బీఆర్ఎస్ కు చిక్కు లెక్కగా మారిన వరంగల్

మబ్బులో నీళ్ళు చూసి కుండలో నీళ్ళు ఒలకబోసుకున్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు బారులు తీరిన అభ్యర్ధులు చేజారడంతో ముఖ్యనేతల పరిస్థితి అయోమయంగా మారింది

  • Publish Date - April 7, 2024 / 03:47 AM IST

ఒకనాడు గులాబీకి తిరుగులేని స్థానం

టికెట్‌ దొరికితే గెలుపుపై గ్యారెంటీ

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో సీన్‌ రివర్స్‌

‘చేతి’కి చిక్కిన బీఆరెస్ ముఖ్య నేతలు

ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం వెతుకులాట

రాజయ్య, జోరిక రమేష్, బోడ డిన్న, పెద్ది స్వప్న..

పరిశీలనలో ఈ నలుగురు నాయకుల పేర్లు

వరంగల్ ఎంపీ పరిధిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే

ఈ సెగ్మెంట్లలో బీఆరెస్‌ బలం తక్కువేమీ కాదు

విధాత ప్రత్యేక ప్రతినిధి: మబ్బులో నీళ్ళు చూసి కుండలో నీళ్ళు ఒలకబోసుకున్నట్లుగా బీఆరెస్‌ పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు బారులు తీరిన అభ్యర్థులు ‘చే’జారడంతో ముఖ్య నేతల పరిస్థితి అయోమయంగా మారింది. ఉద్యమకాలంలో బీఆరెస్‌కు అన్ని రకాలుగా వెన్నుదన్నుగా నిలిచిన వరంగల్‌లో ఈ దుస్థితి రావడం కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. నిన్నటి వరకు నమ్మకస్థులనుకున్న బీఆరెస్‌ నేతలు రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీ పెద్దలు ఇప్పుడు వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కోసం అపసోపాలు పడుతున్నారు. అభ్యర్థిత్వం కోసం క్యూలైన్ కట్టిన పరిస్థితి నుంచి సమర్ధనాయకుడిని వెతికేందుకు సతమతమవుతోంది. ఎంపీ క్యాండిడేట్ కోసం వివిధ పద్ధతుల్లో వడపోత ప్రారంభమైంది. అధిష్ఠానం అంతర్గతంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.

చేతికి చిక్కిన నేతలు

బీఆరెస్‌లో మంచి స్థానం, పార్టీ పేరు మీద పోటీ చేస్తే చాలు వందశాతం విజయం సాధిస్తుందనే భరోసా కల్పించిన స్థానం వరంగల్. దీని కోసం పెద్ద సంఖ్యలో నాయకులు పోటీపడేవారు. ఇప్పుడు ఇదంతా గతం. అనేక రకాల చర్చోపచర్చలు, లెక్కల అనంతరం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కావ్యను ఎంపిక చేశారు. దీనికి ముందు పెద్ద ఎపిసోడ్ నడిచిన విషయం తెలిసిందే. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్‌కు ఈసారి టికెట్ నిరాకరిస్తున్నారనే చర్చ తొలి నుంచి సాగింది. ఈ క్రమంలో పసునూరి స్థానంలో వర్ధన్నపేట ఎమ్మేల్యేగా మొన్నటి ఎన్నికల్లో ఓటమిపాలైన అరూరి రమేశ్‌ టికెట్ ఆశిస్తున్నారనే వార్తలు వెలువడ్డాయి. అరూరి పట్టువదలని విక్రమార్కునిలా బీఆరెస్‌ ముఖ్య నేతలను కలిసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో అరూరి బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసేందుకు అంతర్గతంగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. బీజేపీలో చేరికకు లైన్ క్లియర్ చేసుకున్న తర్వాత ఆయన అమిత్ షాను కలిసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. కిషన్ రెడ్డితో మంతనాలు చేశారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ప్రేక్షపాత్ర వహించిన బీఆరెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగి మీడియా సమావేశానికి కొద్ది క్షణాల ముందు అరూరిని బలవంతంగా హైదరాబాద్ తరలించింది. ఆ ఉదంతం రాద్ధాంతంగా మారిన విషయం తెలిసిందే. అదే రోజు వరంగల్ జిల్లా ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకున్న బీఆరెస్‌ అధినేత అరూరితో సైతం మాట్లాడారు. అనూహ్యంగా పసునూరి, ఆరూరి, ఇతర ఆశావహులను కాదని కడియం కావ్యకు చాన్స్‌ ఇచ్చారు. ప్రకటించే మేరకు బాగానే అనిపించినా ఆ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. సిట్టింగ్ ఎంపీని కాదనడమే కాకుండా కనీసం తన అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదంటూ కాంగ్రెస్‌లో టికెట్ వస్తుందనే ఆశతో పసునూరి వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీఆరెస్‌ టికెట్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన అరూరి రమేశ్‌ రెండు రోజుల్లోనే బీజేపీలో చేరిపోయారు. మరో రెండు రోజుల్లోనే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన కడియం కావ్య తాను పోటీ నుంచి విరమించుకున్నట్లు సంచలనానికి తెరతీశారు. పైగా లేఖ పేరుతో బీఆరెస్‌పై తీవ్ర ఆరోపణలు సంధించారు. రెండు రోజుల్లోనే కావ్య తన తండ్రి కడియంతో కలిసి కాంగ్రెస్‌లో చేరిపోయి షాకిచ్చారు. దీంతో బీఆరెస్‌ అభ్యర్థి ఎంపిక మొదటికొచ్చింది.

