సంపూర్ణ రుణమాఫీ కోసం జైల్‌భరోకు వెనుకాడం
అక్రమ కేసులతో రైతులను భయపెడుతుంది
మాపై బజార్ భాష విమర్శలతో సమస్యను డైవర్ట్ చేస్తుంది
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
దగా పడ్డ రైతుల తరుపునా దండు కడుతాం.. దగా కోరు సర్కార్‌ను వెంటాడుతాం
రైతుల తరుపునా రణం చేస్తాం
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నా పేరునా ఏ ఫామ్ హౌజ్ లేదు..ఆక్రమమైతే దగ్గరుండి కూల్చేయిస్తా
KTR | సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం (CM Revanth Reddy Govt) చేపట్టిన రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) పచ్చి మోసం..దగా..బూటకమని కేటీఆర్ విమర్శించారు. జరిగింది మాఫీ కాదని…పెట్టింది రైతుకు టోపీ అని, రవ్వంత రుణమాఫీ చేసి కొండంతా ప్రచారం చేసుకున్నారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో బుధవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రుణమాఫీపై ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ, సంపూర్ణంగా రైతులందరికి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గం, మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ధర్నాలు నిర్వహించబోతున్నామన్నారు. నేను, సబితా ఇంద్రారెడ్డి చేవెళ్లలో రైతు ఆందోళనలో పాల్గొంటామని కేటీఆర్ తెలిపారు. రుణమాఫీపై మా పోరాటం మొదటి అడుగేనన్నారు. దగా పడ్డ రైతుల తరుపునా దండు కడుతామని.. దగా కోరు సర్కార్‌ను వదిలపెట్టమని స్పష్టం చేశారు. అవసరమైతే భవిష్యత్తులో జైల్‌భరో కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతు డిక్లరేషన్ (Rythu Declaration) లని పోజులు కొట్టి ఇప్పుడు కేసులు పడితే సహించేది లేదన్నారు. మాయ మాటల ఫ్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుందన్నారు. డెడ్‌లైన్‌లు మార్చి హెడ్‌లైన్‌లు మేనేజ్ చేస్తూ మమ్మల్ని డైవర్ట చేద్దామనుకుంటే మేం డైవర్ట్ కామన్నారు. రుణమాఫీపై రైతుల ఆందోళన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ (KCR)పైన, నాపైన బజారు భాషలో విమర్శలు చేయడం సీఎం రేవంత్‌రెడ్డి అలవాటుగా పెట్టుకున్నాడన్నారు. అందుకే రాజీవ్ జయంతి రోజున కేసీఆర్‌పైన, నాపైన బజారు భాషతో మాట్లాడటం జరిగిందన్నారు. అయినా మేం మాత్రం డైవర్ట్ కాబోమని, రైతుల తరుపునా రణం చేస్తామన్నారు. అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వెంటాడుతాం..వేటాడుతామన్నారు. గారడీలతో రైతులను మోసం చేస్తే బీఆరెస్ ఊరుకోదన్నారు. ఏ ఆంక్షలు లేకుండా రుణమాఫీ ఎప్పటిలోగా చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం జరిగే రైతు ధర్నాలతో పాటు సీఎం రేంవత్ రెడ్డి తెలంగాణ తల్లి (Telangana Talli) విగ్రహాంపై బజారు భాషాతో చేసిన విమర్శలను నిరసిస్తూ తెలంగాణ తల్లి విగ్రహాలకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చామని, ఈ మూర్ఖుడు రేవంత్‌రెడ్డిని క్షమించాలని ఆ తల్లిని కోరుతామన్నారు.
