విధాత:భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. జంటనగరాల్లో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని ఏ వీధిలో చూసినా బోనాల సందడే కనిపిస్తోంది.వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి.అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారన బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలివస్తున్నారు.బోనాలు తీసుకువచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.అలాగే అమ్మవారి ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ, రేపు ట్రాఫిక్ నగరంలో ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.ఆదివారం అర్ధరాత్రి జరిగిన బలిగంప పూజతో సింహవాహిని అమ్మవారి జాతర ప్రారంభమైంది. భక్తులు తెల్లవారుజామున అభిషేకం నిర్వహించగా.. అలంకరణ అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో సోమవారం రంగంతో పాటు అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి.