విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీ హాజరవుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సోనియాగాంధీని కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలకు హాజరుకావాలని ఆయన ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి తమ ఆహ్వానం మేరకు రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీ హాజరయ్యేందుకు అంగీకరించారని తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన నాయకురాలిగా, తెలంగాణ సమాజం ఆకాంక్షల మేరకు, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం మేరకు సోనియాగాంధీని రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగిందన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు ఇది సంతోషకరమైన వార్త అని, సోనియాగాంధీ రాక కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తుందన్నారు. ప్రజాపాలనలో జరుపుకుంటున్నరాష్ట్ర అవతరణ తొలి వేడులకు రాష్ట్రమిచ్చిన సోనియాగాంధీని హాజరుకానుండటం పట్ల టీపీసీసీ అధ్యక్షుడిగా, తెలంగాణ సీఎంగా తాను ఆమెకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని అందరికి రాష్ట్ర ఆవతరణ వేడుకలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.