- ఎమ్మెల్సీ కవిత పై చేసిన వ్యాఖ్యలు అనుచితం
- మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎమ్మెల్సీ(MLC) కల్వకుంట్ల కవిత(Kavitha) పట్ల బీజేపీ(BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) అన్నారు. చీప్ విప్ వినయ్ భాస్కర్(Vinay Bhaskar), ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నరేందర్‌తో కలిసి హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను లక్ష్యంగా ఈడి సీబీఐలను ఉసిగొల్పుతున్నారని వారి తాటాకు చప్పుళ్లకు ఎవరు బయపడరని అన్నారు.
మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్సీ కవిత పట్ల బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను వారు ఖండించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు చూస్తూ ఊరుకోరని, తగిన విధంగా బుద్ది చెప్తారని తీవ్రంగా హెచ్చరించారు. సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బేషరతుగా ఎమ్మెల్సీ కవితకు, తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.