డిటిహెచ్ సేవలలో అగ్రగామిగా ఉన్న టాటా ప్లే Tata Play( టాటా స్కై- Tata Sky) తమ ప్యాకేజీలనుండి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియాకు(SPNI) సంబంధించిన అన్ని టివీ చానెళ్లను, వారి ముఖ్య చానెల్ అయిన సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్(సెట్-SET)తో సహా శాశ్వతంగా తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ చందాదారుల(Subscribers)కు సందేశాలను కూడా పంపిస్తున్నట్లు తెలిపిన టాటా ప్లే, సోనీ చానెళ్లకు వ్యూయర్షిప్(Viewership) లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, వినియోగదారులకు ఇష్టం లేకపోతే వేరే డిటిహెచ్ సేవకు మారవచ్చని కూడా చెప్పింది. ఆగస్టు 1వ తేదీ నుండి పది లక్షల(1 Million) చందాదారులతో ప్రారంభించి, పది రోజులలోగా మొత్తం తొలగిస్తామని సంస్థ ఎండీ, సిఈఓ హరిత్ నాగపాల్(Harit Nagpal) తెలిపారు.
కాగా, టాటా ప్లే నిర్ణయాన్ని ఏకపక్షం(Arbitrary)గా, ప్రతీకారధోరణి(retaliatory)తో తీసుకున్నదని సోనీ(SPNI) దుయ్యపట్టింది. నాగ్‌పాల్ మాత్రం తమ చందాదారులలో 40 నుండి 50 శాతం మంది సోనీ ప్యాకేజీలను తీసుకున్నప్పటికీ, కేవలం 25శాతం మాత్రమే ఆ చానెళ్లను వీక్షిస్తున్నారని వ్యూయర్షిప్ విశ్లేషణ ద్వారా(Viewership data) తెలిసిందన్నారు. సెట్ టాప్ బాక్స్ నుండి చానెల్ వీక్షణకు సంబంధించి వెనక్కిరావాల్సిన సమాచారం(Return path data) సరిగ్గా రాకపోతే, 75 శాతం మంది చందా కట్టీ, చానెల్ చూడటంలేదనే విషయం తెలుసుకోవడం చాలా కష్టమనీ, వినియోగదారుల క్షేమాన్ని కోరే సంస్థగా టాటా ప్లే, ఈ చానెళ్లను తీసేయాలని నిర్ణయించుకున్నామని, తద్వారా తమ చందాదారులకు నెలవారీ బిల్లు(Reduction in monthly bill amount) తగ్గుతుందని నాగ్‌పాల్ స్పష్టం చేసారు. అయినప్పటికీ, సోనీ చానెళ్లు చూడాలనుకునేవారు తిరిగి విడిగా చందాదారులుగా(Can subscribe individually) చేరవచ్చని, అటువంటి వారు తమ యాప్ ద్వారా గానీ, కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయడం ద్వారా గానీ లేదా ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా వెంటనే చానెళ్ల వీక్షణ ప్రారంభించుకోవచ్చని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా, సోనీ వాదన వేరుగా ఉంది. టాటా ప్లే నిర్ణయం తమకు నిరాశ కలిగించిందని, తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, వినియోగదారుల అభిరుచులను గౌరవించకుండా టాటా ప్లే ప్రవర్తించిందని ఆరోపించింది. గత కొన్నేళ్లుగా టాటా ప్లే వినియోగదారుల నిర్వహణ వ్యవస్థ(Subscriber Management System)లో లోపాలు, సమాచారంలో వ్యత్యాసాలు ఉన్నట్లు కనుగొన్న తాము, ఆడిట్ (Audit)చేస్తామని విజ్ఞప్తి చేసినందుకే వారు ప్రతీకార చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాము భావిస్తున్నట్లు ఎస్‌పిఎన్‌ఐ తెలిపింది.
1995లో సోనీ ఎంటర్టెయిన్మెంట్ టెలివిజన్(SET) చానెల్‌తో ప్రారంభించబడిన సోనీ ఎంటర్టెయిన్మెంట్ టెలివిజన్ ఇండియా లిమిటెడ్(SET India Limited), నేడు 26 చానెళ్ల(26 Channels)తో నడుస్తోంది. ఇవే కాక, సోనీలివ్(SonyLIV) స్ట్రీమింగ్ ప్లాట్ఫారం, స్టుడియో నెక్స్ట్(Studio NEXT) టెలివిజన్ స్టుడియో, సినీ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్(SPIP) కూడా ఎస్‌పిఎన్‌ఐ(SPNI)లో భాగమే.
కానీ, ఈ గొడవలకు ఇవేవీ కారణాలు కావని, పే చానెళ్లు, వాటి రుసుముల విషయంలో వచ్చిన తేడాలే ఈ స్పర్థలకు మూలమని డిటిహెచ్ సర్వీసుల నిపుణుడొకరు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ రెండు కంపెనీల మధ్య చిచ్చు రగులుతూనేఉందని, ఇప్పుడు ఈ విధంగా బయటపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.