ఇవ్వాలని కోర్టును కోరే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి సీఎం నుంచి పంచాయితీరాజ్ శాఖ అధికారులకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాలేదని సమాచారం. దీనిపై సీఎం నుంచి స్పష్టత కోసం అధికారులు వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ ఇటీవల అసెంబ్లీ నుంచి వెళ్లిన బిల్లులను గవర్నర్ మళ్లీ కేంద్రానికి పంపితే లేదా రాజ్ భవన్ లోనే ఈ బిల్లులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటే ఎన్నికల నిర్వహణకు మరింత సమయం కావాలని కోరే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది.
గవర్నర్ ఏం చేస్తారు?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నిస్తోంది. గతంలోనే అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. ఇవి రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఆర్డినెన్స్ గవర్నర్ న్యాయ సలహా తీసుకొని కేంద్రానికి పంపారు. తాజాగా రెండు బిల్లులను చట్ట సవరణ చేసి మరోసారి గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులపై గవర్నర్ నిర్ణయం ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయమై స్పష్టత రానుంది.