నేను ఏ హీరోయిన్లను బెదిరించలేదు: కేటీఆర్‌

  • Publish Date - April 3, 2024 / 02:03 PM IST

విధాత, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదని, ట్యాపింగ్ కేసును అడ్డుపెట్టుకుని లీక్ వీరుడు సీఎం రేవంత్‌రెడ్డి నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రించి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని దీనిని తాను న్యాయపరంగా ఎదుర్కోంటానని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వివేకానందతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

ఫోన్ ట్యాపింగ్‌పై నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించే దమ్ము లేక, లీకులతో మాపైన లేనిపోని దుష్ప్రచారం చేస్తూ, నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని..ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదన్నారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహరాలతో సంబంధం లేదన్నారు.

నేను ఎవరో హీరోయిన్ల ఫోన్లను బెదిరించానంటున్నారని, ఓ నెత్తి లేని మంత్రి అలాంటి ఆరోపణలు చేశారని, నాకు ఆ ఖర్మేంటని, అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన అవసరం నాకు లేదని, నాకు ఏ హీరోయిన్‌తో సంబంధం లేదని.. ఇలాంటి చెత్త మాటలు మంత్రులు, సీఎం ఎవరు మాట్లాడిన తాట తీస్తామని, ఇలాంటి వాటికి తాను భయపడనని లీగల్‌గా అన్నింటిని ఎదుర్కోంటానని పేర్కోన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఫోన్ ట్యాపింగ్ చేసింది ఇప్పుడున్న అధికారులేనని చెప్పారు. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆంధ్ర సీఎం, తెలంగాణ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ చేస్తున్నారని ఇప్పుడున్న కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారని తెలిపారు.

అధికారులు మారలేదు ప్రభుత్వమే మారిందని, ఆనాడు ఉన్నా శివధర్ రెడ్డి… టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మహేందర్ రెడ్డిలు, రవి గుప్తా లాంటి అధికారులే ఈ రోజు ఉన్నారని, ఈ అధికారులు ఎవరూ కూడా బాధ్యులు కాదా అని ప్రశ్నించారు. గతంలో నా ఫోన్ కూడా సర్వేలెన్స్ లో ఉందని నాకు యాపిల్‌ సంస్థ వాళ్లే మెసేజ్ వస్తే నేను ప్రజలతో పంచుకున్నానని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2004నుంచి జరిగిన ఫోన్ల ట్యాపింగ్ పై విచారణ జరిపిస్తే ఎవరి బొక్కలేమిటో తెలుస్తాయన్నారు.

పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ట్యాపింగ్‌తో టైమ్‌పాస్‌..

రాష్ట్రంలో ప్రజలు తాగునీళ్ల కోసం తల్లడిల్లుతుంటే..రైతులు సాగునీళ్ళు లేక కన్నీళ్లు పెడుతుంటే పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ట్యాపింగ్ పేరుతో లీకు వీరుడు సీఎంర రేవంత్‌రెడ్డి టైమ్ పాస్ చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రిజర్వాయర్‌లలో నీళ్లుంటే ప్రజలు సాగుతాగునీటికి ఎందుకు కష్టాలు పడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తాము అధికారం నుంచి దిగిపోయేనాటికి ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నాయని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం నీటి నిర్వాహణ చేతగాకనే నీళ్ల సమస్యలు తలెత్తాయని, ఫోన్ ట్యాపింగ్‌తో ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలను మాని వాటర్ ట్యాప్‌లపై ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజల సాగుతాగునీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేరికల కోసం పార్టీ గేట్లు ఎత్తడం కాదని.. రైతుల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండని ముఖ్యమంత్రికి సూచించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ నుంచి సూట్ కేసులను ఢిల్లీకి మోయడంలో ఉన్న శ్రద్ద.. ప్రజలకు నీళ్లు ఇవ్వడంలో లేదన్నారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే సాగుతాగునీటి కష్టాలు

తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. మహిళలు బిందెలు పట్టుకుని నీళ్లకోసం అల్లాడుతున్నారని, నేడు ట్యాంకర్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తున్నాయన్నారు. నగరంలో ట్యాంకర్ల దందా జోరుగా సాగుతున్నదని విమర్శించారు. అందుకే కేసీఆర్‌ అంటే నీళ్లు, కాంగ్రెస్‌ అంటే కన్నీళ్లని తాము ఎప్పటినుంచో చెబుతున్నామని గుర్తుచేశారు.మిషన్‌ భగీరథను సక్రమంగా నిర్వహించడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని చెప్పారు.

