Municipal Elections | గరంగరంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలై.. నామినేషన్ల పర్వం ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Municipal Elections | గరంగరంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
  • నెమ్మదిగా వేడెక్కుతున్న రాజకీయ వాతావ‘రణం’
  • ప్రచారవ్యూహాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్
  • ఎన్నికల ప్రచార సభలకు ముఖ్యనేతలు

 

(విధాత, ప్రత్యేక ప్రతినిధి)

Municipal Elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఫోన్ ట్యాపింగ్ విచారణ, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటం, నిన్నటి వరకు మేడారం జాతర హంగామా సోమవారంతో నెమ్మదిగా చల్లబడి.. ఆ స్థానంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే దశకు చేరుకోవడంతో మరో అంకంలోకి ఎన్నికల వాతావరణం ప్రవేశిస్తోంది. బరిలో నిలిచిన అభ్యర్ధులు తమ విజయం కోసం తీవ్ర ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీలూ ఎన్నికలు త్వరలో వస్తాయని అంచనా వేశాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినందున జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తారని ముందుగా అంచనా వేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపింది. ఎన్నికలొస్తాయనే అంచనా ఉన్నందున అన్ని పక్షాలు తమ పార్టీ నాయకులు, క్యాడర్‌ను సంసిద్ధం చేస్తూ వచ్చారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తి కావడంతో ఇక ఎన్నికల నోటిఫికేషనే తరువాయి అనే రీతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల ముఖ్యనాయకత్వం, ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్ లు అప్రమత్తమయ్యారు. రిజర్వేషన్లకు తగిన విధంగా అభ్యర్ధుల ఎంపికలో నిమగ్నమయ్యారు. పార్టీల మార్పులు, బలాబలాల అంచనాలతో వ్యవూహాలు సిద్ధం చేసుకున్నారు. తాజాగా అన్ని పక్షాల నాయకులు నామినేషన్ లు దాఖలు చేయడంతో రెబల్స్ ను విరమింపజేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

బలాలను సమీకరించుకుంటున్న పార్టీలు : కాంగ్రెస్​, బిఆర్​ఎస్​ పోటాపోటీ

Revanth Reddy and KTR at separate public meetings ahead of Telangana municipal election campaign preparations

మున్సిపాలిటీలన్నీ పట్టణ ప్రాంతాలు కావడంతో సహజంగానే రాజకీయ చర్చకు అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో మెజారిటీ మున్సిపాలిటీలు నియోజకవర్గ కేంద్రాలుగానూ ఉన్నాయి. దీంతో మొత్తం నియోజకవర్గంతోపాటు, ఆయా జిల్లాల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సర్వశక్తులను కేంద్రీకరిస్తున్నారు. అంగబలం, ఆర్ధిక, కుల బలం ఉన్న నాయకులను రంగంలోకి దింపి… గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. దీంతో అప్పుడే మున్సిపాలిటీల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ మధ్యలో జంప్ జిలాలనీలను ప్రోత్సహిస్తూ తమ తమ అభ్యర్ధుల గెలుపునకు సర్వశక్తులొడ్డుతున్నారు. తమ బలం పెంచేందుకు ఇతర పార్టీల్లోని పలుకుబడి ఉన్నవారికి గాలం వేసే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా కొందరు నాయకులు తమకు నిన్నటి వరకు ఉన్న పార్టీలో పోటీ ఛాన్స్ రాకపోవడంతో ఎదుటి పార్టీలోకి చేరిపోతున్నారు. ముఖ్యంగా పలుచోట్ల అభ్యర్థుల ఎంపికలు, బీ ఫామ్ ల కోసం పోటీపడ్డారు. దీంతో పలు జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారించిన నేపథ్యంలో ఆ పార్టీ ఇచ్చిన నిరసనలతో తెలంగాణ అంతటా రాజకీయ కాక మరింత పెరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతల సభలు, బీఆర్ఎస్ నాయకులు రోడ్ షోల ద్వారా ప్రచారానికి పథకాలు సిద్ధం చేసుకుంటున్నందున పరిస్థితి మరికొంత గరంగరంగా మారనున్నది.

ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకులు, అమిత్​ షా, నితిన్​ నబీన్​.?

Amit Shah with BJP Telangana leader at public event as party prepares for Telangana municipal election campaign

జరిగేవి మున్సిపల్ ఎన్నికలైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డితోపాటు అమిత్ షా సహా బీజేపీజాతీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని వార్తలు వెలువడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ విడుదలయ్యాయి. ఈ నెల 4న మిర్యాలగూడ, 5న చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న పరిగి, 8న భూపాలపల్లి, 9న మెదక్‌లో సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా బీజేపీ నేత అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్​ ఆదిలాబాద్ , నిజామాబాద్ జిల్లాలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారని సమాచారం. వామపక్ష పార్టీల నాయకులు తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మరో వైపు ఈ ఎన్నికల ద్వారా తమ పట్టును కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కూడా తమదైన పద్ధతిలో ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నది. ఇంకో వైపు రాజకీయ పొత్తులు పెట్టుకునేందుకు కొందరు బహిరంగంగా ప్రయత్నించగా మరి కొన్ని పక్షాలు లోపాయకారిగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. ఎలాగైనా ఎన్నికల్లో గెలువడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల నాయకులు పావులు కదుతుపున్నారు. వెరసి.. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Read Also |

MAG7 Job Cuts | ఏఐ ఎఫెక్ట్‌.. రానున్న రెండేళ్లలో లక్షల్లో ఉద్యోగులను తొలగించనున్న బడా టెక్‌ కంపెనీలు
Coffee | రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగితే మంచిదో తెలుసా?.. అంతకుమించి తాగితే విషమే!
Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్