Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14, 15 తేదీల్లో టోల్ ఫీజు లేకుండా వాహనాలకు అనుమతి. ఉచిత లడ్డూలు, భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.

Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్

విధాత: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీశైలం శైవ క్షేత్రంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18 వరకు మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నడుం బిగించింది. దేవస్థానం బ్రహ్మోత్సవాలతో పాటు ఈనెల 15వ తేదీన మహా శివరాత్రి సందర్బంగా వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహా శివరాత్రి నేపథ్యంలో శ్రీశైలం పుణ్య క్షేత్రం వచ్చే భక్తులకు ఈ నెల 14, 15 తేదీల్లో టోల్ ఫీజు లేకుండానే వాహనదారులను అనుమతించనున్నారు.

భక్తులకు ఉచిత లడ్డూలు, పాలు, బిస్కట్లు

అలాగే ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు భక్తులకు ఉచితంగా లడ్డూలు అందచేయాలని నిర్ణయించారు. క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తుల కోసం పాలు, బిస్కెట్లు, అల్పాహారం కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇక భక్తుల సౌకర్యం కోసం మంచినీరు మౌలిక సదుపాయాలు భద్రత ఏర్పాట్లు కూడా చేస్తోంది. శ్రీశైలంలోని సదాశివయ్య భవన్‌లో దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు సమీక్ష నిర్వహించి అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు చేశారు. 30 అదనపు లడ్డూ కౌంటర్లు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ ఏడాది భక్తుల రద్దీ గత ఏడాది కంటే 30 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉందని మంత్రులు, అధికారుల బృందం అంచనా వేసింది. సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల వినతిమేరకు 4వ తేదీ నుంచి నల్లమల మీదుగా పాదయాత్రగా వచ్చే భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇక ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్, భద్రతను పర్యవేక్షించనున్నారు. స్పర్శ దర్శనం (శివదీక్ష స్వాములకు ప్రత్యేక సమయాలు), అభిషేకం, సాధారణ దర్శనాల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి :

Baggage Rules 2026 | విదేశాల నుంచి 40గ్రాముల వరకు బంగారు ఆభరణాలు తెచ్చుకోవచ్చు : కొత్త బ్యాగేజ్ రూల్స్
Gold, Silver price fall| పెరిగిన బంగారం.. తగ్గిన వెండి ధర.. ఇప్పుడు కొనవచ్చా ?