6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుంటా: బండి సంజయ్

రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు.

  • Publish Date - April 27, 2024 / 03:19 PM IST

డేట్, టైం, వేదిక మీరే నిర్ణయించండి
నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులంతా పోటీ నుండి తప్పుకుంటారా?
కేసీఆర్.. అన్య మతస్తుల ముందు అక్షింతలు, ప్రసాదాన్ని హేళన చేస్తావా?
హిందుగాళ్లు..బొందుగాళ్లంటే నీ పార్టీని బొందపెట్టిన చరిత్ర కరీంనగర్ ప్రజలది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డ బండి సంజయ్
సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు

విధాత బ్యూరో, కరీంనగర్: రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు రెండు పార్టీల నేతల డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నరు.

నేను మీకు సవాల్ చేస్తున్నా. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే నేను ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటా. అవసరమైతే కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమే. నిరూపించకపోతే కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుండి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి తేదీ, సమయం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.

శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్ తోపాటు తెలంగాణ ఉద్యమకారులు కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, వాసాల రమేశ్ లతో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.

దేశంలోని అన్ని మతాలు, వర్గాలను సమానంగా చూడాలన్నదే బీజేపీ విధానమని, అయితే బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు . ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాలను కించపరుస్తారా? వీళ్లసలు హిందువులేనా?… అని ప్రశ్నించారు. అయోధ్య అక్షింతలను కించపరచడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని, ఒకాయన రాములవారి అక్షింతలను రేషన్ బియ్యం అంటారు.. ‘అక్షింతలు, తీర్ధ ప్రసాదాలు పంచితే కడుపు నిండుతదా? కరెంట్, నీళ్లు వస్తయా? అని కెసిఆర్ అంటున్నారని విమర్శించారు.

గతంలో హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటే కరీంనగర్ ప్రజలు మీ పార్టీని బొందపెట్టారు.. నీ కొడుకు దేవుళ్లను కించపర్చేలా మాట్లాడితే.. ఆయన అహంకారాన్ని దించి గుడి మెట్ల ముందు మోకరిల్లేలా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొలిటికల్ డ్రామాలాడుతున్నరని, ఒకాయన పంద్రాగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని అంటుంటే… ఇంకోకాయన సాధ్యం కాదంటూ… రాజీనామా పేరుతో 6 గ్యారంటీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నరని చెప్పారు. నామినేషన్ల ఉప సంహరణకు ఎల్లుండి చివరి తేదీ. ఆలోపు 6 గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే తాను పోటీ నుండి తప్పుకుంటానని సంజయ్ తెలిపారు.

Latest News