Murder Mystery | వివాహేతర సంబంధంతో ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి కన్నకొడుకును చంపి శవాన్ని మాయం చేసింది. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసినా దర్యాప్తు ముందుకు సాగకపోవడంతో న్యాయం కావాలని హైకోర్టు దాకా వెళ్లింది. ప్రభుత్వం నుంచి పరిహారం పొందాలనే అత్యాశతో వేసిన అడుగులే ఆమెను చివరకు చిక్కుల్లో పడేశాయి. ఈ కేసును హైకోర్టు సీరియస్‌గా తీసుకుని సిట్‌ను ఏర్పాటు చేయగా.. విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బడినేహాలు గ్రామానికి చెందిన మాల గంగమ్మ-పెద్దలక్ష్మయ్య భార్యభర్తలు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే భర్త పెద్ద లక్ష్మయ్య ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ తర్వాత ఆమెకు సమీప బంధువైన అదోని మండలం జి.హోసళ్లి గ్రామానికి చెందిన బేగారి దర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దర్గప్ప తరచూ తమ ఇంటికి రావడం గంగమ్మ పెద్ద కుమారుడు వీరేశ్ (15)కు నచ్చలేదు. ఆమె అక్రమ సంబంధంపై పలుమార్లు గొడవపెట్టుకున్నాడు.

తమ బంధానికి అడ్డుగా వస్తున్నాడని కన్న కొడుకునే హతమార్చాలని ప్రియుడు దర్గప్పతో కలిసి గంగమ్మ ప్లాన్ వేసింది. 2024 నవంబర్‌లో ఇంట్లోనే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి బైక్‌పై ఊరి చివర ఉన్న శ్మశాన వాటికలో రహస్యంగా పాతిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా 2024 నవంబర్ 11వ తేదీ నుంచి తమ కుమారుడు వీరేశ్ కనిపించడం లేదని గంగమ్మ కతాళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తు చేయకుండా వదిలేశారు.

అలా రోజులు గడిచిపోయాయి. పోలీసులు కూడా కేసును పక్కనబెట్టడంతో గంగమ్మ, దర్గప్ప ఇద్దరూ దర్జాగా తిరగడం మొదలుపెట్టారు. అప్పుడే స్థానికులు ఎవరో ఇచ్చిన సలహా మొత్తం కేసును మలుపుతిప్పింది. కుమారుడి మిస్సింగ్ కేసును ఆధారంగా చేసుకుని హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వం నుంచి పరిహారం పొందవచ్చని కొందరు సలహా ఇవ్వడంతో గంగమ్మ ఆశపడింది. వెంటనే తమ కుమారుడి ఆచూకీని కనుగొనడంలో పోలీసులు సరిగ్గా విచారణ చేయలేదని ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. ఏడాదిన్నర అవుతున్నా యువకుడి ఆచూకీ కనిపెట్టకపోవడం ఏంటని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. వీరేశ్ అదృశ్యంపై 20 రోజుల్లో సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాను ఆదేశించింది.

డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు సీఐడీ అదనపు ఎస్పీ సుప్రజ, డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఘటన జరిగిన సమయంలో కౌతాళంలో సీఐగా పనిచేసిన సీఐ అశోక్‌కుమార్‌ను కూడా ఇందులో నియమించింది. ఈ సిట్ అధికారులు రెండు వారాల పాటు బడినేహాలు గ్రామంలో ముమ్మరంగా ఆరా తీశారు. సాంకేతిక ఆధారాలు సేకరించారు. దీంతో గంగమ్మ ఆడిన నాటకం మొత్తం బయటపడింది. గంగమ్మ, దర్గప్పలే వీరేశ్‌ను చంపినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. పోలీసులు తమదైశ శైలిలో విచారణ జరపగా వారు నేరం ఒప్పుకున్నారు. వీరేంద్రను ఇంట్లోనే హత్య చేసినట్లు అంగీకరించినా.. మృతదేహం ఎలా మాయం చేశారో చెప్పకుండా దృశ్యం సినిమాను తలపించేలా ట్విస్టులు చూపించారు. కానీ చివరకు జి.హోసళ్లి శివారు శ్మశాన వాటికలో వీరేశ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టామని దర్గప్ప ఒప్పుకున్నాడు. దీంతో ఆదివారం నాడు ఏఎస్పీ అధ్వర్యంలో తవ్వకాలు జరిపి వీరేశ్ అస్తిపంజరాన్ని వెలికితీసి పోస్టుమార్టం జరిపించారు.

ఇన్ని ట్విస్టుల నడుమ వీరేశ్ మృతదేహం లభించిన రోజే మరో ములపు చోటుచేసుకుంది. అదే రోజు నిందితురాలైన గంగమ్మ అనుమానాస్పద స్థితిలో మరణించింది. అనారోగ్యం కారణంగా రెండు రోజుల క్రితం ఆదోనీ ఆస్పత్రిలో చేరిన గంగమ్మ.. ఆరోగ్యం విషమించడంతో కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గంగమ్మ ఆదివారం మరణించింది. అయితే గంగమ్మ మృతిపై బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంగమ్మను విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లిన తర్వాత లాకప్‌డెత్‌లో ఆమె చనిపోయి ఉంటుందని ఆరోపిస్తున్నారు. కాగా, గంగమ్మ మృతదేహాన్ని భారీ బందోబస్తు నడుమ గ్రామానికి తీసుకొచ్చి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.