*ముందస్తు ప్రణాళిక మేరకే టీవీల్లో ప్రసారాలు
*మంత్రి పదవి గడ్డిపోచలెక్క
*నిరూపిస్తే ముక్కు నేలకేసి రాస్తా
*ఈటెల అంటే నిప్పు
*సిట్టింగ్ జడ్డితో కూడా విచారణ చేస్కోమను
*రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు కొనమన్నారు
*అసైన్డ్ భూములు కొనరాదు, అమ్మరాదు అని చెప్పాను
*దాంతో వాళ్లే ప్రభుత్వానికి భూములు సరెండర్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌పై కొన్ని టీవీ ఛానెళ్లో వచ్చిన భూకబ్జా వార్తా కథనాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చేందుకు శుక్రవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ శివారు శామీర్‌పేటలోని తన నివాసంలో మంత్రి ఈటల భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు. తనపై వచ్చిరన ఆరోపణలు కట్టుకథలను కొట్టిపారేశారు. కొన్ని టీవీలలో ఉద్దేశపూర్వకంగా ప్రసారాలు చేశారని తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రసారం చేశారని పేర్కొన్నారు. అంతిమ విజయం ధర్మానిదే అని స్పష్టం చేశారు.
ఈటల మాటలు ఇవే..
‘2016లో ఒక హ్యాచరీ పెట్టాలని నిర్ణయించుకున్నాం. అత్యంత వెనుకబడిన అచ్చంపల్లిలో తొండలు కూడా గడ్లు పెట్టని భూములు అవి. రూ.6 లక్షల చొప్పున కొన్నాం. 40, 50 ఎకరాలు కొన్నాం. మళ్లీ 7 ఎకరాలు కొన్నాం. కెనరా బ్యాంక్ ద్వారా రూ.వంద కోట్ల రుణం తీసుకుని జమునా హ్యాచరీ అభివృద్ధి చేశాం. ఇంకా బ్యాంకు అప్పు కడుతూనే ఉన్నాం. విస్తరించడం కోసం భూములు కొన్నాం. రూపాయి అక్కరకు రాని భూములు తీసుకున్నాం.ఆ చుట్టుపక్కల అసైన్డ్ భూములు ఉన్నాయి. కోళ్ల ఫారం విస్తరించాలని, ఆ భూములు కొనడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వానికి దరఖాస్తు చేశాను. ప్రభుత్వాన్ని అక్వైర్ చేసి ఇమ్మని అడిగాను. అది లేటవుతుందని, మీరే రైతులు ఇస్తే తీసుకొమ్మని పరిశ్రమల శాఖ చెప్పింది. దీనికి సీఎంవోలో నర్సింగరావే సాక్ష్యం. ఇప్పటికీ ఆ భూములు ఎమ్మార్వో దగ్గరే ఉన్నాయి. నా అధీనంలో లేవు. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా చెప్పాం. భూకబ్జా ఆరోపణలు అత్యంత నీచమైనది. ఇంత కథలు చెప్పి.. ఇంత దుర్మార్గ విషయాలు తగదు. 1986లో హ్యాచరీలోకి అడుగుపెట్టాం. నేను మా మేడం కలిసి పెట్టాం. వరంగల్‌లో 1992లోనే హ్యాచరీతోనే అభివృద్ధి చేశాం. వరంగల్‌లో 50వేల కోళ్లతో హ్యాచరీస్ పెట్టాను. ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిని, ఆయన భార్యను అడగండి. దాని విస్తరణలో భాగంగానే యాంజల్‌లో 2004 వరకు 170-180 ఎకరాలతో ఎదిగినవాన్ని. 2004కు ముందే నా భూమి 120 ఎకరాలు ఉంది. కానీ ఇప్పుడు నాకు మిగిలింది 90 ఎకరాలే. శిలాసాగర్‌లో ఫారం అమ్ముకున్నా, ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్‌లో లక్ష కోళ్ల ఫారం అమ్ముకున్నాను. ఇంకా చాలా చోట్ల అమ్ముకున్నాను. నాకోసం అమ్ముకున్నా. కానీ ఒకటే జనరేషన్‌లో వందలకోట్లు సంపాదించారు..ఎలాగో చెప్పాలి. నేను కోళ్లను కల్తీ చేసేది లేదు. గుడ్లు కల్తీ చేసేది లేదు. మోసం చేసేది లేదు. టమాటాల లెక్క డిమాండ్ సప్లయి లాగా అమ్మేది చికెన్. దాన్ని నమ్ముకునే నేను బతుకుతున్నా. ఆనాడు సీఎం కేసీఆర్ తమ్మీ నువు దూరమైపోయినావు ఉద్యమానికి…సిటీలో ఇళ్లు కట్టుకో అని చెప్పడంతోనే 2007లో రూ.5 కోట్లతో 2,100 గజాల భూమి కొన్నా. దానిపై ఇంకా కిరికిరి నడుస్తుంది. శ్రీహరిబాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డిలు కూడా నాకు జరిగిన అన్యాయంపై మాట్లాడారు. ఇవాళ్టికీ నాకు ఆ భూమి నాకు చెందలేదు. నేను మంత్రిని. నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు. నేను ఇల్లు కట్టుకున్న గ్రామంలో రింగ్ రోడ్డు వేశారు నా భూముల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆనాడే వైఎస్‌పైనే తిరగబడ్డాను. నేను ఆత్మను అమ్ముకోను. 2004నుంచే ఉస్మానియా విద్యార్థులను కేసుల నుంచి కాపాడుకున్నా, నా ఇంట్లో రోజూ అన్నం పెడుతుంటా. ఇవాళ నా కులాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. నేను ముదిరాజ్ బిడ్డను. నేను దొరనని ప్రచారం చేయడం దుర్మార్గం. చావనైనా చస్తా కానీ లొంగిపోను. నా భార్య రెడ్డి. నేను బీసీ బిడ్డను. నా జాతి ధైర్యమున్న జాతి. ఎవరికీ భయపడే జాతి కాదు. నా పిల్లలకు నేను పేర్లు పెడితే, నా భార్య రెడ్డి అని యాడ్ చేసింది. ఒకప్పుడు వెయ్యికి, రెండు వేలకు అడుక్కున్న వాళ్లు ఇవ్వాళ వందల కోట్లు సంపాదించారు. ఎలా వచ్చింది? స‌్కూటర్లలో వచ్చినోళ్లు ఎలా కోట్లకు పడగలెత్తారు?’
