Site icon vidhaatha

సంక్షేమం బడుగులకా.. బడా బాబులకా?: సీపీఐ చాడా వెంకట రెడ్డి

– నియంతృత్వ ప్రభుత్వాలకు ప్రజలే గుణపాఠం చెప్తారు

– ధరణి పోర్టల్ కాదు.. దరిద్రపు పోర్టల్


విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బడుగు, బలహీన వర్గాల వారికి అందడం లేదని, బడా బాబులకు లబ్ధిచేకూర్చేలా అమలు జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట రెడ్డి విమర్శించారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వేషన్ హాల్లో పార్టీ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగులు లక్ష్మణ్ తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో చేరి రానున్న ఎన్నికల్లో వామపక్ష పార్టీలుగా దేశంలో, రాష్ట్రంలో కీలకపాత్ర పోషిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పోత్తుల విషయంలో ఒక అడుగు ముందుకు పడిందన్నారు. ఒక్కటి, రెండు రోజుల్లో పూర్తిగా వెల్లడిస్తామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ మతోన్మాద శక్తిగా ఎదగకుండా, రాష్ట్రంలో విధ్వంసకర వాతావరణం ఏర్పడకుండా అడ్డువేసేందుకు పూర్తిస్థాయిలో సీపీఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. కార్మిక, కర్షక, యువత, విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నాయని విమర్శించారు.

నియంతృత్వ ప్రభుత్వాలకు ప్రజలు రాబోవు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ తో రాష్ట్రంలో రైతులకు దరిద్రపు పరిస్థితులు నెలకొన్నాయని, రైతుల భూములను కబ్జా చేయడం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేలా భూ రికార్డులను మార్పు చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంభించి బడా బాబులకు అనుకూలంగా చట్టాలను మార్చడం జరిగిందని విమర్శించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా పక్షాళన చేయాలని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నిగద్దెదించాలని అన్నారు. ఈసమావేవంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల దాసు, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, ఖలందర్, అలీ ఖాన్, జొగుల మల్లయ్య, కే వీరభద్రయ్య, ఇప్పకయాల లింగయ్య, భీమనదుని సుదర్శన్, మామిడాల రాజేశం, దాగం మల్లేష్, లింగం రవి, చిప్ప నర్సయ్య, మండల, మున్సిపల్ కార్యదర్శులు పాల్గొన్నారు.

Exit mobile version