BC JAC State Bandh | బీసీ బంద్‌.. సందులో సడేమియా రాజకీయ డ్రామాలు..

రాష్ట్ర బంద్ సంపూర్ణంగా సక్సెస్ అయ్యింది. బీసీల రిజర్వేషన్లపై ప్రధాన పార్టీల నటన అదిరిపోయింది. ఆపరేషన్ సక్సెస్ రోగం మాత్రం తగ్గలేదన్నట్లుగా బీసీల పరిస్థితి మారింది. రాష్ట్ర బంద్ సక్సెస్ అయినప్పటికీ 42 శాతం రిజర్వేషన్లకు పరిష్కారం మాత్రం లభించే పరిస్థితి ఇప్పుడే కనిపించడంలేదు.

BC JAC State Bandh | బీసీ బంద్‌.. సందులో సడేమియా రాజకీయ డ్రామాలు..

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

BC JAC State Bandh | 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్‌లో రాజకీయ పార్టీల అవకాశవాదం మరోసారి బహిర్గతమైంది. ఈ సందర్భంగా సందులో సడేమియాగా తమ సొంత డ్రామాలకు తెరతీశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. పరస్పర విమర్శలతో ప్రధాన నాయకులు రాజకీయ నాటకాన్ని రక్తి కట్టించారు. కొందరు నేతలైతే తామే బీసీలకు వారసులమంటూ ‘కోతలు’ కోసే స్థితికి చేరుకున్నారు. చాలా కాలానికి ఐక్యంగా బీసీసంఘాలు జేఏసీగా ఏర్పడి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తోపాటు సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, నక్సలైట్ పార్టీలు, ప్రజా, విద్యార్థి, మేధావి సంఘాలు సంపూర్ణ మద్ధతునందించాయి. ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నడూలేనంత హాడావుడి చేస్తూ భాగస్వామ్యమయ్యాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులైతే బీసీలకు తామే చాంపియన్ అనే తీరుగా హల్ చేశారు. ఒక పార్టీపై మరో పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేసి పొలిటికల్ సీన్లను రక్తి కట్టించారు. పోటీపడుతూ పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. మరోసారి అమాయక బీసీ ప్రజలను నగ్నంగా వంచించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

బంద్ సక్సెస్.. ఫలితం నిల్

రాష్ట్ర బంద్ సంపూర్ణంగా సక్సెస్ అయ్యింది. బీసీల రిజర్వేషన్లపై ప్రధాన పార్టీల నటన అదిరిపోయింది. ఆపరేషన్ సక్సెస్ రోగం మాత్రం తగ్గలేదన్నట్లుగా బీసీల పరిస్థితి మారింది. రాష్ట్ర బంద్ సక్సెస్ అయినప్పటికీ 42 శాతం రిజర్వేషన్లకు పరిష్కారం మాత్రం లభించే పరిస్థితి ఇప్పుడే కనిపించడంలేదు. చాలా కాలానికి బీసీల్లో కాస్తంత చలనం ఏర్పడి, తమ ఐక్యతను ప్రదర్శించే ప్రయత్నం చేసినప్పటికీ, ఈ విశాల వేదికపై కూడా ప్రధాన పార్టీ నాయకులు నటనాచాతుర్యమే ప్రధానమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాటలతో మరోసారి వంచించే ప్రయత్నం చేశారని పలువురు బీసీ నేతలు మండిపడుతున్నారు. పార్టీలన్నీ బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ సహకారం అందిస్తే ‘మరి అడ్డుకుంటోంది’ ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం లభించలేదు. బంద్ సందర్భంగా పలువురు సామాన్య బీసీలు ఇవే అనుమానాలు వ్యక్తం చేశారు. ‘చుట్టూ శాఖాహారులేగానీ నడుమ రొయ్యలు మాయమైనట్లు’గా బీసీ రిజర్వేషన్లకు అన్ని పక్షాలు, ముఖ్యంగా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ, రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, మిగిలిన పక్షాలన్నీ మద్ధతు నిచ్చిన తర్వాత 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేందుకు అర క్షణం కూడా పట్టదంటున్నారు. మరి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొన్ని రాజకీయ పక్షాలు గోముఖ వ్యాఘ్రంగా మారి, రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తూ డ్రామాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమైన బీసీ ఓటు బ్యాంకుతో తమకు నష్టం వాటిల్లకుండా కుయుక్తులకు పాల్పడుతున్నానే విమర్శలు వెల్లువెత్తాయి.