బీఆరెస్‌ అధిష్ఠానానికి అగ్నిపరీక్ష

మారిన పరిస్థితుల్లో బీఆరెస్‌ అధిష్ఠానానికి వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపిక కత్తిమీద సాముగా మారింది. నిన్నటి వరకు అధినేత కేసీఆర్ ఎవరి పేరు చెబితే వారే అభ్యర్థి అన్నట్లుగా పార్టీలో పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి. అభ్యర్థులు అనుకున్న నేతలు పసునూరి, అరూరి, కడియం కుటుంబం పార్టీ మార్చేశారు. దీంతో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఇప్పుడు అధిష్ఠానం నిర్ణయించే అభ్యర్థి అందరికీ ఆమోదం కాకుంటే ఆశావహులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. భిన్నాభిప్రాయాన్ని, వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా నలుగురైదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీని వీడిన డాక్టర్ రాజయ్య, తెలంగాణ ఉద్యమకారుడు కేయూ జేఏసీ నేత జోరిక రమేష్, మాజీ కార్పొరేటర్ బోడ డిన్నలు టికెట్ కోరుతున్నారు. వీరిద్దరికీ తోడు తాజాగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య పెద్ది స్వప్న పేరు తెరపైకి వచ్చింది. ఉద్యమనాయకురాలిగా, ప్రస్తుతం వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న స్వప్నకు విద్యావంతురాలిగా పేరున్నది. కడియం కావ్య పార్టీకి షాకిచ్చినందున ఆ స్థానంలో స్వప్న పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. స్వప్న మానుకోట ఎంపీ పరిధిలోని నేతగా ఉన్నారు. ఆమెకు అవకాశం ఇస్తారనే ప్రచారం బాగాసాగుతోంది. తెలంగాణ ఉద్యమకాలంలో విద్యార్థి నాయకునిగా ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ అయితే అందరికీ ఆమోదయోగ్యునిగా ఉంటారనే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. ఉద్యమకారునికి టికెట్ ఇస్తే కావ్యకు, కడియం శ్రీహరికి పరోక్షంగా చెక్ పెట్టొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరిగి తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు టికెట్ నిరాకరించారనే కోపంతో బీఆరెస్‌కు రాజీనామా చేసిన డాక్టర్ రాజయ్య పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కడియం కుటుంబానికి వ్యతిరేకంగా రాజయ్య అయితే ఎలా ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజయ్య కాంగ్రెస్‌లో చేరిక ఆగిపోయినందున తిరిగి బీఆరెస్‌లో చేరడం తన రాజకీయ భవిష్యత్తు రీత్యా అసాధ్యమేమీ కాకపోవచ్చు. అయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అంగీకరిస్తుందా? లేదా? అనేదే ప్రశ్న. మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా కూడా తనదైన పద్ధతిలో టికెట్ కోసం యత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నలుగురితో పాటు బలమైన అభ్యర్థి కోసం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మారిన లెక్కల ప్రకారం కడియం శ్రీహరితో కలిపితే వరంగల్ ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటం ఆ పార్టీకి సానూకూల అంశంగా భావిస్తున్నారు. అయితే ఈ సెగ్మెంట్లలో బీఆరెస్‌ బలం కూడా అంత తక్కువేమీ కాదనే విషయం గమనార్హం.

Latest News