సీఎం, మంత్రుల నిజస్వరూపం 70లక్షల మంది రైతులు సాక్షిగా బహిర్గతం
రుణమాఫీపై సీఎం, మంత్రుల అబద్ధాలతో 70లక్షల మంది రైతుల సాక్షులుగా వారి నిజస్వరూపం బయటపడిందని కేటీఆర్ అన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు 2లక్షల రుణం మాఫీ చేశామని చెప్పగా, క్షేత్ర స్థాయిలో రైతులు తమకు రుణమాఫీ జరుగలేదని స్వచ్చందంగా రాజకీయ పార్టీల ప్రమేమం లేకుండా ఆందోళనలు చేస్తున్నారన్నారు. రైతుల రుణమాఫీ చేయలేదంటూ నిరసన వ్యక్తం చేసిన తలమడుగు, హత్పూర్ వంటి చోట్ల రైతులపై ఏడు సంవత్సరాలు శిక్ష పడేలా కేసులు పెట్టారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్‌లో 49వేలకోట్ల వ్యవసాయ రుణాలున్నాయని చెప్పగా, జనవరిలో నేను కడుపుకుంటే 40వేల కోట్ల రుణమాఫీ అవుతుందన్నారన్నారు. కేబినెట్‌లో 31వేల కోట్ల రుణమాఫీ అని చెప్పారని, బడ్జెట్‌లో 26వేల కోట్లు అని చెప్పారని, ఆగస్టు 15వ తేదీని 17,934కోట్లుగా చెప్పారని, ఇప్పుడు 7,500 మొత్తం రుణమాఫీ చేశామని పాలాభిషేకాలు చేసుకోమని చెబుతున్నాడన్నారు. మంత్రి తుమ్మల 2లక్షల రుణమాఫీ పూర్తి అయ్యిందని చెబుతాడన్నారు. డిప్యూటీ సీఎం భట్టి లెక్కలు చూస్తే రుణమాఫీ వట్టిదేనని తేలిపోతుందని బ్యాంకర్ల సమావేశంలో ఆయన 7,500కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడినాయని చెప్పారని పేర్కోన్నారు. పొంగులేటి 12వేల కోట్లు ఇంకా ఇవ్వాల్సివుందన్నాడని గుర్తు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాంకేతిక కారణాల వల్ల ఇంకొంతమందికి రుణమాఫీ పెండింగ్‌లో ఉందన్నారన్నారు.
మంత్రివర్గ సహచరులే రుణమాఫీ కాలేదంటున్నారు
సీఎం, మంత్రుల మాటలు చూస్తే రుణమాఫీ సగం కూడా కాలేదని, మోసం మాత్రం సంపూర్ణంగా జరిగిపోయిందని కేటీఆర్ అన్నారు. మంత్రివర్గ సహచరులే రుణమాఫీ కాలేదని చెబుతున్నారన్నారని తెలిపారు. 17లక్షల 14మంది రుణమాఫీ కాలేదని మంత్రులు చెబుతుంటే , 30లక్షల మందికి కాలేదని రైతులు చెబుతున్నారని పేర్కోన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోని కొడంగల్‌లో కొస్గి ఉమ్మడి మండలంలో ఐదు బ్యాంకుల్లో 20,239మంది ఖాతాలుంటే మూడు విడతల్లో 8,527మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని వెల్లడించారు. రేషన్ కార్డు మేరకు ఒకరికే రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని పనికిరాని ఆంక్షలు పెట్టిందన్నారు. రుణమాఫీకే అనేక ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం రైతుభరోసాకు ఇంకెన్ని ఆంక్షలు పెడుతాడోనని ఆందోళన వ్యక్తం చేశారు. 70లక్షల మంది రైతులను మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేశాడని, వందశాతం రుణమాఫీ జరిగితే ఎందుకు ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఎన్‌సీఆర్‌బీ డేటా మేరకు దేశంలో తెలంగాణలో ఆత్మహత్యలు తగ్గేలా కేసీఆర్ ప్రభుత్వం పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వ్యవసాయ స్థిరీకరణ చేసే క్రమంలో రైతులు ఉద్యోగులా ఐటీ చెల్లింపుదారులా అని మేం చూడలేదన్నారు. అందుకే వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉన్నామన్నారు. రుణమాఫీతో రైతు స్వరాజ్యం రాలేదని, రైతును మోసం చేస్తున్న రాజ్యం కొనసాగుతుంది విమర్శించారు.
నాకు ఏ ఫామ్ హౌజ్ లేదు..
నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదని, నా మిత్రుడు ఒకాయనకు ఫామ్ హౌజ్ (Farm house) ఉంటే నేను లీజుకు తీసుకున్నానని, ఒకవేళ అది ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే నేనే నా మిత్రుడికి చెప్పి దాన్ని దగ్గరుండి కూలగొట్టిస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. తప్పుంటే కూలగొడితే నష్టమేమి లేదన్నారు. నేరుగా నాతో పాటు రావాలని, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో కట్టిన భవనాలను నేను మీకు చూపిస్తానని వాటిని కూడా కూల్చివేయాలన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్‌రెడ్డి, గడ్డం వివేక్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మధుయాష్కి, సీఎం రేవంత్‌రెడ్డి కట్టడాలు ఉన్నాయన్నారు. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదన్నారు. నా అఫిడవిట్ పబ్లిక్ డాక్యుమెంట్ అని, దాచిపేట్టేది ఏమి లేదన్నారు. తప్పు ఎవరు చేసినా దేనిపైనయినా చర్యలు తీసుకోవచ్చనని కేటీఆర్ స్పష్టం చేశారు.