‘ఇవాళ సీఎం ఒక కమిటీ వేసినట్లు తెలిసింది. నేను దాన్ని ఆహ్వానిస్తున్నా. వేయండి అన్ని కమిటీలు. నా మొత్తం చరిత్ర మీద, నా మొత్తం ఆస్తుల మీద విచారణలు వేయమని డిమాండ్ చేస్తున్నా. పరిశ్రమలు పెట్టినప్పుడు ఎన్ని రాయితీలు ఇచ్చారు. నేను ఐదు పైసల బిళ్ల తీసుకోలేదు. వంద కోట్ల రుణం తీసుకునే స్థాయికి ఎదిగానంటే, నా ప్రొఫైల్, నా స్థాయి ఏంటో అర్థం చేసుకోండి. అన్ని కమిటీలు వేయండి. విచారణ చేయండి అని సవాల్ విసిరారు. అవినీతి చేస్తే ముక్కు నేలకు రాస్తా అని తెలిపారు. చిల్లర మల్లర వాటికి లొంగిపోను. ప్రశ్నించేటట్టు ఉన్నాం.. కానీ లొంగిపోవడానికి ఉండం. నా మంత్రి పదవికి గడ్డిపోచ కింద లెక్క. నా ఆత్మగౌరవం, నా ఆత్మాభిమానం కన్నా మంత్రి పదవి ముఖ్యం కాదు. 20 ఏళ్లుగా 6 సంవత్సరాలుగా హుజురాబాద్ నుంచి గెలుస్తున్నా. నా నియోజకవర్గం హుజురాబాద్‌లో వెళ్లి అడగండి నా గురించి. ఏమీ లేనప్పుడు కూడా నేను కొట్లాడిన. ధర్మం కోసం.. ప్రజల కోసం కొట్లాడుతా. పదిమందికి సాయం చేసే మనస్తత్వం ఉన్నొళ్లం. ఎర్ర చీమకు కూడా హాని చేయం. ’
ఏడుస్తున్నారు..?
20 ఏళ్ల చరిత్రలో ఎవరికీ హాని చేయలేదు. అన్యాయం చేయలేదు. నా నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా నా సాయం ఉంటుంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినామంటే ఊరకే గెలుస్తామా? నా నియోజకవర్గంలో కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి గెలవలేదు. డబ్బులు పంచి, ప్రలోభాలు పెట్టి గెలవలేదు. మానవత్వంతో, ఒళ్లు వంచి పనిచేసి ప్రజాభిమానం సంపాదించుకున్నాం. తన చరిత్ర చెరిపేస్తే చెరగనది. సిట్టింగ్ జడ్జి, సీబీఐ.. ఎన్ని సంస్థలు ఉన్నాయో వాటితో విచారణ చేయండి. ఈటల అంటే నిప్పు అని చెప్పారు. నాపై ఈ ఆరోపణలు వస్తుంటే ఏడుస్తున్నారు.. గుండెలకు గాయాలు అవుతున్నాయని నాకు ఫోన్లు వస్తున్నాయి. నేను నయీం లాంటి వాడు బెదిరిస్తేనే బెదరలేదు. అందరి చరిత్ర నాకు తెలుసు. రైతులు వచ్చి మాకు భూములు అప్పగించారు. దొరతనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నేను. స్కూటర్‌పై వచ్చిన వందల కోట్లు సంపాదించింది ఎవరు? విచారణ వారిపై వేయండి. ఒక్క ఎకరం భూమి ఉన్నా షెడ్డు కూలగొట్టి తీసుకోండి. రాజేందర్ ఏమి లేనప్పుడే కొట్లాడారు. ఇవాళ కాదు. మా వేడి ఏందో, మా వాడి ఏందో అందరికీ తెలుసు. నర్సింగరావు దగ్గర కెళ్లి నా భూములకు పరిష్కారం ఏంటని ఎన్నిసార్లు అడిగానో లేదో అడగండి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి బతికినోన్ని. ఈ రాష్ట్రంలో ఎవరెన్ని ప్రభుత్వ భూములు కబ్జా పెట్టిండ్రు, ఎవరి చేతిలో ఎన్ని భూములు ఉన్నాయి విచారణ జరపండి. నేను ఎప్పుడూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడను. ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతాసస అన్నారు.