చిల్కూరి సోదరులకు దక్కిన గౌరవం
విధాత : తెలుగు జానపద కళారూపం బుర్రకథకు అరుదైన ఘనత దక్కింది. చిల్కూరి బుర్రకథ బృందం ప్రదర్శించిన ‘ శాంసన్ అండ్ దెలీలా అనే బుర్ర కథ టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్‌లో అధికారికంగా ఎంపికైంది. ఈ బుర్రకథను హైదరాబాద్‌కు చెందిన చిల్కూరి శ్యామ్ రావు, చిల్కూరి వసంతరావు, చిల్కూరి సుశీల్ రావు అనే ముగ్గురు సోదరులు ప్రదర్శించారు. టొరంటో లిఫ్ట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్న శాంసన్ అండ్ దెలీలా బుర్రకథను చిల్కూరి సుశీల్‌రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వీరుడైన శాంసన్ అందమైన దెలీలాతో ఎలా ప్రేమలో పడతాడనే బైబిల్ కథ ఆధారంగా శాంసన్ అండ్ దెలీలా బుర్ర కథను రూపొందించారు. ఈ కథను ప్రధాన కళాకారుడు చిల్కూరి వసంతరావు అద్భుతంగా ప్రదర్శించారు.
ప్రేమ, ద్రోహం అలాగే ఎదురించి పోరాడటం వంటి అంశాలను తన కథలో ఆకట్టుకునేలా వివరించారు. చిల్కూరి బుర్రకథ బృందం 1970 చివర, 1980 తొలినాళ్లలతో తమ ప్రదర్శనలను ప్రారంభించింది. అప్పట్నుంచి హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో అనేక బుర్రకథ ప్రదర్శనలను ఇచ్చింది. బృందంలోని చిల్కూరి శ్యామ్ రావు సీనియర్ న్యాయవాది. చిల్కూరి వసంతరావు బెంగళూరులోని యునైటెడ్ థియోలాజికల్ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. చిల్కూరి సుశీల్ రావు పాత్రికేయుడిగా,డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ పనిచేస్తున్నారు.