హైదరాబాద్‌లో మళ్లీ ఇన్వర్టర్లు, జనరేటర్లు వచ్చాయన్నారు. అబద్ధాల పునాదులపైనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. తాగునీళ్లు లేక ప్రజలు, సాగునీళ్లందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇది ప్రకృతి ప్రకోపం వల్ల వచ్చిన కరువు కాదని, అసమర్ధ కాంగ్రెస్‌ వల్ల వచ్చిన కరువని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీళ్లు ఉన్నా వినియోగించడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు.

నీళ్ల ట్యాంకర్లను ఫ్రీగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం కాంగ్రెస్ కి ఓటు వేయలేదు…కాబట్టి రేవంత్ రెడ్డి నగరం పైన కక్ష కట్టారని, అందుకే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్న తాగునీరు అందియడం లేదని కేటీఆర్ ఆరోపించారు. 12 గంటల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న ముఖ్యమంత్రి అసలు ట్యాంకర్లతోని నీరు ఎందుకు సరఫరా చేయాల్సి వస్తుందో అది ప్రభుత్వ వైఫల్యం కాదా అనే విషయాన్ని చెప్పాలన్నారు.

ఈరోజు దాదాపు రెండు లక్షల 30 వేల ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారని, వీటి ద్వారా ప్రజలపై పడుతున్న భారం కాంగ్రెస్ పార్టీ వేసిందని, రేవంత్ రెడ్డి ఈ భారం భరిస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ భరిస్తుందా చెప్పాలన్నారు. బెంగళూరులో నీటి వృథాకు జరిమానా విధించాలని అక్కడి ప్రభుత్వం అంటున్నదని, ఇక్కడ వంద రోజులుగా నీళ్లను ఎత్తిపోయకుండా ఉన్న ఈ ప్రభుత్వంపై ఏం జరిమానా విధించాలని ప్రశ్నించారు.

హైదరాబాద్ ప్రజల తాగునీటి సమస్యలపై అవసరమైతే జలమండలి ముందు ధర్నాలు చేస్తామన్నారు. గతంలో మేము 20,000 లీటర్ల ఉచిత నీటిని 12 లక్షల కుటుంబాలకు అందించామని, ఇప్పుడు గత ఏడాది డబ్బులు అన్ని కూడా ఒకేసారి ఇచ్చి ప్రజల నుంచి డబ్బులు గుంజే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందన్నారు. హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఇబ్బందులు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ, సీఎంలు నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరంపై అసత్యాల ప్రచారం

కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు విషప్రచారం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కొట్టుకుపోయింది, పనికిరాదు అన్న కాంగ్రెస్ సన్నాసులే.. అదే కాళేశ్వరం నుండి ఇప్పుడు ఎట్లా నీళ్లు ఇస్తున్నారని కేటీఆర్‌ నిలదీశారు. ఇవే నీళ్లు ముందే ఇచ్చి ఉంటే ఒక్క ఎకరం కూడా ఎండిపోకపోతుండే కదా అన్నారు. కేసీఆర్‌ జనగామ, సూర్యాపేట వెళ్లగానే అదే కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి జలాలను విడుదల చేశారని కేటీఆర్ చెప్పారు.

అంతకముందే కాళేశ్వరం పంపులను ఆన్‌ చేసి, మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేస్తే రైతులకు సాగునీటి కొరత దుస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. హరీశ్‌ రావు మల్లన్న సాగర్‌ నీటి కోసం అల్టిమేటం ఇస్తే వెంటనే విడుదల చేశారన్నారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ వరకు తీసుకురావచ్చని చెప్పారు. రాజకీయ కుట్రతో ప్రజల కనీస అవసరమైన తాగునీళ్లు ఇవ్వకుండా చేశారని విమర్శించారు.

పంటలు పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా.. కుట్రతోనే దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి, వర్షాలతో దెబ్బతిని, ప్రభుత్వం రుణమాఫీ చేయక ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి వివరాలు ఈ రోజే ముఖ్యమంత్రికి అందిస్తామని వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

దానం, కడియంలపై అనర్హత వేటు కోసం పోరాటం

పార్టీ మారిన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై కచ్చితంగా కోర్టుకు వెళ్లామన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో చేరి మళ్లీ పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక ఖాయమన్నారు. మందకృష్ణ మాదిగ కూడా ఇదే విషయం మాట్లాడారని చెప్పారు.

పెట్రోల్‌ ధరలు పెరుగుదలకు ఎవరిది బాధ్యత?

ప్రతి భారతీయుడు పెరిగిన ముడి చమురు ధరల గురించి ఆలోచించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. క్రూడాయిల్‌ ధరలు 2014 నుంచి తగ్గాయని.. కానీ మన దేశంలో ఇదే దశాబ్దంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.35, రూ.40 చొప్పున పెరిగాయనిన్నారు. దీనికి ఎవరిని నిందించాలి? నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

Latest News