హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్‌ను ఓడించాలి

  • Publish Date - April 3, 2024 / 04:30 PM IST

విధాత, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 2లక్షల రుణమాఫీ, ధాన్యానికి బోనస్‌, ఆడబిడ్డలకు 2,500, వృద్ధులకు 4వేల పెన్షన్ 15వేల రైతుభరోసాను అమలు చేయకుండా ఎన్నికల కోడ్ సాకుతో మోసం చేసిన కాంగ్రెస్‌ను పార్లమెంటులో ఓడించి బుద్ధి చెప్పాలని బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బుధవారం భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆచరణ సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికలను వారి పాలనకు రెఫరెండమ్ అంటుందని, అందుకే హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌ను ఓడించే తీర్పునివ్వాలని బీఆరెస్ శ్రేణులు ప్రజలకు అవగాహాన కల్పించాలని సూచించారు. తులం బంగారం, 4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థులకు 5 లక్షల బ్యాంకు కార్డు వంటి హామీలను అమలు చేయలేదన్నారు.

కాంగ్రెస్ అంటేనే లీకులు, ఫెక్ న్యూస్‌లని, పాలన గాలికొదిలేసి అక్రమ కేస్ లతో కాలయాపన చేస్తున్నారని, చేరికల రాజకీయాలతో మునిగితేలుతు రాష్ట్ర రైతాంగం ప్రజలు ఎదుర్కోంటున్న సాగుతాగునీటి కష్టాలను పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఎప్పుడైతే రైతుల కోసం బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బయటకొచ్చి రొడ్డెక్కారో ఆ వెంటనే కాల్వల్లో నీళ్లు పారుతున్నాయని, అందుకే కేసీఆర్ ఒక్కరే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెబుతున్నామన్నారు.

కొంత మంది స్వార్ధపరులు పార్టీని వీడి పోతున్నారని, వాళ్ళను ప్రజలు నమ్మడం లేదన్నారు. దానం నాగేందర్, కడియం కావ్య, రంజిత్ రెడ్డి, పట్నం సునీతలు పార్టీ మారడాన్ని ప్రజలు హర్షించడం లేదన్నారు. ఎన్నికల్లో వారికి మూడవ స్థానమేనన్నారు. కొంత మంది పార్టీ విడి పోతే ఎం నష్టం లేదని, పార్టీ వదిలి పోయిన వారు కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా మళ్ళీ వారిని పార్టీలో చేర్చుకోమని, ఈ భూమి ఉన్నంత కాలం బీఆరెస్ ఉంటుందన్నారు.

ఓడిస్తేనే హామీల అమలవుతాయి

కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని, మళ్లీ కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ప్రజలను మోసం చేసినా తమకే ఓటేశారని ప్రచారం చేసుకుంటారని, అప్పుడు మేం అసెంబ్లీలో ప్రశ్నించడానికి వీలుండదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పేగులు మెడలో వేసుకంటానని అంటున్నాడని, ఆయనేమన్నా రాక్షసుడా? మానవీయ పాలన అందించాలి తప్ప ఇవేం మాటలన్నారు.

బీజేపీ కూడా ఒక్క హామీని కూడా నిలెబెట్టుకోలేదని, గ్యాస్, పెట్రోల్ ధరలను భారీగా పెంచింది నల్లధనం తేలేదని, 2 కోట్ల ఉద్యోగాలివ్వలేదని, నల్ల చట్టాలు తెచ్చి రైతులను చంపిన పార్టీ బీజేపీయేనని హరీశ్‌రావు విమర్శించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం తప్ప, ప్రజలకు చేసిన మేలేంటో బీజేపీ చెప్పాలన్నారు. ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆరెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

తెలంగాణ ప్రయోజనాల పనిచేసే ఏకైక పార్టీ బీఆరెస్ మాత్రమేనని, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి గతంలో రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి బహిష్కరింపబడిన వ్యక్తి అని, అతనితో జాగ్రత్తగా ఉండాలన్నారు. భువనగిరిలో బీఆరెస్ అభ్యర్థి బీసీ బిడ్డ క్యామ మల్లేష్ ప్రజాబలమున్న నాయకుడని, పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రశ్నించేందుకు ఆయనను గెలిపించాలని ప్రజలకు బీఆరెస్ శ్రేణులు వివరించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, స్థానిక మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునితమహేందర్‌రెడ్డి, గాదరి కిషోర్‌, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆరెస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. .

Latest News