Site icon vidhaatha

CM Revanth Reddy | వన మహోత్సవంలో తాటి, ఈత మొక్కలు: సీఎం రేవంత్‌రెడ్డి

కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకానికి ప్రారంభోత్సవం

విధాత, హైదరాబాద్ : వన మహోత్సవంలో భాగంగా తాటి,ఈత చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామని, రోడ్ల పక్కన వీటిని నాటాలనే నిబంధన విధిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లపూర్ మెట్ మండలం లష్కర్‌గూడలోని తాటివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గీత కార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. గీత కార్మికులు కిట్లను ధరించి తాటిచెట్లు ఎక్కగా, వాటి పనితీరును సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పరిశీలించారు. హైదరాబాద్ ఐఐటీ ఆధునిక టెక్నాలాజీతో రూపొందించిన సేప్టీకిట్ల(కాటమయ్య రక్ష కిట్లు)ను లబ్ధిదారులకు సీఎం అందచేశారు. చెట్లు ఎక్కుతున్న క్రమంలో ప్రమాదాల బారిన పడకుండా గీతా కార్మికులకు ఈ కిట్లు ఉపయోగపడనున్నాయి. బీసీ కార్పోరేషన్ ద్వారా కిట్ల పంపిణీ పథకం కొనసాగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి గీత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

తాటి వనాల పెంపును ప్రోత్సహించాలని సీఎంను గీత కార్మికులు కోరారు. ఇందు కోసం గ్రామాల్లో 5 ఎకరాల చొప్పున కేటాయించాలన్నారు. తాటి వనాలకు వెళ్లేందుకు మోపెడ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి రియల్ ఏస్టేట్ విస్తరణ తాటి, ఈత చెట్లు తగ్గిపోవడానికి కారణమవుతుందన్నారు. వనమహోత్సవంలో తాటి, ఈత చెట్ల పెంపకాన్ని ప్రొత్సహించేలా చూస్తామన్నారు. పేదలకు కూడా కార్పొరేట్ విద్య, వైద్యం అందాలని కాంగ్రెస్ ఆలోచించిందన్నారు. అందుకే పీజు రీయింబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చామన్నారు. కాంగ్రెస్ చేపట్టిన శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగిందన్నారు. హయత్ నగర్‌ వరకు త్వరలోనే మెట్రో రైలు కూడా వస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అధికారులు బుర్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version