Site icon vidhaatha

KTR : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

KTR

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సోమవారం నాడు తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నోటా లేనందున ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు మంచివారేనని అన్నారు. ఒకరు బీజేపీ కూటమి, మరొకరు కాంగ్రెస్ కూటమి నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ రెండు పార్టీలు తెలంగాణ రైతులను వేధింపులకు గురి చేశాయని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో యూరియా లభించక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రూ.1100 కోట్ల ఖర్చుతో కొండపోచమ్మసాగర్ మూసీకి నీరు తెచ్చేలా2023 మే 17న కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కొండపోచమ్మ నుంచి గండిపేటకు గ్రావిటీ ద్వారా నీరు వస్తోందని ఆయన తెలిపారు. రూ.1100 కోట్లతో అయ్యే పనులను మల్లన్నసాగర్ కు మార్చి అంచనాలను ఏడు రెట్లు పెంచారని ఆయన ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడే గోదావరి జలాలను మూసీకి తరలించే స్కీమ్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేసిందని ఆయన అన్నారు.కాళేశ్వరం కూలిపోయిందని చెబుతూ గోదావరి జలాలను ఎలా తరలిస్తారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగిందని లెక్కలు చెబుతున్నాయన్నారు.బనకచర్లకు నీరు వెళ్లాలనే ఉద్దేశంతోనే మేడిగడ్డను పక్కన పెట్టారని ఆయన విమర్శించారు.

Exit mobile version