వీలైనంత త్వరగా ధరణిని మార్చాలి
ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధిన్
విధాత, హైదరాబాద్ : ధరణి కారణంగా రాష్ట్రంలో భూ రికార్డులన్ని అస్తవ్యస్థంగా మారిపోయాయని, వీలైనంత త్వరగా ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం మార్చాలని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దిన్ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు. శుక్రవారం అసెంబ్లీలో ధరణిపై చర్చలో అక్బరుద్ధిన్ మాట్లాడుతూ ధరణి పట్ల ప్రజల్లో, రైతుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ధరణి కూడా ఒకటని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్ మిత్రులు ఈ వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించాలన్నారు. ధరణి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. ధరణి వచ్చాక ఎవరి పేరుతో ఎన్ని భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయో తాను వివరాలతో సహా వివరిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి అక్రమాలను సులువువగా విడిచిపెట్టవద్ధని, మరో రోజు దీనిపై సమగ్ర చర్చ జరుపాల్సిన అవసరముందన్నారు. ధరణి పేరును భూమాతగా మార్చేడమే కాకుండా అసలు ధరణినే సమూలంగా మార్చాలన్నారు. హైదబాద్ నగరంలో, చుట్టుపక్కల భూముల్లో పెద్ద ఎత్తున ధరణి ముసుగుల్లో భూ దోపిడి సాగిందని ఆరోపించారు. నిజాం కాలం నుంచి కొనసాగిన రెవెన్యూ రికార్డులన్ని ధరణి పుణ్యమా అని అస్తవ్యస్తమయ్యాయన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో 2003లో ఐఎంజీ భారత్ కు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదిగా హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చి 4 నెలలు కావొస్తున్నా ఈ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా వారిని సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా అవకాశమిస్తున్నారా అని అక్బరుద్ధిన్ అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా భూ అక్రమాలకు పాల్పడకుండా ప్రజల, ప్రభుత్వ ఆస్తులను, భూములను రక్షించే చర్యలు చేపట్టాలని కోరారు.