బీజేపికి ప్రశ్నలు

బీసీ సంఘాలు ఐక్యమై ఇచ్చిన బంద్ పిలుపును విజయవంతం చేసేందుకు నాయకులు, శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లకు తొలి నుంచి మద్ధతుగా నిలిచిన పార్టీలు, ప్రజాసంఘాలు అగ్రభాగాన నిలిచాయి. ఎస్సీ, ఎస్టీ, ఎమ్మార్పీఎస్ తదితర సంఘాలు ప్రత్యక్ష భాగస్వామ్యమై తమ మద్దతును చాటిచెప్పాయి. అన్ని సంఘాలు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తీవ్రంగా ప్రశ్నించాయి. అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న పనికి కేంద్రంలోని బీజేపీ సహకరిస్తే బిల్లు చట్టంగా రూపొందడం పెద్ద కష్టమేమీ కాదు. 50శాతం మించి రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడ్డుగా ఉన్న రాజ్యాంగ నిబంధన మార్చేందుకు అవకాశం లభిస్తుంది. 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్ల బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉందని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు.

పరస్పర విమర్శలతో రగడ

ఐక్యత చాటాల్సిన బంద్‌లో బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పర విమర్శలతో రగడ సృష్టించారనే వాదనలు ఉన్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించారని బీసీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్, బీసీ నేత హనుమంత రావు, మంత్రులు పొన్నం, సురేఖ మాట్లాడుతూ ఒకవైపు బిల్లులను అడ్డుకుంటూ.. మరోవైపు బీజేపీ నాయకులు బంద్‌లో పాల్గొంటారా? అంటూ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు ఆగడానికి బీజేపీనే కారణమని విమర్శించారు. గవర్నర్ సంతకం చేయకుండా బిల్లును కేంద్రానికి పంపారని, బీజేపీ డ్రామాలు ఆడుతోందని, ఆ పార్టీ ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు.

బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోంది: బీఆర్ఎస్

బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, గంగుల కమలాకర్ తదితరులు బీసీ రిజర్వేషన్లలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్ల‌రేష‌న్ పేరుతో మోసం చేశారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఏడాదికి 20 వేల కోట్లు నిధులు కేటాయిస్తార‌మనే హామీ, 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అతీగతీ లేదన్నారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల పేరుతో ఆర్డినెన్స్‌లు, జీవోలు, కోర్టులు, ఢిల్లీలో ధ‌ర్నాలు పేరుతో బీసీ స‌మాజాన్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు: బీజేపీ

కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధతలేకుండా రాజ్యాంగ నిబంధనలు పట్టించుకోకుండా డ్రామా చేస్తున్నదని విమర్శించారు. బీసీలకు ఆశచూపి నిరాశకు గురిచేస్తుందని మండిపడ్డారు. చట్టబద్దత లేకుండా ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. అఖిలపక్షాన్ని తీసుకెళితే ప్రయోజనం ఉండేదని సెలవిచ్చారు.

బీసీలకు బీజేపీ ద్రోహం: వామపక్షాలు

బీసీలకు బీజేపీ ద్రోహం చేస్తుందని సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, న్యూడెమోక్రసీ, మాస్ లైన్ పార్టీల నాయకులు కూనంనేని సాంబశివరావు, గోవర్ధన్, తక్కళ్లపల్లి, బాలరాజు, రాజేందర్, రవి తదితరులు మండిపడ్డారు. ఇప్పటికైనా పార్లమెంటులో చట్టం తెచ్చి షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ మంత్రులు, ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.

బీసీలకు అడ్డంకి ఎందుకు?: మంద కృష్ణ

50శాతం రిజర్వేషన్లు బీసీల రిజర్వేషన్లు పెంచేందుకు మాత్రమే అడ్డంకిగా ఎందుకు మారాయని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చినపుడే 50శాతం నిబంధన ఉల్లంఘించారని, అప్పుడు లేని అడ్డంకి ఇప్పుడెందుకన్నారు. బంద్ ద్వారా సమాజం బీసీలకు మద్ధతుగా నిలిచిందన్నారు. రిజర్వేషన్ల పై దేశమంతా ఒకే విధానం అమలు చేయాలన్నారు. కేంద్రం స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. బీసీ రిజర్వేషన్లు బలహీనవర్గాల డిమాండ్ అంటూ పేర్కొన్నారు.