Site icon vidhaatha

KTR | అసత్యాల ప్రచారంలో సీఎం రేవంత్‌పై కేసులేవి?

ట్విటర్‌లో కేటీఆర్‌ ఫైర్‌
ఆర్టీసీ ఫేక్‌ లోగో కేసుల వివక్షతపై నిలదీత

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వం నిజాల‌ను బట్ట‌బ‌య‌లు చేస్తున్న బీఆరెస్‌ నేత‌ల‌పై కేసులు పెడుతున్నారు.. కానీ అధికార పార్టీ నాయ‌కులే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే వారిపై ఎందుకు కేసులు న‌మోదు చేయ‌డం లేద‌ని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు. నా బంధువుకు రూ. 10 వేల కోట్ల కొవిడ్ కాంట్రాక్ట్ వ‌చ్చింద‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారని, స‌చివాల‌యం కింద నిజాం న‌గ‌లు త‌వ్వుకున్న‌ట్లు న‌కిలీ క‌థ అల్లారని, కేంద్ర హోం మంత్రి న‌కిలీ వీడియోను రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేశారని, ఓయూకు చెందిన న‌కిలీ స‌ర్క్యుల‌ర్‌ను సీఎం పోస్టు చేశారని, అలాంటి న‌కిలీ వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న వ్య‌క్తిని జైల్లో ఎందుకు పెట్ట‌రని కేటీఆర్ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని సూటిగా ప్ర‌శ్నించారు.

మరో ట్విట్‌లో టీఎస్ ఆర్టీసీ కొత్త లోగో ఫేక్‌ ప్ర‌చారం విష‌యంలో బీఆరెస్‌ నాయ‌కులు, మ‌ద్ద‌తుదారుల‌పై కేసులు న‌మోదు చేశారని, అదే పనిచేసిన కాంగ్రెస్ అనుబంధ సంస్థలపై ఎందుకు కేసులు పెట్టలేదని డీజీపీ ర‌వి గుప్తాను, ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌ను కేటీఆర్ నిలదీశారు. ఆర్టీసీ కొత్త లోగో అంటూ ముందుగా ప్ర‌చారం చేసిన ఎన్టీవీ, బిగ్ టీవీ చానెల్స్, వెలుగు దిన‌ప‌త్రిక‌పై కేసులు ఎందుకు పెట్ట‌లేద‌ని అడిగారు. రాజ‌కీయ పెద్ద‌ల మాట‌లు విని బీఆరెస్ సంస్థలను వేధిస్తే మిమ్మ‌ల్ని కూడా కోర్టుకు లాగి న్యాయం జరిగేలా చూస్తామని కేటీఆర్ హెచ్చ‌రించారు.

Exit mobile version