Site icon vidhaatha

ఆ రెండు పార్టీలవి నీచ రాజకీయాలు

విధాత బ్యూరో, కరీంనగర్: లోకసభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నదని, ప్రజలు ఆ ప్రచారాలను నమ్మవద్దని, పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అలాంటి ప్రచారాలను ఎక్కడికి అక్కడ తిప్పి కొట్టాలని బీజేపీ కరీంనగర్ లోకసభ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం వేములవాడలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ శాసనసభ్యుని సోదరుడు మాదిగ సమాజాన్ని అవహేళన చేస్తూ మాట్లాడారని, ఆ పార్టీకి ఎస్సి సమాజంపై చిత్తశుద్ధి ఉంటే సదరు శాసనసభ్యుడిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆ సామాజిక వర్గ ప్రజలు కాంగ్రెస్ నేతలను నియోజకవర్గ పరిధిలో తిరగనివ్వరని స్పష్టం చేశారు. గత పదేళ్లుగా తెలంగాణలో జరిగిన నీచ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఇక్కడి ప్రజలను తలదించుకునేలా చేశాయన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని, చీత్కరించుకుంటున్నారని చెప్పారు. భార్యాభర్తల ఫోన్లు కూడా వినే సిగ్గుమాలిన చర్యకు ఆ ప్రభుత్వం పాల్పడిందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తామేమి తక్కువ తినలేదన్నట్లు ఫేక్ వీడియోలు షేర్ చేసే సంస్కృతికి తెరతీసిందన్నారు.

కేంద్ర హోం శాఖ మంత్రి మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసి, ఎడిట్ చేసి ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలకు బీజేపీ అంటే భయం పట్టుకుందని, అందుకే అసత్య ప్రచారాలతో ప్రజలను గందరగోళం లోకి నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

దేశాన్ని సుదీర్ఘకాలం ఏలిన కాంగ్రెస్ఏనాడు అంబేద్కర్ గొప్పతనాన్నిప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయలేదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించిన ఘనత ఆ పార్టీకే దక్కుతుందని అన్నారు. అటు రాజ్యాంగానికి, ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటుండగా, గ్యారంటీల అమలుపై చర్చ అంటే ఇంటర్వ్యూకు రానని ముఖ్యమంత్రి చెపుతున్నారని అన్నారు.

కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే తెలియదని, ఆయన తన జీవితంలో సమాజంలోని ఏ వర్గ ప్రయోజనం కోసం ఆందోళన చేసిన దాఖలాలు లేవన్నారు. ఇక నిత్యం తనపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ మంత్రి భాషా చూసి ఆ పార్టీ నేతలే భయపడి పారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు.

Exit mobile version