రాజీనామా సవాళ్లతో ఒరిగేదేంటి?

లోకసభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానంగా ఆగస్టు 15 లోగా ఒకేసారి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు హామీ ఇస్తున్నారు.

  • Publish Date - April 24, 2024 / 04:33 PM IST

పక్కకు పోతున్న అసలు సమస్యలు
అంశాలపైనే దేశంలో తొలి విడత పోలింగ్‌
మే 13న తెలంగాణలో లోక్‌సభ ఓటింగ్‌
వాడివేడిగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

(విధాత ప్రత్యేకం)

ఆగస్ట్‌ 15లోగా రైతుల రుణాలు మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆరెస్‌ నేత హరీశ్‌రావు సవాలు విసిరారు. దీనికి దీటుగా స్పందించిన రేవంత్‌రెడ్డి.. చెప్పినట్టు రుణమాఫీ చేస్తే బీఆరెస్‌ను రద్దు చేసుకుంటారా? అని ప్రతిసవాలు విసిరారు! దీనికి హరీశ్‌రావు.. రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ ఎన్నికల్లో పోటీచేయబోనని మరో సవాలు విసిరారు. దీనికి ఒక మెలిక పెట్టిన హరీశ్‌రావు.. తాను అమరువీరుల స్థూపం వద్దకు వస్తానని, అక్కడకు రేవంత్‌ వచ్చి ప్రమాణం చేయాలని షరతు విధించారు.

మరోవైపు బీఆరెస్ 8 నుంచి 12సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాలు విసిరారు. తానేమీ తక్కువ తినలేదంటూ బండి సంజయ్‌ ముందుకొచ్చారు. బీఆరెస్‌ నేత వినోద్‌కుమార్‌ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. లోక్‌సభ ఎన్నికల వేళ సమస్యలపై చర్చ జరగాల్సి ఉంటే.. ఈ రాజీనామాల సవాళ్లేంటని జనం విస్తుబోతున్నారు.

సమస్యల ఆధారంగానే తొలి విడత పోలింగ్‌

ఈ నెల 19న దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ సరళిని గమనిస్తే ప్రజలు సమస్యల ఆధారంగానే తమ తీర్పును ఇవ్వబోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో మే 13న 17 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్‌ జరగనున్నది. పోలింగ్‌కు ఇంకా 18 రోజుల సమయం మాత్రమే ఉన్నది. నిజంగా ప్రజలు ఏం కోరుతున్నారు? రైతాంగం ఏమి ఆశిస్తున్నది? నిరుద్యోగులు దేని కోసం ఎదురుచూస్తున్నారు? పెరిగిన నిత్యావసర వస్తువుల ధర పెరుగుదలతో ఆ భారాన్ని మోయలేక పేద, మధ్య తరగతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రాయితీలు ఆశిస్తున్నది? అన్నది చర్చకు పెడితే బాగుంటుంది.

ప్రజల ఆశిస్తున్న విధంగా తమకు అవకాశం ఇస్తే వాటిని నెరవేర్చడానికి కృషి చేస్తామని చెప్తే మంచిగా ఉంటంది. అంతేగానీ ఐదేళ్ల కాలానికి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇట్లా చీటికిమాటికి రాజీనామా చేస్తామని సవాళ్లు విసురుకోవడం సరిగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీనామా అన్నది అంతిమ అస్త్రంగా ఉండాలి. అంతేగాని ప్రతీ అంశాన్ని రాజీనామాతో ముడిపెట్టి మాట్లాడటం అంటే సమస్యలను పక్కదోవ పట్టించడం లేదా పారిపోవడంగానే భావించాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నారు.

ఇప్పుడు జరుగుతున్నది లోక్‌సభ ఎన్నికలు. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలనుకుంటున్నారో ప్రజలు ఇవ్వబోయే తీర్పు. రేపు కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేస్తే ప్రజా సమస్యలు అనేకం పరిష్కారానికి నోచుకుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీలకే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రెండుపార్టీల ప్రజాప్రతినిధులు అధికారంలోకి ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్లమెంటులో ప్రజల పక్షాన తమ గొంతును వినిపించాలి.

బీఆర్‌ఎస్‌ చెబుతున్నట్టు కేంద్రంలో ఈసారి ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకం అవుతుందని భావిస్తే వాళ్లకూ రాష్ట్ర ప్రయోజనాలు, హక్కుల సాధన కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. ఇట్లా అన్ని పార్టీలకు ప్రజల పక్షాన మాట్లాడడానికి, పోరాడటానికి, వాళ్ల సమస్యలు పరిష్కరించడానికి చట్టసభలు వేదిక కావాలి. అంతేగానీ అసలు విషయాలు వదిలిపెట్టి రాజీనామాల చుట్టే రాజకీయాలు నడుపటం, దానిపైనే ప్రధాన పార్టీల్లోని కీలక నేతలు సవాళ్లు విసురుకోవడం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Latest News