Harish Rao | ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ విఫలం: హరీశ్‌రావు

సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ధాన్యం కొనుగోలులో ఘోరంగా విఫలమైందని, ఫలితంగా రైతులు నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడాల్సిన ధైన్యస్థితి నెలకొందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.

  • Publish Date - May 23, 2024 / 01:53 PM IST

నెల రోజులైనా కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు
మాజీ మంత్రి టి.హరీశ్‌రావు

విధాత: సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ధాన్యం కొనుగోలులో ఘోరంగా విఫలమైందని, ఫలితంగా రైతులు నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడాల్సిన ధైన్యస్థితి నెలకొందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు సకాలంలో చేయకుండా, సకాలంలో రైతుబంధు ఇవ్వకుండా, సన్నలకే బోనస్ అంటూ వరి రైతుల గుండెలపై రేవంత్ సర్కార్ తన్నిందని ఫైర్ అయ్యారు.

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతున్నదని, కాని ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయ్ చేతలు.. చేతులు గడపదాటడం లేదన్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో ఇక్కడ రమేశ్‌, లక్ష్మారెడ్డి అనే రైతుల ధాన్యం నెల రోజుల కిందట పూడూరు వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉండిపోయిందని రాత్రి వర్షంపడడంతో సంచులన్నీ తడిసిపోయాయని, చాలామంది రైతుల కుప్పలు తడిసి ధాన్యం మొలకలు వస్తున్నాయని, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్రమైన నష్టం వారికి వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని తీసుకోని పరిస్థితి ఉందని, చాలామంది రైతులు ఇంత ఓపికలేక రూ.100-రూ.200 తక్కువ ధరకు మధ్య దళారులకు, మిల్లర్లకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా బాండు పేపర్లపై రాసి ఇచ్చి.. రైతుల సెల్‌ఫోన్లకు మెస్సేజ్‌లు పంపి నమ్మకబలికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెలపై తన్ని మోసం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రైతుబంధును రూ.7500కు పెంచుతామని చెప్పి మోసం చేశారని, వంద రోజుల్లో వడ్లకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారని, వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని మోసగించారని, వంద రోజుల్లో రూ.2లక్షల రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు ఇస్తామని మోసగించారని, రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కటీ కాంగ్రెస్‌ నెరవేర్చలేదన్నారు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం యాసంగిలో 67లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవాళ్టికి 37లక్షలు కూడా దాటలేదని ఆరోపించారు.

Latest News