రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ, ఆరెస్సెస్‌ కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రధాని మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్లకు మోకరిల్లి దేశ సంపదను వారికే దోచిపెడుతు పేద, మధ్యతరగతి ప్రజలపై ధరలు..పన్నుల భారం మోపి దేశాన్ని అప్పుల పాలు చేసిందని పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు

  • Publish Date - April 25, 2024 / 02:05 PM IST

  • రాజ్యాంగంపై ఆఖరి యుద్ధం చేస్తున్నారు
  • ఆరెస్సెస్‌ ఆవిర్భవించి 2025కి వందేళ్లు
  • ఆలోపే దేశంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
  • 400 సీట్లు అడిగేది రాజ్యాంగం మార్చేందుకే
  • బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకే
  • నాడు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్‌
  • నేడు ఓబీసీలకు వాటా దక్కేందుకు పోరాటం
  • అందుకే కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ దుష్ప్రచారం
  • కార్పొరేట్లకు మోకరిల్లిన మోదీ ప్రభుత్వం
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు
  • బీజేపీ నయవంచన.. పదేండ్ల మోసం..
  • వందేండ్ల విధ్వంసం పేరుతో చార్జిషీట్‌
  • ఆరెస్సెస్ భావజాలంపై సునిశిత దాడి

హైదరాబాద్‌: ఆరెస్సెస్‌ భావజాలం, బీజేపీ విధానం ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. మన దేశ రాజ్యాంగంపై ఆరెస్సెస్‌, బీజేపీ ఆఖరి యుద్ధాన్ని ప్రకటించాయని అన్నారు. ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దు అని తెలిపారు. ‘ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేన్లు రద్దు చేయాలంటే బీజేపీకి రెండింట మూడొంతుల మెజార్టీ కావాలి. అందుకే 400 సీట్లలో గెలిపించాలని చెబుతున్నారు. మూడింట రెండొంతుల మెజార్టీతో పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసుకుని, రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొచ్చి, రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తున్నది’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాంధీభవన్‌లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నయవంచన.. పదేండ్ల మోసం.. వందేండ్ల విధ్వంసం పేరుతో కాంగ్రెస్ రూపొందించిన చార్జిషీట్‌ను రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆరెస్సెస్ భావజాలంపై నిశితంగా విమర్శలు గుప్పించారు. నాడు మండల్‌ కమిషన్‌ తెస్తే.. కమండల్‌ అన్నారు
1925వ సంవత్సరంలో మొదలైన ఆరెస్సెస్‌.. వంద సంవత్సరాలు పూర్తయ్యేలోపు దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని తీసుకున్నదని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘2025కు ఆరెస్సెస్‌ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తికాబోతున్నాయి. అప్పటికల్లా రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతో ఆరెస్సెస్‌ ఉన్నది. ఆరెస్సెస్‌ పెద్దలు గతంలో చాలాసార్లు రిజర్వేషన్ల రద్దు విషయాన్ని ప్రస్తావించారు. గతంలో మండల్‌ కమిషన్‌ అంశం ముందుకు వచ్చినప్పుడు కమండల్‌ తీసుకువచ్చారు. అద్వానీ దేశం మొత్తం రథయాత్ర చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి.. రెండు జాతుల మధ్య పంచాయితీ పెట్టి, మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలుకాకుండా అడ్డుకున్నది. ఆ రోజు మీడియాలో మండల్‌ వర్సెస్‌ కమండల్‌ అంటూ చాలా కథనాలు వచ్చాయి’ అని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ‘ఈ రోజు కూడా రాహుల్‌గాంధీ ఓబీసీ జనాభాను లెక్కించి, వాళ్ల నియామకాల విషయంలో, నిధుల విషయంలో స్పష్టమైన గిరిగీయాలని అనుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఓబీసీల పక్షాన నిలబడటంతోనే బీజేపీ కుట్ర చేసి, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విష ప్రచారం చేసి, ఎట్లయిన గెలిచి రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా.. బీజేపీకి మీరు వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు రద్దు కావటానికి ఉపయోగపడుతుంది. బీజేపీ ఒక్క సీటు గెలిచినా.. మీ హక్కులను కాలరాయడానికే ఆ బలం ఉపయోగపడుతుంది. మీరు ఆలోచన చేసి, నిర్ణయం తీసుకోండి’ అని పిలుపునిచ్చారు. బీజేపీకి మంద కృష్ణమాదిగ మద్దతు ఇస్తున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి.. రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్నవారు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ‘కొండనాలికకు మందేస్తే ఉన్న నాలిక ఊషిపోయిందన్నట్టు.. మీరు తాత్కాలిక స్థానిక రాజకీయ లబ్ధికి కోసం బీజేపీకి మద్దతు ఇస్తే అది నూటికి నూరుశాతం రిజర్వేషన్ల రద్దుకు దారి తీస్తుంది’ అని హెచ్చరించారు. రిజర్వేషన్లు ఉండాల్నా, రద్దు కావాల్నా అనే అనే అంశంపై ఈ ఎన్నికలు రెఫరెండమని రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్‌ పార్టీ రిజర్వేషన్లు ఉండాలని అనుకుంటున్నదని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీకు అండగా నిలబడాలని కోరుకుంటున్నదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఓబీసీ కుల గణన చేపడితే.. రిజర్వేషన్లు 70 నుంచి 75 శాతానికి పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ఈ రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

కార్పొరేట్లకు మోకరిల్లిన మోదీ సర్కార్‌
ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మోకరిల్లి, దేశ సంపదను వారికే దోచిపెడుతున్నదని, పేద, మధ్యతరగతి ప్రజలపై ధరలు.. పన్నుల భారం మోపి దేశాన్ని అప్పులపాలు చేసిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే అంబానీ, అదానీయేనని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో దేశ నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమలను మోదీ ప్రైవేటుపరం చేసి, జాతి సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నాడని మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని ఇచ్చిన హామీ మేరకు పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. కానీ బీజేపీ హయాంలో 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ సర్కార్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని.. రూ.15 పైసలు కూడా వేయలేదని ఎద్దేవా వేశారు.

మోదీ పాలనలో దేశం అప్పులపాలు
అగ్గిపెట్టె, అగరుబత్తి మీద కూడా మోదీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. 67 సంవత్సరాల్లో 14 మంది ప్రధానులు 55 లక్షల కోట్లు అప్పు చేస్తే.. ఈ పదేళ్లలో మోదీ 113 లక్షల కోట్ల అప్పులు చేశారని వివరించారు. నయా భారతాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని నుండిపడ్డారు. 60 ఏళ్లు కాంగ్రెస్ దేశానికి కూడబెట్టిన 60 లక్షల కోట్ల ఆస్తులను మోదీ పదేళ్లలో 6 లక్షల కోట్లకు కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేశారని విమర్శించారు. ఎల్‌ఐసీ సహా ప్రతి ప్రభుత్వ సంస్థను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, జాతీయరహదారులు కార్పొరేట్లకు కట్టబెట్టారని చెప్పారు. డబుల్ ఇంజిన్ పేరిట బీజేపీ దేశాన్ని లూటీ చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు టీ జగ్గారెడ్డి, బీ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News