BRS | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతకు బీఆరెస్ వ్యూహం.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన

ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా తమ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు బీఆరెస్ ప్రయత్నాలు చేస్తుంది

  • Publish Date - June 24, 2024 / 02:31 PM IST

విధాత, హైదరాబాద్ : ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా తమ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు బీఆరెస్ ప్రయత్నాలు చేస్తుంది. పార్టీ మారిన బీఆరెస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా గులాబీ వర్గాల కథనం. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తికావస్తుంది. దానంపై అనర్హత వేటు వేయాలంటూ అటు అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ఇటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీఆరెస్ వేసిన ఈ పిటిషన్‌పై ఈ నెల 27న వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్‌పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది.

అలాగే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టు వెంటనే దానంపై అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆరెస్ భావిస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే విషయమై బీఆరెస్ లీగల్ టీమ్ కసరత్తు చేస్తుంది. దానం నాగేందర్‌తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఒకేసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని బీఆరెస్ వ్యూహ రచన చేస్తుందని పార్టీ వర్గాల సమాచారం. అయితే గతంలో 2014, 2018అసెంబ్లీ ఎన్నికల పిదప టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను చేర్చుకున్న క్రమంలో ఆ పార్టీలు ఎదుర్కోన్న పరిస్థితినే ఇప్పుడు బీఆరెస్ ఎదుర్కోంటుంది. ఆనాడు అనర్హత వివాదంపై టీడీపీ, కాంగ్రెస్‌లు సాగించిన ప్రయత్నాలకు ఎలాంటి ఫలితాలొచ్చాయో ఇప్పుడు బీఆరెస్‌కు అవే ఫలితాలుంటాయని ఇందులో పెద్దగా మార్పులేమి ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest News