ఏమో..! కూటములలో లేని పార్టీలే ఢిల్లీలో చక్రం తిప్పొచ్చు !!

పార్లమెంటు ఎన్నికల అనంతరం కాలం కలిసొస్తే.. ఏదైనా జరగొచ్చని.. ఎన్‌డీఏ, ఇండియా కూటములలో లేని బీఆరెస్‌, బిజు జనతాదళ్‌, వైసీపీ వంటి మొత్తం 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చని, దేశ రాజధానిని శాసించొచ్చని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

  • Publish Date - May 5, 2024 / 03:30 PM IST

యాచించి కాదు…శాసించి సాధిద్దాం
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల అనంతరం కాలం కలిసొస్తే.. ఏదైనా జరగొచ్చని.. ఎన్‌డీఏ, ఇండియా కూటములలో లేని బీఆరెస్‌, బిజు జనతాదళ్‌, వైసీపీ వంటి మొత్తం 13 పార్టీలు ఢిల్లీలో చక్రం తిప్పొచ్చని, దేశ రాజధానిని శాసించొచ్చని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి బీఆరెస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ఆదివారం కుత్బుల్లాపుర్‌ నియోజకవర్గంలోని షాపూర్‌ వద్ద నిర్వహించిన రోడ్‌షోలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్డీఏ, ఇండియా కూటమిలకు మెజార్టీ సీట్లు రాని పక్షంలో కూటమిలో లేని పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తులుగా మారవచ్చన్నారు. ఈ పరిస్థితుల్లో మనం శాసించి ఢిల్లీని లొంగదీసుకుందామా..? యాచించి వాళ్ల వద్దకు పోదామా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. బీఆరెస్‌ను 10-12 సీట్లు గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే పార్టీని శాసించి తెలంగాణ అభివృద్ధికి కావాల్సిన నిధులు, అభివృద్ధి పథకాలు సాధించుకోవచ్చన్నారు.

కేంద్రంలో సంకీర్ణం ఏర్పడితే మద్దతుపై కాంగ్రెస్ కాంగ్రెస్‌ హౌలాగాళ్లు బీఆరెస్‌పైన, కేసీఆర్‌పైన ఏదేదో చెబుతున్నారని, బీఆరెస్‌కు బీజేపీతో పోయే ఖర్మ ఇప్పటి వరకు లేదని, రేపు కూడా ఉండదన్నారు. గెలిచిన తర్వాత కూడా సెక్యులర్‌ పార్టీగా ఉంటామని, మతతత్వ పార్టీలతో కలవబోమన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని, రాహుల్‌గాంధీ స్వయంగా ఉత్తరప్రదేశ్‌ను వదిలి కేరళకు వెళ్లిన పరిస్థితి ఉందన్నారు.

మనందరికి అన్నం పెట్టిన అమ్మలాంటి హైదరాబాద్‌ విశ్వనగరం కావాలనుకుంటే బీఆరెస్‌కు ఓటేయండని కోరారు. మతం పేరిట పంచాయతీలు, కర్ఫ్యూలు, అల్లకల్లోలమైన విషనగరం కావాలనుకుంటే మీ ఇష్టమని, మనందర్ని కడుపున పెట్టుకునే హైదరాబాద్‌ను కాపాడుకోవాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఉద్దేశ్యపూర్వకంగా ముస్లింలను అవమానిస్తున్నారని విమర్శించారు.

10-12 సీట్లు ఇస్తే.. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు కేసీఆర్‌ తిరిగి మీకు సేవ చేస్తాడు పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌కు 10-12 సీట్లు ఇస్తే.. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు కేసీఆర్‌ తిరిగి మీకు సేవ చేస్తాడని కేటీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు బాగుండే.. మళ్లీ ఆ రోజులు రావాలనుకునే వాళ్లంతా కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

రాష్ట్రంలో పాలన పిచ్చోని చేతిలో రాయిలా మారిందని, బూతులు మాట్లాడడం.. కేసీఆర్‌ను తిట్టడం పాలన కాదని రేవంత్‌రెడ్డి గ్రహించాలని కేటీఆర్ చురకలేశారు. ఎన్నికల హామీల మేరకు యువతులకు స్కూటీలు ఇవ్వని కాంగ్రెస్‌ లూటీ ప్రారంభించిందని, పర్మిషన్లు ఇవ్వకుండా సతాయించి బిల్డర్ల దగ్గర గుంజుడు మొదలుపెట్టారని ఆరోపించారు.

ఐదు నెలల్లో ఒక్క పరిశ్రమ తేకపోగా.. మనం కష్టపడి తెచ్చిన పరిశ్రమలూ ఇక్కడి నుంచి వెళ్తుంటే ఆపలేని అసమర్థత రేవంత్ ప్రభుత్వందేనని విమర్శించారు. ఐదు గ్యారంటీలు అమలు చేశామని, సిగ్గు లేకుండా రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నిండా హోర్డింగ్‌లు పెట్టుకున్నాడని విమర్శించారు. మల్కాజిగిరి ఎన్నికల్లో ఓడిపోతే ఒకరు తాండూరు.. ఇంకొకరు హుజురాబాద్‌కు పోతారని, ఇక్కడ ఉండే స్థానిక నాయకుడు లక్ష్మారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Latest News