Site icon vidhaatha

Shakeel | నా కొడుకును జైల్లో పెట్టేందుకు కుట్ర: మాజీ ఎమ్మెల్యే షకీల్

ఏం జరిగినా మీదే బాధ్యత

విధాత: నాపై రాజకీయ కక్షతో నా కొడుకును జైల్లో పెట్టేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా కుట్ర చేస్తుందని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. బుధవారం దుబాయ్ నుంచి ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. నా కొడుకును జైల్లో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ కుట్రతోనే కారు ప్రమాదం కేసులో నా కొడుకును ఇరికించారని మండిపడ్డారు. తాను ప్రస్తుతం దుబాయ్ ఉండి చికిత్స తీసుకుంటున్నానని చెప్పారు. రాజకీయంగా మనం మనం చూసుకుందాం.. కానీ ఇందులోకి పిల్లలను లాగొద్దని.. వారిని ఇబ్బంది పెట్టొద్దు అని కోరారు.

నా కుమారుడికి ఏం జరిగినా పోలీసు ఉన్నతాధికారులదే బాధ్యత అన్నారు. తనకు తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ దేశారు. తప్పు చేశాడని తేలితే దేనికైనా సిద్ధమే అన్నారు. కేసుపై న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. పంజాగుట్టలో బారికేడ్‌లను ఢీ కొట్టిన కేసులో 21ఏండ్ల నా కొడుకు రాహిల్‌పై అనవసరంగా 21కేసులు పెట్టారని, దుబాయ్‌లో ఉన్న నాపై కూడా కేసు పెట్టారన్నారు.

నాపై రాజకీయ కక్షతో పిల్లలను టార్గెట్ చేసి, విచారణలో నేరం చేయకపోయినా చేసినట్లుగా ఒప్పుకోవాలని లేదంటే ఎన్‌కౌంటర్ చేస్తామంటు బెదిరించారని ఆరోపించారు. ఈ కేసులో న్యాయస్థానం బెయిల్ ఇచ్చిందన్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్, అక్కడి పోలీస్ అధికారులు వ్యక్తిగత ఆసక్తితో టార్గెట్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో నా కొడుకును నిందితుడిగా చూపిస్తూ కొత్తగా కేసులు పెట్టారని, కేసులో ఉన్న వారిని రాహిల్ కారు నడిపినట్లుగా చెప్పమంటూ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. విద్యార్థిగా ఉన్న తన కొడుకు భవిష్యత్తును రాజకీయ కక్షలకు బలిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా.. తాను పదేళ్లు ప్రజాసేవలో ఎమ్మెల్యేగా పనిచేశానని, కేసుల పేరుతో తన ఇంటిపై అనధికారంగా రైడ్‌లు కూడా చేసి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని, మత ప్రాతిపదికన కూడా పోలీస్ అధికారులు మమ్మల్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట కేసుల్లో ఇప్పుడు తన కొడుకు రాహీల్ ప్రమేమం ఉందంటున్న పోలీసు అధికారులు..ఇవే కేసుల్లో అంతకుముందు రాహీల్ నిందితుడు కాదని తేల్చిన అధికారులు తప్పు చేసినట్లేనని భావిస్తున్నారా అలాంటప్పుడు వారిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు.

Exit mobile version