విధాత, మెదక్ బ్యూరో: ఇటీవల మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్ పోలీసులు కొట్టిన దెబ్బలకు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఖదీర్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జాతీయ మైనార్టీ కమిషన్(National Minorities Commission) సభ్యురాలు కుమారి సయ్యద్ షాహెజాది సోమవారం మెదక్ పట్టణానికి వస్తున్నారని జాతీయ మైనార్టీ కమిషన్(NMC) ఏక్స్ పర్ట్ ఫ్యానల్ మెంబర్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు.
ఈ సందర్భంగా చేసిన ఏర్పాట్లను, ప్రోటోకాల్, వసతిని పర్యవేక్షించడానికి ముందుగా వచ్చానని శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన తెలిపారు. కమీషన్ సభ్యురాలు షాహేజాది సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి ఖదీర్ ఖాన్ ఇంటికి వెళ్లి వారి కుటుంభం సభ్యులను పరమార్షిస్తారని అన్నారు. మధ్యాన్నం 3 గంటలకు సి.ఎస్.ఐ. చర్చి ని సందర్శించి బిషప్ నుండి ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం క్రిస్టియన్ మైనారిటీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన వివరించారు.
అంతకు ముందు మెదక్ పట్టణంలో మైనారిటీ పాఠశాలను డాక్టర్ కిరణ్ కుమార్ జిల్లా మైనారిటీ అధికారి జెంలా నాయక్‌తో కలిసి పరిశీలించి విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.