Site icon vidhaatha

దక్షిణాది రాష్ట్రాలపై ఎన్డీయే సర్కార్ వివక్ష : ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

CM Revanth Reddy : కాంగ్రెస్ హయాంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదికి మేలు జరిగింద‌ని, కానీ ఎన్డీయే హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎనుముల‌ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జ్వోతి ప్రజ్వలన చేసిన అనంతరం ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతను రేవంత్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో అభివృద్ధి కోసం భాక్రానంగల్ నుంచి, నాగార్జున సాగర్ వరకు ఎన్నో ప్రాజెక్టులు కట్టార‌ని, కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చార‌ని తెలిపారు. ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావోతో ఎన్నో మార్పులు చేశార‌ని, ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలని చర్యలు చేపట్టార‌ని చెప్పారు. రాజీవ్ గాంధీ హయాంలో ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు మార్చార‌ని గుర్తు చేశారు. కంప్యూటర్లతో ఐటీ విప్లవం తీసుకురావడంతో పాటు టెలికాం రంగంలో మార్పులు తీసుకువచ్చార‌ని చెప్పారు.

మహాత్మా గాంధీ ఆలోచనల ప్రకారం స్థానిక సంస్థల్లో అధికారాలను కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పీవీ నరసిహారావు దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలు అందించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తో పరుగులు పెట్టించిన తెలుగు ఠీవీ..మన పీవీ నరసింహారావ‌ని కొనియాడారు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్ నేతలందరూ ప్రజలందరి మౌలిక అవసరాలు తీర్చాలని ప్రయత్నం చేశార‌ని, తరువాత 30 ఏళ్లు టెక్నాలజీ, టెలికాం ఇతర రంగాల్లో కాంగ్రెస్, యూపీఏ సేవలు అందించింద‌ని వివ‌రించారు. నెహ్రూ నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ వంటి కాంగ్రెస్ ప్రధానులు దేశంలో అనేక సంస్కరణలు, విప్లవాలు తీసుకువచ్చారని చెప్పారు. మరి మూడో సారి ప్రధాని అయిన నరేంద్రమోడీ ఈ దేశ ప్రజల కోసం ఏ రెవల్యూషన్ తీసుకువచ్చార‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. ‘నేను సవాల్ విసురుతున్నా. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు పనిచేశారు. కానీ ప్రజలకు మాత్రం ప్రధాని మోదీ పార్టీ ఏం చేయలేదు. రైతులను పట్టించుకోవటం లేదు. పార్టీలను చీల్చడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిందేంటీ..? ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారత దేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారు’ అని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు.

‘గతంలో నార్త్ ఇండియా నుంచి ప్రధాని అయితే, సౌత్ ఇండియా నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించింది. కానీ ప్రధాని మోదీ హయాంలో ఇలాంటి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. అందుకే దక్షిణాది నుంచి నీలం సంజీవరెడ్డి, అబ్దుల్ కలాం లాంటి వాళ్లు రాష్ట్రపతి అయ్యారు. కానీ ఎన్డీయే హయాంలో కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రధాని మోదీ పార్టీ ప్రయత్నాలు చేసింది కానీ దక్షిణాదికి చేసిందేమీ లేదు. దక్షిణాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది, కానీ ఇప్పుడు ఎన్డీయే మాత్రం దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నులు తీసుకుంటోంది. కానీ తిరిగి ఇచ్చింది ఏమీ లేదు’ అని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సౌత్ స్టేట్స్ కు ప్రధాని మోడీ అందించిన సహకారం చాలా తక్కువ‌ని స్ప‌ష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడి ఓట్లు కావాలని ఎలా అడుగుతార‌ని రేవంత్‌రెడ్డి నిల‌దీశారు. నార్త్ స్టేట్స్ తో పోలిస్తే సౌత్ స్టేట్స్ ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా వాటిలో తిరిగి పొందేది మాత్రం చాలా తక్కువని అన్నారు. ‘కేంద్రానికి మేం ఒక్క రూపాయి పంపిస్తే కేవలం రూ.40 పైసలు మాత్రమే తిరిగి వెనక్కి వస్తున్నాయి. అదే యూపీ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే రూ.7, బిహార్ కు రూ.6 వెనక్కి వస్తున్నాయి’ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా నిధుల విషయంలో మాత్రం వివక్ష జరుగుతూనే ఉంద‌న్నారు. ప్రధాని మోడీ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి కావటమే ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడానికి కారణ‌మ‌ని రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు.

అంత‌ర్జాతీయ స్థాయిలో బాపూ ఘాట్ అభివృద్ధి
అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామ‌న్నారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉంద‌ని, గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలా… బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోంద‌ని రేవంత్ విమ‌ర్శించారు. గాంధీ వారసులుగా తాము బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. దీన్ని బీఆరెస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయ‌ని నిల‌దీశారు. మీరు గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు కానీ మేము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే బీజేపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నార‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఎందుకంటే మేము గుజరాత్ కు పోటీ ఇవ్వబోతున్నామని అందువల్లే తెలంగాణను, హైదరాబాద్ ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు మా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్ కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే త‌మ‌ ప్రయత్నాలను ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రయత్నం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.

పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత సీఎం కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్ కు రాలేద‌ని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ‘ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదు? కేసీఆర్ ఆయనే ఫ్రీడం ఫైటర్ అని చెప్పుకుంటాడు. నాకేమీ అభ్యంతరం లేదు. తన ఫాంహౌస్‌లో పడుకొంటాడు. పదేళ్లలో ఒక్కసారి సచివాలయానికి రాలేదు. గత పది నెలల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. మీకు డెమొక్రసీపై గౌరవం ఉంటే ఎందుకు రావట్లేదు? తానో జమిందార్, ప్రజలందరూ గులాంలని కేసీఆర్ అనుకుంటాడు. అందుకే బయటరు రావడం లేదు. తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకుంటేనే మేము అధికారంలోకి వచ్చాం. మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారు. పార్లమెట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేసీఆర్ ప్రజల ఆలోచనను అర్థం చేసుకోవాలి. ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్కార్ ను పడగొట్టాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.

Exit mobile version