Site icon vidhaatha

ప్రధాని మోడీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌

విధాత‌(హైదరాబాద్‌): కరోనాపై ఉన్నతస్థాయి సమీక్షలో వచ్చిన సూచనల మేరకు ముఖ్యమంత్రి అప్పటికప్పుడే కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట్రం చేపడుతున్న చర్యలను వివరించారు. కరోనాను నియంత్రించే క్రమంలో తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర మంత్రికి కీలక సూచనలు చేశారు.

కరోనా వ్యాప్తిని పెంచే అవకాశం ఉన్న ‘అతివేగంగా వ్యాప్తి కారకులను’ గుర్తించి వారికి ముందువరసలో టీకాలు వేస్తే బాగుంటుందని సూచించారు. ముఖ్యమంత్రి సూచనలను హర్షవర్ధన్‌ ప్రధాని మోదీకి వివరించారు. దీంతో ప్రధాని మోదీ కేసీఆర్‌కు ఫోన్‌ చేశారు. ‘ఆరోగ్య మంత్రి నాతో మాట్లాడారు. మీరు చేసిన సూచనలు వివరించారు. మీ ప్రతిపాదనలు చాలా బాగున్నాయి. దేశవ్యాప్తంగా అమలు చేద్దాం’ అంటూ కేసీఆర్‌ను ప్రధాని అభినందించారు.

ఉత్పత్తి పరిమితుల దృష్ట్యా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో దేశంలో ప్రతి ఒక్కరికీ టీకా వేయడం సాధ్యపడేలా లేదనీ, అందువల్ల సూపర్‌ స్ప్రెడర్లుగా ఉన్న వర్గాల వారిని గుర్తించి వారికి ముందు టీకా వేయడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ముఖ్యమంత్రి కేంద్రానికి సూచించారు. “దేశంలో అందరికీ టీకా వేయాలంటే దాదాపు 270 కోట్ల డోసులు కావాలి. సత్వరమే అంత ఉత్పత్తి చేసే, లేదా దిగుమతి చేసుకునే సామర్థ్యం మనకు లేదు.

అందువల్ల టీకాలకు ప్రాధాన్య క్రమం ఉండాలి. ఉదాహరణకు ఆటో డ్రైవర్లు, క్యాబ్‌డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, కూరగాయల వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, ఎయిర్‌పోర్టుల్లో సిబ్బంది, దుకాణాల్లో సేల్స్‌మన్‌, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, అడ్డా కూలీలు.. ఇలాంటి వాళ్ల సేవలను మనం ఆపలేం. అదే సమయంలో వారి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రాధాన్య క్రమంలో వీరికి ముందుగా టీకా వేస్తే కరోనా వ్యాప్తిని చాలావరకు అరికట్టవచ్చు’ అని హర్షవర్ధన్‌కు ముఖ్యమంత్రి సూచించారు.

పై క్యాటగిరీల వారిని కరోనా వ్యాప్తి అధికం చేసే వర్గంగా ప్రత్యేకంగా గుర్తించి, వాక్సిన్‌ను అందచేసేందుకు నిబంధనలను సడలించాలన్నారు. ఆ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడం ద్వారా కరోనా వ్యాప్తిని అధికభాగం అరికట్టే అవకాశముంటుందని సీఎం తెలిపారు. సీఎం సూచనలమీద సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ప్రధానితో చర్చించి దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వెంటనే హర్షవర్ధన్‌ ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. కాసేపటికే ప్రధాని ముఖ్యమంత్రికి ఫోన్‌ చేశారు.

సమీక్ష సందర్భంగా మీరు చేసిన సూచనలను హర్షవర్దన్‌ తనకు వివరించినట్టు ప్రధాని సీఎంకు తెలిపారు. ‘మీది మంచి ఆలోచన, మీ సూచనలు చాలా బాగున్నాయి. వాటిని తప్పకుండా ఆచరణలో పెడుతాం. మీ సూచనలకు అభినందనలు’ అంటూ కేసీఆర్‌ను ప్రధాని అభినందించారు. రాష్ట్రానికి మరింతగా ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు సరఫరా చేయాలని సీఎం ఈ సందర్భంగా ప్రధానికి విజ్జప్తి చేశారు. దీనికి ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో సత్వరమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Exit mobile version