CM Revanth Reddy | రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు.

  • Publish Date - July 4, 2024 / 05:38 PM IST

పెండింగ్ నిధులు విడుదల చేయాలి
ప్రధానితో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి వినతులు
కేంద్ర రాష్ట్రాల మధ్య సత్ససంబంధాలను ఆశిస్తున్నామని వెల్లడి
సింగరేణికి గనుల కేటాయింపుకు విజ్ఞప్తి
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీని హోంశాఖ మంత్రికి నివేదించాం
ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని కోరాం
బీఆరెస్‌కు భవిష్యత్తు లేదు… చరిత్రనే మిగిలింది
హైకమాండ్ పరిశీలనలో మంత్రివర్గ విస్తరణ..పీసీసీ చీఫ్ ఎంపిక
ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించిన సీఎం, డిప్యూటీ సీఎంలు
మొత్తం 12అంశాలపై వినతులు

విధాత, హైదరాబాద్ : సీఎం ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న రాష్ట్ర పునర్విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు. అంతకుముందు వారు హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, భట్టిలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ప్రధాని, కేంద్రమంత్రులను కలిశామని స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై వినతిపత్రాలు ఇచ్చామని, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతోనే వారిని కలిశామన్నారు. కేంద్రం వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించిందని, విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని కోరడం జరిగిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏపీ, తెలంగాణ సీఎంలు ఈ నెల 6న హైదరాబాద్‌లో విభజన సమస్యలపై చర్చించోతున్నట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు తెలియచేయడం జరిగిందన్నారు.

చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడాన్ని అమిత్‌షా స్వాగతించారని తెలిపారు. అలాగే భౌగోళికంగా, పాలన పరంగా తెలంగాణకే అనుకూలంగా ఉన్నందునా భద్రాచలం ఐదు గ్రామాలను ఏపీ నుంచి తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల సమస్య సహా ఎన్నో ఇతర సమస్యలపై ఏపీ తెలంగాణ సీఎంల సమావేశంలో చర్చించి పరిష్కార సాధన దిశగా ముందుకెళ్లాలనుకుంటున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, తిరిగి ప్రజలు బీఆరెస్ కోసం టార్చ్‌లైట్ వేసుకుని వెతుక్కుంటూ వస్తారన్న మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆరెస్ ఎక్కడుందో నిజంగానే ఇప్పుడు ప్రజలు టార్చ్‌లైట్ వేసుక్కునే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్ల తర్వాతా బీఆరెస్‌కు మిగిలింది గత చరిత్రనే తప్పా భవిష్యత్తు లేదన్నారు. 23ఏళ్ల బీఆరెస్ చరిత్రలో తొలిసారి లోక్‌సభలో ఆ పార్టీకి ఎంపీ లేడన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టే ఆలోచనను బీజేపీ మానుకోవాలన్నారు. బీజేపీకి కేసీఆర్ పట్ల సానుభూతి దేనికని, వారిద్ధరు ప్రేమించుకుంటే మాకు అభ్యంతరం లేదన్నారు. గతంలో బీఆరెస్ చేసిన ఫిరాయింపులు బీజేపీకి గుర్తు లేదా అని ప్రశ్నించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై మేం ప్రజాస్వామికంగానే ఉన్నామన్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం పార్టీ హైకమాండ్ పరిశీలనలో ఉందన్నారు. దీనిపై మేం చెప్పాల్సిన అంశాలు పార్టీ హైకమాండ్‌కు చెప్పామని, బంతి వారి కోర్టులోనే ఉందని, ఆలస్యంపై వారినే అడుగాలన్నారు.

రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కారించాలని కోరాం: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో పొందుపర్చిన హక్కులనే రెండు అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గోదావరి పరిసరాల్లోని బొగ్గు గనులను వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌కు కేటాయించాలని, రాష్ట్రానికి ఐఐఎం ఇవ్వాలని, ఐటీఆర్ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించాలని ప్రధానిని కోరామని తెలిపారు.

ఏపీలో విలీనమైన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని, తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని, జిల్లాకో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేశామన్నారు. మా వినతులకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు” అని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

12 అంశాలపై వినతులు

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు తమ ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన 12అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు వినతులు అందించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు వేలంతో నిమిత్తం లేకుండా బొగ్గు బ్లాకుల కేటాయించాలని కోరారు. గోదావరి లోయ ప్రాంతంలోని బొగ్గు నిల్వల క్షేత్రంగా సింగరేణి గుర్తించిన ప్రాంతంలో ఉన్న కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3గనులను, వేలంలో చేర్చిన శ్రావణపల్లి బ్లాక్‌ను మైన్స్ అండ్ మినరల్స్ డెవెలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలో ఉన్న సెక్షన్ 11A / 17(A) (2) ప్రకారం సింగరేణికి కేటాయించాలని కోరారు.

రాష్ట్రంలోని విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థ అని, ఇందులో తెలంగాణ ప్రభుత్వానికి 51శాతం, కేంద్ర ప్రభుత్వానికి 49శాతం ఈక్విటీ వాటా ఉందని గుర్తు చేశారు. అలాగే ఐఐఎంను, ఐటీఐఆర్‌ను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చిందని, 2023 జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ వ్యాగన్ తయారీ కేంద్రానికి బదులుగా కాజీపేటలో పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందని, విభజన హామీ మేరకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కోరారు.

ఇండియా సెమీకండక్టర్ మిషన్ లో తెలంగాణను చేర్చాలని కోరారు. రాబోయే ఐదు ఏండ్లలో పీఎంఏవై పథకంలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్నబీఆర్‌జీఎఫ్‌ గ్రాంట్ 2019-20, 2021-22, 2022-23 మరియు 2023-24 సంవత్సరాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.1,800 కోట్లు విడుదల చేయాలని కోరారు. హైదరాబాద్లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్ నాగ్పూర్ (జాతీయ రహదారి 44)పై ఎలివేటేడ్ కారిడార్లను నిర్మించ తలపెట్టామని, ఈ రెండు కారిడార్ల నిర్మాణానికి అడ్డంకి లేకుండా మార్గమధ్యంలో రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను బదిలీ చేయాలని కోరారు.

వీటితో పాటు హైదరాబాద్ సిటీలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌తో పాటు రవాణా సదుపాయాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో 2450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని అభ్యర్థించారు. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ (ఆర్‌ఐసీ) కి లీజుకు ఇచ్చిన 2462 ఎకరాల భూములను పూర్తిగాకేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని నివేదించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు.

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా భారత్మాల పరియోజన మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డులో ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు జాతీయ రహదారి) నిర్మాణానికి ఆమోదం తెలిపిందని, 50 శాతం భూసేకరణకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వటంతో పాటు రహదారి నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని కోరారు.

హైదరాబాద్ చుట్టూ జాతీయ రహదారుల అభివృద్ధికి అత్యంత ఉపయుక్తంగా ఉండే రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని, భారత్ మాల పరియోజనలో ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, పుణ్య క్షేత్రాలకు పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని కోరారు.

జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్గొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్–అమనగల్–షాద్ నగర్‌–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట–రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల– మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్– జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవల్లి–యాదగిరిగుట్ట–రాయగిరి క్రాస్రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విన్నవించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలిని, ఇందుకోసం 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆయా అంశాల పరిష్కారానికి రానున్న కేంద్ర బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest News