Site icon vidhaatha

వారెంటీ దాటిన మోదీ గ్యారెంటీ: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రానికి మోదీ ఇచ్చింది లేదు
బీజేపీ తెచ్చింది లేదు.. గాడిద గుడ్డు తప్ప
బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి
బీఆరెస్‌ చచ్చిన పాముతో సమానం
తండ్రీకొడుకుల మోసాలను ఇక నమ్మరు
సికింద్రాబాద్‌ కార్నర్‌ మీటింగ్స్‌లో రేవంత్‌

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న గ్యారెంటీకి వారెంటీ ఎప్పుడో ముగిసిందని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మోదీ ఇచ్చింది, బీజేపీ తెచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమీ లేదని విమర్శించారు. సోమవారం సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా కార్నర్‌ మీటింగ్‌లలో మాట్లాడుతూ బీజేపీ, బీఆరెస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్లుగా మోదీ అధికారంలో ఉన్నా కిషన్ రెడ్డి అంబర్ పేట్ బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు.

హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే అణా పైసా పేదలకు ఇప్పించలేదని అన్నారు. బండి పోతే బండి ఇస్తానన్న అరగుండు జాడ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి మళ్లీ ఎంపీ అయినా హైదరాబాద్ నగరానికి, అంబర్ పేటకు ఒరిగేదేం లేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఈ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరిగింది కాంగ్రెస్ హయాంలోనే అని గుర్తుచేశారు. అంబర్ పేట్ అంటే హనుమంతన్న.. హనుమంతన్న అంటే అంబర్ పేట్ అన్నారు. వచ్చే బతుకమ్మ పండుగ అంబర్ పేట్ బతుకమ్మ కుంటలోనే జరిగేలా చేసే బాధ్యత తనదని చెప్పారు.

రాహుల్‌ ప్రధాని కావడం తథ్యం

మన దేశంలో ఆకలి కేకలు ఎక్కువని సర్వేలు తేల్చాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయం.. రాహుల్ ప్రధాని కావడం ఖాయమని అన్నారు. దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే.. ఆయనను కేంద్రమంత్రిని చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని, బీఆరెస్‌ పని అయిపోయిందని చెప్పారు. బీఆరెస్‌ చచ్చినపాముతో సమానమని తేల్చేశారు.

కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని కేటీఆర్‌ అంటున్నాడన్న రేవంత్‌.. ‘కేటీఆర్‌.. నువ్వు చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు… నిన్ను టికెట్ అడిగితే కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయనట్లు.. అడగకపోతే గ్యారంటీలు అమలు చేసినట్లు’ అని ఎద్దేవా చేశారు. తండ్రి, కొడుకులు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. మీ మోసాలకు కాలం చెల్లిందని, ఇక బీఆరెస్‌ను నమ్మేవాళ్లు ఎవరూ లేరని చెప్పారు.

బీజేపీకి మల్కాజిగిరిని తాకట్టు పెట్టిన బీఆరెస్‌

మల్కాజిగిరి పార్లమెంటు సీటును బీజేపీకి బీఆరెస్‌ తాకట్టు పెట్టిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. 2001 నుంచి 2021 వరకు ఇరవై ఏళ్లు కేసీఆర్‌తో కలిసి తెలంగాణను విధ్వంసం చేసింది మీరు కాదా అని ఈటల రాజేందర్‌ను ప్రశ్నించారు. పంపకాల్లో పంచాయితీతో విడిపోయారు తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. పదేళ్లు మంత్రిగా ఉండి ఏనాడైనా ఉప్పల్ కు వచ్చావా..? నువ్ ఏం చేశావని.. ఏం తెచ్చావని మల్కాజిగిరి ప్రజలను ఓటు అడుగుతావ్? అని ప్రశ్నించారు.

కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటుంటే ఆర్ధిక మంత్రిగా నిధులు విడుదల చేసింది నువ్వు కాదా? కరోనా సమయంలో సంతోష్ రావు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటుంటే.. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నది నువ్వు కాదా? అని నిలదీశారు. ఈటల, కేసీఆర్‌ది పగలు కుస్తీ.. చీకట్లో దోస్తీ అని ఎద్దేవాచేశారు. రిజర్వేషన్లు రద్దు చేసే బీజేపీ వైపు ఉంటారో… ఎస్సీ, ఎస్టీ, బీసీల వైపు ఉంటారో రాజేందర్ తేల్చుకోవాలని సవాలు విసిరారు. అంగీ మార్చినా, రంగు మార్చినా.. ఎన్ని వేషాలు వేసినా రాజేందర్ ను ప్రజలు నమ్మరని అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ సీటులో సునీతక్కను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Exit mobile version